Updated : 31 Dec 2021 17:25 IST

ITR: ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంచే యోచన లేదు.. స్పష్టం చేసిన కేంద్రం

దిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు (ITR) గడువును పెంచే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదనేమీ తమ వద్దకు రాలేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐటీఆర్‌ దాఖలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతోందన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 5.62 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయన్నారు. ఈ ఒక్కరోజు 20 లక్షల మంది రిటర్నులు సమర్పించారన్నారు. ఈ ఏడాది 60 లక్షల అదనపు రిటర్నులు దాఖలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఐటీఆర్‌ దాఖలుకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో మరో అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం దీనిపై స్పష్టతనిచ్చింది. నేడు జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో తరుణ్‌ బజాజ్‌ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


చేనేతపై జీఎస్టీ పెంపు నిర్ణయం కమిటీకి..

కొన్ని వస్తువులపై విధించిన జీఎస్టీ పెంపుపై చర్చించాలన్న ఏకైక ఎజెండాతో జీఎస్టీ మండలి ఇవాళ భేటీ అయ్యిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. చేనేత, జౌళిపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కకు పెట్టామని తెలిపారు. ఈ విషయంపై మరింత లోతైన సమీక్ష జరిపేందుకు ‘పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కమిటీ’కి పంపామని పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికి ఈ కమిటీ తమ నివేదికను సమర్పిస్తుందని వెల్లడించారు. ఇక పాదరక్షలపై విధించిన జీఎస్టీ పెంపును రేపటి (జనవరి 1) నుంచి అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.


అఖిలేశ్‌..  మీరు పీయూష్‌ జైన్‌ భాగస్వామా?

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ‘నల్లధన కుబేరుడు’ పీయూష్‌ జైన్‌పై ఆదాయపు పన్ను శాఖ పొరపాటున దాడి చేసిందంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చేస్తున్న ఆరోపణలపై సీతారామన్‌ స్పందించారు. పక్కా సమాచారంతో సరైన వ్యక్తిపైనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారని తెలిపారు. అలాగే శుక్రవారం ఎస్పీకి చెందిన ఎమ్మెల్సీ, అత్తరు వ్యాపారి పుష్పరాజ్‌ జైన్‌పై ఐటీ దాడులు ముందస్తు సమాచారం మేరకే జరుగుతున్నాయని తెలిపారు. పీయూష్‌ జైన్‌ ఇంట్లో దొరికిన సొమ్మంతా భాజపాదేనంటూ వస్తున్న ఆరోపణల్ని ఆమె ఖండించారు. ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఐటీ దాడులతో వణికిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. పీయూష్‌ జైన్‌ ఇంట్లో దొరికిన సొమ్ము ఎవరిదో అఖిలేశ్‌ ఎలా చెప్పగలుగుతారని ప్రశ్నించారు. ‘‘ఆ సొమ్ము ఎవరిదో మీకు ఎలా తెలుసు? మీరు అతడి భాగస్వామా?ఎవరి సొమ్ము దాచారన్నది కేవలం భాగస్వాములకు మాత్రమే తెలుస్తుంది’’ అని అఖిలేశ్‌కు చురకలంటించారు. తనిఖీలు జరుపుతున్న అధికారులు వట్టి చేతులతో రావడం లేదని.. అలాంటప్పుడు దీంట్లో రాజకీయ కుట్ర ఉందని ఎలా ఆరోపించగలరని ప్రశ్నించారు.

పీయూష్‌ జైన్‌ భాజపాకు చెందిన వ్యక్తి అని ఇటీవల అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ప్రభుత్వం అతడిపై పొరపాటున దాడి చేయించిందన్నారు. అతడి కాల్‌ డేటాని చూస్తే టచ్‌లో ఉన్న భాజపా నేతల పేర్లు బయటపడతాయన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పుష్పరాజ్‌ జైన్‌ బదులుగా డిజిటల్‌ మిస్టేక్‌ వల్ల పీయూష్‌ జైన్‌ ఇంట్లో దాడులు జరిగాయని ఆరోపించారు. ఇటీవల ఐటీ శాఖతో పాటు సీబీఐటీ, కస్టమ్స్‌ అధికారులు కాన్పూర్‌కు చెందిన అత్తరు వ్యాపారి పీయూష్‌ జైన్‌ ఇంటిపై జరిపిన దాడుల్లో రూ.257 కోట్ల డబ్బుతో పాటు 25 కిలోల బంగారం, 250 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts