Kakeibo Technique: ఈ జపాన్‌ టెక్నిక్‌తో నెలకు 35 శాతం డబ్బు ఆదా!

మరి కకేబో అంటే ఏంటి.. అంది ఎలా పనిచేస్తుందో చూద్దాం....

Updated : 23 Nov 2021 12:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డబ్బు ఆదా చేయడం కోసం శతాబ్దాలుగా జపాన్‌లో ‘కకేబో’ అనే పద్ధతిని ఉపయోగిస్తున్నారు. జాగ్రత్తగా ఖర్చు చేయడంతో పాటు వివిధ అవసరాలకు డబ్బు ఎలా కేటాయించాలో ఈ విధానం తెలియజేస్తుంది. దీన్ని పాటించడం చాలా సులభం. పైగా అందరి జీవితాలకూ ఇది సరిగ్గా సరిపోతుంది. నెలకు దాదాపు 35 శాతం వరకు అధికంగా ఆదా చేయొచ్చని దీన్ని పాటించేవారు చెబుతుంటారు. దీనికి ఎలాంటి సాంకేతికత అవసరం లేదు. ఒక పెన్ను, పేపర్‌ ఉంటే సరిపోతుంది. మరి కకేబో అంటే ఏంటి.. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం..!

కకేబో అంటే...

జపాన్‌ భాషలో కకేబో అంటే ‘ఇంటి పద్దు పుస్తకం’ అని అర్థం. అంటే మన ఇంటి ఆదాయ, వ్యయాలను నమోదు చేసే పుస్తకమన్నమాట! ఈ పుస్తకంలో కొన్ని ప్రామాణిక ప్రశ్నలు, ఖర్చులు, పొదుపు లక్ష్యాలు, కొనుగోళ్ల ప్రాథమ్యాలు, నెలవారీ సమీక్షల వంటి వాటిని పొందుపరచాలి. ఇప్పుడు అనేక బడ్జెట్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అవన్నింటికీ ఒక రకంగా చెప్పాలంటే ఈ కకేబోనే ఆధారం! అయితే, ఈ పద్ధతిలో ఎలాంటి డౌన్‌లోడ్‌లు, బ్యాంకు ఖాతా నెంబర్లు, లింక్‌లు అవసరం లేదు. పాతకాలం పద్ధతిలో వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి ఉంటుంది అంతే. జపాన్‌లో పుట్టిన ఈ విధానానికి ఇప్పుడు అమెరికాలో విశేష ఆదరణ లభిస్తోంది. హనీ మొటొకో అనే జర్నలిస్ట్‌ తొలిసారి దీని గురించి ఓ మ్యాగజైన్‌లో రాశారు. 2018లో దీనిపై ఏకంగా ఓ పుస్తకమే అచ్చయ్యింది.

ఎలా పనిచేస్తుంది?

📝 ఒక పెన్ను పేపర్‌ తీసుకోండి. కాలిక్యులేటర్లు, గ్యాడ్జెట్స్‌లోని నోట్‌ప్యాడ్‌లు ఉపయోగించొద్దు. ఎందుకంటే పెన్ను, పేపర్‌తో రాయడం వల్ల మెదడుపై ఉన్న ప్రభావం గ్యాడ్జెట్ల వల్ల ఉండకపోవచ్చు.

📝 మీ నెలవారీ ఆదాయాన్ని రాయండి. అందులో నుంచి స్థిర వ్యయాలను తీసేయండి. దీనికి కూడా కాలిక్యులేటర్లు ఉపయోగించొద్దు.

📝 నెలవారీ పొదుపు లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఈఎంఐలు, నిత్యావసరాలు, అద్దె వంటి స్థిర వ్యయాలు పోయిన తర్వాత మిగిలిన సొమ్ముతోనే పొదుపు చేయాలి. అందుకే పొదుపు లక్ష్యం సహేతుకంగా ఉండాలి.

మీ ఖర్చుల కేటగిరీలను నమోదు చేయండి

 ? అవసరాలు: ఈఎంఐలు, నిత్యావసరాలు, అద్దె..

 ? కోరికలు: అలవాట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌, రెస్టారెంట్లలో భోజనం..

 ? కల్చర్‌: పుస్తకాలు, సంగీతం, పండగలు మొదలగునవి..

 ? అనుకోని ఖర్చులు: పై కేటగిరీల్లోకి రాని అనారోగ్యం, ఇళ్లు, వాహన మరమ్మతుల వంటివి..

కొన్న ప్రతిదాన్నీ ఏదో కేటగిరీలో వేయాలి..

మీరు కొన్న ప్రతి వస్తువును పైన తెలిపిన కేటగిరీల్లో పొందుపరచాలి. చాలా మందికి కోరికలు, అవసరాల మధ్య తేడా తెలియదు. వీటిపై సరైన అవగాహన పెంచుకోవాలి. అలాగే వాటికి అయిన ఖర్చు కూడా రాయాలి.

ప్రతినెలాఖరుకు ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయాలి..

? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది?

? ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారు?

? ఎంత ఖర్చు చేస్తున్నారు?

? ఎలా మెరుగుపరుచుకోవాలి?

చివరి ప్రశ్న పూర్తిగా మీ వ్యక్తిగతం. ఖర్చులు, అవసరాలు, లక్ష్యాలను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఖర్చుల్ని తగ్గించుకున్నంత మాత్రాన పొదుపు చేయొచ్చనుకోవడం సరికాదు. మీకు విలువ చేకూర్చి పెట్టేవాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే భవిష్యత్తులో రాబోయే అనుకోని ఖర్చులకు ముందే సిద్ధంగా ఉండాలి. వీటికి అనుగుణంగానే మీ ప్రణాళిక ఉండాలి.

పొదుపు కంటే ఖర్చుపైనే దృష్టి పెట్టాలి..

చాలా మంది పొదుపు చేయాలన్న ఆతృతలో ఖర్చుపై దృష్టి పెట్టరు. వాస్తవానికి ఖర్చుని నియంత్రించగలిగితే ఆటోమేటిగ్గా పొదపు పెరుగుతుంది. కకేబో ప్రధాన లక్ష్యం ఇదే. కాబట్టి మనం చేసే ప్రతి ఖర్చు వెనుక ఓ కారణం ఉండాలి. ఏదైనా అత్యవసరం కాని వస్తువును కొనేటప్పుడు ఈ కింది ప్రశ్నలు మీకు మీరే సంధించుకోవాలి?

? ఈ వస్తువు లేకుండా నేను జీవించగలనా?
? నా ఆర్థిక పరిస్థితిని బట్టి దీన్ని నేను కొనగలనా?
? అసలు దీన్ని నేను ఉపయోగిస్తానా?
? దీని గురించి నాకు ఎలా తెలిసింది? ఎక్కడ చూశాను?
? ఈరోజు నా మానసిక పరిస్థితి ఎలా ఉంది?(ప్రశాంతంగా? ఒత్తిడిలో? ఆనందంగా? బాధగా?) (మన మానసిక స్థితే మన నిర్ణయాలను నిర్దేశిస్తుంది)
? దీన్ని కొంటే నా ఫీలింగ్‌ ఎలా ఉంటుంది?(సంతోషం?ఉత్సాహం?ఈ రెండింటికీ భిన్నం? ఎంతకాలం ఉంటుంది?)

ఇతర పద్ధతులతో పోలిస్తే కకేబో ఎలా భిన్నం?

కకేబోలో ప్రతి ఖర్చును, ఆదాయాన్ని పెన్నుతో రాయాల్సి ఉంటుంది. చేతితో రాయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కంప్యూటర్‌, ఫోన్‌లో అంకెలు, అక్షరాలు నమోదు చేయడం కంటే చేతితో రాయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మనం ఏం రాస్తున్నామనే దానిపై మనకు శ్రద్ధ ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి ఖర్చును నోట్‌ చేయడంపై మనం కొంత సమయం వెచ్చిస్తాం. ఈ ప్రక్రియలో దేన్నీ ఆటోమేట్‌ చేయడానికి వీలుండదు. అప్పుడు అది మన బుర్రలో ఉండిపోతుంది. ముఖ్యంగా కొనుగోళ్లను కేటగిరీల్లో పొందుపరిచేటప్పుడు మీరు బాగా ఆలోచించాల్సి ఉంటుంది. అది తదుపరి వ్యయాలపై ప్రభావం చూపుతుంది. మరింత మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తుంది.

పాశ్చాత్య దేశాల్లో ఈ విధానానికి ఆదరణ పెరుగుతోంది. నెలవారీ ఖర్చుల్లో దాదాపు 35 శాతం వరకు తగ్గించుకోవచ్చని దీన్ని పాటించిన వారు చెబుతున్నారు. మరి ఇది మీక్కూడా ఉపయోగకరంగా ఉంటుందనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం.. పెన్ను, పేపర్‌ తీసుకోండి మరి!

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని