Equity MFs: వీరు ఈక్విటీ ఎంఎఫ్‌లలో పెట్టుబడి పెట్టొద్దు!

ఎలాంటి వారు ఈక్విటీ ఎంఎఫ్‌లలో మదుపు చేయడం సరికాదో ఓసారి చూద్దాం....

Published : 13 Nov 2021 11:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీర్ఘకాలంలో సంపద సృష్టికి సులువైన మార్గం మ్యూచువల్‌ ఫండ్లు(ఎంఎఫ్‌). ఈక్విటీ, డెట్‌ లేదా ఈ రెండింటి మిశ్రమంగా ఉండే ఎంఎఫ్‌లలో.. ఈక్విటీ ఫండ్లు దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలకు సరిగ్గా సరిపోతాయి. పేరు సూచిస్తున్నట్లుగా ఈక్విటీ ఫండ్లలో పెట్టే పెట్టుబడిని ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్‌లో మదుపు చేస్తారు. దీంతో వీటి నుంచి వచ్చే ఆదాయం పూర్తిగా మార్కెట్‌ ఆధారితమైనది. అంటే స్థిరమైన, హామీతో కూడుకున్న రాబడి ఉండకపోవచ్చు. అయితే, చరిత్ర గమనిస్తే.. స్టాక్‌ ఎక్స్ఛేంజీలు దీర్ఘకాలంలో పైకి ఎగబాకుతూ వెళ్లాయి. పైగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడినిచ్చాయి. కాబట్టి, మన లక్ష్యం 7-10 ఏళ్లయితే ఈక్విటీ ఎంఎఫ్‌లు మంచి ఫలితాన్నిస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది మీ అవసరాన్ని తీర్చకపోవచ్చు. అలాంటప్పుడు వేరే పెట్టుబడి మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. మరి ఎలాంటి వారు ఈక్విటీ ఎంఎఫ్‌లలో మదుపు చేయడం సరికాదో ఓసారి చూద్దాం..

స్థిర ఆదాయం కావాలనుకునేవారు..

ఉద్యోగ విరమణ చేసినవాళ్లు లేదా విరమణకు దగ్గరగా ఉన్నవాళ్లకు స్థిరమైన ఆదాయం చాలా ముఖ్యం. వారి ఖర్చులు పూర్తిగా వాటిపైనే ఆధారపడి ఉంటాయి. సంపదను సృష్టించడం కంటే.. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకోవడమే వారి ప్రథమ లక్ష్యం. అందుకే వారికి స్థిరమైన రాబడినిచ్చే పెట్టుబడి పథకాలే సరిపోతాయి. పైగా వీరు దీర్ఘకాలం మదుపు చేయలేరు. కాబట్టి మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనైతే.. పెట్టిన పెట్టుబడి కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరికి మ్యూచువల్‌ ఫండ్ల కంటే స్థిర రాబబడినిచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వంటివి సరిగ్గా సరిపోతాయి.

ద్రవ్యోల్బణంతో ఆందోళన లేనివారు..

కాలం గడుస్తున్న కొద్దీ ద్రవ్యోల్బణం రూపాయి విలువను తగ్గిస్తుంది. ఇప్పుడు మీ నెలవారీ ఖర్చులకు రూ.65 వేలు అవసరమనుకుంటే.. 5 శాతం ద్రవ్యోల్బణం లెక్కన 15 ఏళ్ల తర్వాత అవే అవసరాలు తీరాలంటే రూ.1.35 లక్షలు కావాల్సి ఉంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని అధిగమించాలంటే ఎక్కువ మొత్తంలో మదుపు చేయాలి. లేదంటే ఎక్కవ రాబడినిచ్చే పథకాల్లోనైనా ఇన్వెస్ట్‌ చేయాలి. అయితే, కొంతమందికి ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే వారికి రిస్క్‌ తీసుకునే స్తోమత ఉంటుంది. అలాంటి వారు ఎంఫ్‌ల కంటే ఈక్విటీల్లో మదుపు చేయడం వల్ల అధిక లాభాలను ఆర్జించవచ్చు.

అత్యవసర పరిస్థితులు రావచ్చనుకేనేవారు...

ఈక్విటీ ఎంఎఫ్‌ల నిధిని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. అంటే మార్కెట్‌లో వచ్చే ఒడుదొడుకులకు అనుగుణంగానే రాబడి ఉంటుంది. అయితే, మీరు అత్యవసరంగా ఎంఎఫ్‌ నుంచి నిష్క్రమించాల్సిన అవసరం వచ్చిందనుకుందాం. సరిగ్గా అదే సమయంలో మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలో ఉంటే.. అప్పటి వరకు మీరు ఆర్జించిన రాబడిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని మీరు భావిస్తే ఈక్విటీ ఎంఎఫ్‌ల జోలికి వెళ్లొద్దు.

ఒక నిర్దిష్టమైన పెట్టుబడి కేటాయింపులు వద్దనుకునేవారు..

తెలివైన ఇన్వెస్టర్లు వారి పెట్టుబడిని వివిధీకరిస్తారు(డైవర్సిఫికేషన్‌). అయితే, కొంత మంది మాత్రం రిస్కు తీసుకునేందుకు సిద్ధపడి ఒకే పెట్టుబడి మార్గంపై ఆధారపడతారు. బంగారం ధర పెరుగుతుందని భావిస్తే.. అందులో మదుపు చేస్తారు. స్థిరాస్తి రంగం పుంజుకుంటే అందులో పెట్టుబడి పెడతారు. లేదా మార్కెట్‌ బుల్లిష్‌గా ఉందంటే.. వెంటనే అందులోకి పెట్టుబడులను మళ్లిస్తారు. ఇలా ఒక దాంట్లో స్థిరంగా ఉండకుండా.. మార్కెట్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకనుగుణంగా వారి పెట్టుబడులను మళ్లిస్తుంటారు. ఎక్కువ రాబడిని ఆర్జించే క్రమంలోనే ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే, చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం.. ఏమాత్రం అంచనాలు తప్పినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే, మార్కెట్‌పై మంచి పట్టున్నవారే ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇలా తమ పెట్టుబడుల్లో వివిధీకరణ అవసరం లేదనుకునేవారు ఈక్విటీ ఎంఎఫ్‌లను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వల్పకాలంలో ఆశించిన స్థాయిలో రాబడినివ్వలేవు.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని