Personal Loan: పర్సనల్‌ లోన్‌ను ఎప్పుడు బదిలీ చేయాలంటే..?

పర్సనల్ లోన్‌ బదిలీ వల్ల ఉన్న లాభనష్టాలేంటో చూద్దాం..!

Published : 13 Dec 2021 10:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యవసర ఆర్థిక పరిస్థితులు తలెత్తినప్పుడు వ్యక్తిగత రుణాలు(పర్సనల్‌ లోన్స్‌) ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇటీవలి పండగ సీజన్‌ నేపథ్యంలో చాలా వరకు బ్యాంకులు, ఇతర సంస్థలు రుణాలు అందజేయడానికి కొన్ని ఆఫర్లను ప్రకటించాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే, కొవిడ్‌ భయాలు ఇంకా వెంటాడుతున్న నేపథ్యంలో మరో వేవ్‌ రావడానికి ముందే అప్పుల భారాన్ని తగ్గించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ఉన్న మార్గాల్లో రుణాన్ని ఇతర బ్యాంకులకు బదిలీ చేయడం ఒకటి. మరి దీంట్లో ఉన్న లాభనష్టాలేంటో తెలుసుకుందాం..

ప్రయోజనాలు..

రుణాన్ని బదిలీ చేయడం ద్వారా పలు ప్రయోజనాలు ఉంటాయి. వడ్డీరేటుని తగ్గించే అవకాశం ఉంది. చాలా వరకు బ్యాంకులు టాప్‌ అప్‌ లోన్‌ని కూడా మంజూరు చేస్తాయి. అంటే ఉన్న రుణానికి అదనంగా మరికొంత ఇవ్వడన్నమాట! మనం ఏ బ్యాంకుకైతే లోన్‌ని బదిలీ చేస్తున్నామో.. వారే రుణ మొత్తాన్ని మొదటి బ్యాంకుకి చెల్లిస్తారు. పైగా టాప్‌-అప్‌ తీసుకుంటే ఆ మొత్తాన్ని మన ఖాతాలో జమ చేస్తారు. పైగా తొలి బ్యాంకుతో పోలిస్తే వడ్డీరేటు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు మీ క్రెడిట్‌ హిస్టరీ బాగుండి.. మీరు క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తున్నట్లయితే ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు వంటి ఇతర ప్రయోజనాలను కూడా కల్పిస్తారు.

ప్రతికూలతలు..

కొన్ని అదనపు రుసుములు చెల్లించాల్సి రావొచ్చు. సాధారణంగా బ్యాంకులు ముందుస్తు చెల్లింపులకు 0.5-3 శాతం ఛార్జీలు వసూలు చేస్తాయి. ఇది మిగిలి ఉన్న రుణ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. పైగా కొత్త బ్యాంకుకి మారడం వల్ల రుణ కాలపరిమితి మారొచ్చు. ఇది మీ ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపొచ్చు. ఈ నేపథ్యంలో రుణ బదిలీకి ముందు వీటన్నింటినీ బేరీజు వేసుకొని మీకు లాభదాయకమనిపిస్తేనే ముందుకు వెళ్లండి.

ఇవి గుర్తుంచుకోవాలి..

వడ్డీరేటులో గణనీయ తగ్గింపు ఉంటేనే బదిలీకి ముందుకు వెళ్లడం మేలు. లేదంటే కొత్త బ్యాంకులో ఉండే ప్రాసెసింగ్‌ ఫీజులు అన్నీ కలుపుకొంటే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కొన్ని సార్లు బ్యాంకులు మిమ్మల్ని ఆకర్షించడానికి వడ్డీరేటుని, నెలవారీ ఈఎంఐని తగ్గించి చూపించే అవకాశం ఉంది. కానీ, కాలపరిమితిని మాత్రం పెంచుతారు. ఇది జాగ్రత్తగా గమనించాలి. లేదంటే మొత్తంగా చూసుకుంటే మొదటి బ్యాంకు కంటే దీనికి ఎక్కువ చెల్లించాల్సి రావొచ్చు. అలాగే కొన్ని బ్యాంకులు ఆర్‌బీఐ రెపో రేటును అనుసరించి వడ్డీరేటును మారుస్తూ ఉంటాయి. ఈ ప్రయోజనం పొందాలనుకునే వారు రుణ బదిలీ చేసుకోవచ్చు.

ఇప్పటికే గృహరుణం ఉంటే..

కొంతమంది గృహ రుణం ఉండగానే.. వ్యక్తిగత రుణం తీసుకుంటుంటారు. అలాంటి వారు పర్సనల్‌ లోన్‌ని క్లోజ్‌ చేసుకోవడం మంచిది. అందుకోసం హోంలోన్‌పై టాప్‌-అప్‌ తీసుకోవాలి. దాంతో వ్యక్తిగత రుణాన్ని చెల్లించాలి. పర్సనల్‌ లోన్‌తో పోలిస్తే.. గృహ రుణానికి తక్కువ వడ్డీరేటు ఉంటుంది. వ్యక్తిగత రుణాన్ని బదిలీ చేసుకోవడం కంటే కూడా ఇది ఉత్తమమైన మార్గం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు