Stock market: సూచీల్లో కొనసాగుతున్న లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నేడు ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.....

Updated : 22 Dec 2021 10:13 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నేడు ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను ఒడిసిపట్టాయి. అయితే, ఇటీవలి భారీ పతనం నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు అందరినీ కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. గత రెండు దశల అనుభవంతో వైద్యారోగ్య వసతులను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు యావత్తు యంత్రాంగం సిద్ధంగా ఉందన్న సంకేతాలు కొంత సానుకూలతలు తెచ్చి పెడుతున్నాయి. మరోవైపు అమెరికాలో లాక్‌డౌన్‌లు ఉండబోవని అధ్యక్షుడు జో బైడెన్‌ తేల్చి చెప్పడం సానుకూల అంశంగా మదుపర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అయితే, ఈ లాభాలు ఎంత వరకు నిలబడతాయన్నది మాత్రం చూడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 సెన్సెక్స్‌                                      నిఫ్టీ

56,682    +363        16,880    +109     

ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 363 పాయింట్ల లాభంతో 56,682 వద్ద.. నిఫ్టీ 109 పాయింట్లు లాభపడి 16,880 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.58 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో విప్రో, పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు రాణిస్తున్న వాటిలో ఉన్నాయి.

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...

* జీ ఎంటర్‌టైన్‌మెంట్‌.. సోనీతో చేసుకున్న విలీన ఒప్పందం దాదాపు ఖరారైంది. త్వరలో తుది నిబంధనలు ఖరారు కానున్నాయి. 90 రోజుల పాటు సాగిన చర్చలు ఫలించాయి.

* ఎస్‌బ్యాంక్‌.. కొత్త షేర్లు, డెట్‌ లేదా ఇతర ఆమోదయోగ్య మార్గాల ద్వారా రూ.10 వేల కోట్ల సమీకరణకు అనుమతి లభించింది.

* జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ.. కంపెనీ అనుబంధ సంస్థ అయిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ(బార్‌మేర్‌‌) లిమిటెడ్‌ రూ.1000 కోట్లు విలువ చేసే షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియ పూర్తయింది.

* ఐఓసీ.. హల్దియా శుద్ధి కేంద్రంలో చెలరేగిన మంటల్లో ముగ్గురు మరణించారు. మరో 44 మందికి గాయాలయ్యాయి.

* సహ్యాద్రి ఇండస్ట్రీస్‌.. ఈ ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించారు.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని