Published : 24 Dec 2021 10:56 IST

Unicorns 2021: భారత స్టార్టప్‌ల సత్తా.. ఈ ఏడాదిలోనే యూనికార్న్‌ జాబితాలోకి 42 కంపెనీలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత అంకుర సంస్థలపై ప్రపంచానికి విశ్వాసం పెరుగుతోంది. ఈ ఏడాది అనేక అంతర్జాతీయ స్థాయి పెట్టుబడి సంస్థలు మన దేశ స్టార్టప్‌లలో నిధులు కుమ్మరించాయి. ఫలితంగా నెలకు సగటున 3 సంస్థలు యూనికార్న్‌ల జాబితాలో చేరాయి. మనదేశంలో ఈ ఏడాది ఓ డజను కంపెనీలు యూనికార్న్‌ హోదా సాధిస్తాయని జనవరిలో నాస్కామ్‌ అంచనా వేసింది. అలాంటిది సంవత్సరాంతానికి ఏకంగా 42 కంపెనీలు ఆ జాబితాలో చేరిపోయాయి. ఒక వారంలోనైతే ఏకంగా ఆరు సంస్థలు యూనికార్న్‌ కంపెనీలైపోయిన సందర్భాలూ ఉన్నాయి.

ఏమిటీ యూనికార్న్?

గ్రీకు పురాణకథల్లో మాత్రమే కన్పించే గుర్రంలాంటి ఒంటికొమ్ము జంతువుని ‘యూనికార్న్‌’ అంటారు. కౌబాయ్‌ వీసీ అనే వెంచర్‌ కాపిటల్‌ సంస్థ వ్యవస్థాపకురాలైన ఐలీన్‌ లీ ఈ పదాన్ని మొదటిసారి 2013లో వాడారు. బిలియన్‌ డాలర్ల విలువ చేసే కంపెనీల గురించి వ్యాసం రాస్తూ ఇలాంటి కంపెనీలు అరుదుగా ఉంటాయని చెప్పడానికి ‘యూనికార్న్‌’ అనే పదాన్ని ఉపయోగించారు. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 39 మాత్రమే యూనికార్న్‌ సంస్థలున్నాయట! 2018 నాటికి వాటి సంఖ్య 119కి చేరగా.. ఇప్పుడు దాదాపు 900 అయ్యాయి. పది బిలియన్‌ డాలర్లు దాటినవాటిని ‘డెకాకార్న్‌’ అనీ వంద బిలియన్‌ డాలర్లు దాటినవాటిని ‘హెక్టాకార్న్‌’ లేదా ‘సూపర్‌ యూనికార్న్‌’ కంపెనీలనీ అంటున్నారు.

గతేడాది 14 కంపెనీలు..

2011లో ఇన్‌మొబి మన దేశం నుంచి తొలి యూనికార్న్‌ కంపెనీగా అవతరించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఏటా ఒకటీ రెండూ చొప్పున కంపెనీలు ఆ జాబితాలో చేరుతూ రాగా .. 2018నుంచి వేగం పుంజుకుంది. ఆ ఏడాది బైజూస్‌, స్విగ్గీ, ఉడాన్‌, జొమాటో లాంటి ఏడు సంస్థలు, 2019లో బిగ్‌బాస్కెట్‌, జోహో, లెన్స్‌కార్ట్‌, బిల్‌డెస్క్‌ లాంటి పది సంస్థలు యూనికార్న్‌ కంపెనీలు అయ్యాయి. 2020లో కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార రంగం తీవ్రంగా నష్టపోయినా మన దేశం నుంచి 14 కంపెనీలు బిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరడంతో పెట్టుబడిదారుల దృష్టి భారతదేశం మీదికి మళ్లింది.

భారత్‌లో ఎన్ని ఉన్నాయి?

భారత్‌లో ఇప్పటి వరకు 82 యూనికార్న్‌లు ఉన్నాయి. వీటి విలువ 265 బిలియన్ డాలర్లు. ఇక ఈ సంవత్సరంలో పుట్టుకొచ్చిన 42 కంపెనీల విలువ దాదాపు 85 బిలియన్ డాలర్లు. యూనికార్న్‌గా అవతరించే క్రమంలో ఒక్కో సంస్థది ఒక్కో ప్రయాణం. కొన్ని కంపెనీలు నెలల్లోనే 1 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరితే.. మరికొన్నింటికి 30 సంవత్సరాలు పట్టింది. 2021లో మనుగడలోకి వచ్చిన మెన్సా బ్రాండ్స్‌ అనే కంపెనీ కేవలం 6 నెలల్లోనే యూనికార్న్‌గా మారింది. ఆసియాలో వేగంగా యూనికార్న్‌ జాబితాలో చేరిన కంపెనీ ఇదే కావడం విశేషం.

ఏమిటీ ఈ ఏడాది ప్రత్యేకత?

కరోనా సంక్షోభంతో 2020లో యావత్తు ప్రపంచం కొట్టుమిట్టాడుతున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం 14 యూనికార్న్‌లు అవతరించాయి. ఇది ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని భారత్‌ వైపు మరల్చింది. మరోవైపు భారత స్టార్టప్‌లు కరోనా సంక్షోభాన్ని ఒక అవకాశంగా భావించాయి. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన అనేక సమస్యలకు పరిష్కారం చూపేందుకు విశేషంగా కృషి చేశాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడంతో పాటు కొవిడ్‌ నివారణకు ఎంతగానో దోహదం చేశాయి. దీంతో ప్రపంచ పెట్టుబడి సంస్థలకు భారత అంకురాలపై విశ్వాసం పెరిగింది. ముఖ్యంగా ఫిన్‌టెక్‌, ఈ-కామర్స్‌, సాఫ్ట్‌వేర్‌, డేటా మేనేజ్‌మెంట్‌ అండ్‌ అనలిటిక్స్‌, గేమింగ్‌, హాస్పిటాలిటీ వంటి రంగాల్లోకి భారీ పెట్టుబడులు వచ్చాయి.

టాప్‌-35లో బైజూస్‌..

అంతర్జాతీయంగా టాప్‌-35 యునికార్న్‌లలో మాత్రం మన దేశం నుంచి ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూస్‌ ఒక్కటే స్థానం దక్కించుకుంది. దేశీయంగా 21 బిలియన్ డాలర్ల విలువ కలిగిన తొలి స్టార్టప్‌గా బైజూస్‌ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 13వ అత్యంత విలువైన అంకుర సంస్థ ఇదేనని సీబీ ఇన్‌సైట్స్‌ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్యుటెక్ సంస్థగా నిలిచి రికార్డు సృష్టించింది.

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యూనికార్న్‌లు..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 943 యూనికార్న్‌ సంస్థలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 3,053 బిలియన్‌ డాలర్లు. వీటిలో 51 శాతం కంపెనీలు అమెరికాకు చెందినవే కావడం గమనార్హం. తర్వాతి స్థానంలో చైనా, భారత్‌ ఉన్నాయి. ఇక ఈ  ఏడాది చైనాలో టెక్‌ సంస్థలపై అక్కడి ప్రభుత్వం ఆంక్షల పేరిట తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డప్పటికీ స్టార్టప్‌లు భారీ స్థాయిలోనే పెట్టుబడులను సమకూర్చుకున్నాయి. అమెరికా తర్వాత ఈ ఏడాది యూనికార్న్‌ల జాబితాలోకి అత్యధిక కంపెనీలు చేరింది చైనా నుంచే కావడం గమనార్హం.


ఈ ఏడాది యూనికార్న్‌ జాబితాలో చేరిన కంపెనీలివే..


భారత్‌లో టాప్‌-5 యూనికార్న్‌లివే..

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని