Stock market: కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి.. 2022కి సూచీల ఘన స్వాగతం!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొత్త సంవత్సరానికి లాభాలతో స్వాగతం పలికాయి. నూతన సంవత్సరంపై మదుపర్ల ఆశలతో మార్కెట్లు నేడు కళకళలాడాయి....

Updated : 03 Jan 2022 16:36 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock Market) సూచీలు కొత్త సంవత్సరానికి లాభాలతో స్వాగతం పలికాయి. నూతన సంవత్సరంపై మదుపర్ల ఆశలతో మార్కెట్లు సోమవారం కళకళలాడాయి. సెన్సెక్స్‌(Sensex) కీలక 59,000 మైలురాయిని మళ్లీ చేరుకోగా.. నిఫ్టీ(Nifty) 17,500 మార్క్‌ను దాటింది.

సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 58,310.09 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆద్యంతం అదే జోరును కొనసాగించిన సూచీ 59,266.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 929.40 పాయింట్ల లాభంతో 59,183.22 వద్ద ముగిసింది. 17,387.15 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,646.65 - 17,383.30 మధ్య కదలాడింది. చివరకు 264.75 పాయింట్లు లాభపడి 17,618.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.29 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌30 సూచీలో లాభపడ్డ/నష్టపోయిన షేర్లు

కొత్త ఆశలతోనే పరుగు..

ఈరోజు ఆద్యంతం మార్కెట్లలో కొత్త సంవత్సరం జోష్‌ కనిపించింది. 2021 తరహాలోనే ఈ ఏడాది కూడా మార్కెట్లలో మదుపర్లకు లాభాల పంట పండనుందన్న అంచనాలు సూచీలకు కొత్త కళనిచ్చాయి. పైగా గత ఏడాది చివరలో అమ్మకాలకు దిగిన విదేశీ మదుపర్లు తిరిగి కొత్తగా భారత్‌కు రానున్నారన్న అంచనాలూ కలిసొచ్చాయి.

మరోవైపు త్రైమాసిక ఫలితాలు, బడ్జెట్‌(Budget) అంచనాలు వంటి పరిణామాలూ సూచీలకు దన్నుగా నిలిచాయి. డిసెంబరులో ఆటో విక్రయాలు కాస్త మెరుగుపడడం కూడా మదుపర్ల  ఆశలను పెంచింది. ఈ ఏడాది వాహన రంగానికి మంచి రోజులు రానున్నాయన్న అంచనాలు ఆ రంగ షేర్లకు బలాన్నిచ్చింది. మరోవైపు ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నప్పటికీ.. లక్షణాల తీవ్రత మాత్రం స్వల్పంగానే ఉంటుందన్న అధ్యయనాలు మార్కెట్ల సెంటిమెంటును పెంచింది. అలాగే దేశీయంగా టీనేజీ పిల్లలకు ప్రారంభించిన కరోనా టీకా కార్యక్రమానికి మంచి స్పందన లభించడం కూడా మార్కెట్లకు మద్దతుగా నిలిచింది. అలాగే కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ పూర్తి స్థాయి ఆంక్షలు విధించకపోవడాన్ని మార్కెట్లు పాజిటివ్‌గా తీసుకున్నాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లు వరుసగా ఎనిమిదో రోజూ లాభపడ్డాయి. ఈ కంపెనీ షేర్లు మార్కెట్లో లిస్టయిన తర్వాత వరుసగా ఇన్ని రోజులు లాభపడడం ఇదే తొలిసారి. 

* ఓ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 విద్యుత్తు బస్సులకు ఆర్డర్‌ అందడంతో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ షేర్లు 5 శాతం ఎగబాకాయి. ఈ ఆర్డర్‌ విలువ రూ.125 కోట్లు. 

* ఐషర్‌ మోటార్స్‌ డిసెంబరు విక్రయాల్లో 50.6 శాతం వృద్ధి నమోదైంది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు దాదాపు 6 శాతం మేర లాభపడ్డాయి. 

* నిఫ్టీ బ్యాంకు సూచీలోని 12 బ్యాంకుల్లో 11 లాభపడ్డాయి. ఒక్క బంధన్ బ్యాంకు మాత్రమే నష్టపోయింది. 

* ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. యూఎస్‌ ఫ్యూచర్స్ సైతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని