Nirmala Sitaraman: బ్యాంకులపై మారటోరియం ఉన్నా.. డిపాజిట్లకు రూ.5లక్షల బీమా

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మారటోరియం విధించినా బ్యాంకుల ఖాతారులకు కూడా డిపాజిట్‌ బీమా

Updated : 28 Jul 2021 17:21 IST

దిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మారటోరియం విధించినా బ్యాంకు ఖాతాదారులకు కూడా డిపాజిట్‌ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డీఐసీజీసీ(డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌) చట్ట సవరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం వెల్లడించారు. తాజా సవరణలతో డీఐసీజీఐ ద్వారా 98.3 శాతం ఖాతాదారులు లబ్ధి పొందుతారని అన్నారు. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లో ఖాతాదారులు తమ డిపాజిట్లపై రూ. 5లక్షల వరకు బీమా సౌకర్యం పొందొచ్చని తెలిపారు. 

భారతీయ రిజర్వు బ్యాంకు యాజమాన్యంలోని డీఐసీజీసీ.. బ్యాంకు డిపాజిటర్లకు ఈ బీమాను అందిస్తుంది. 2020లో ఈ బీమా మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు. అయితే ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్సు రద్దు చేసి, లిక్విడేషన్‌ చర్యలు ప్రారంభించిన తర్వాతే డీఐసీజీసీ నుంచి బీమా మొత్తాన్ని పొందేందుకు వీలుంటుంది. తాజాగా ఈ డీఐసీజీసీ చట్టాన్ని సవరించడంతో దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నిధులను వెనక్కి తీసుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. బ్యాంకు నష్టాల్లో ఉండి.. సాధారణ కార్యకలాపాలపై ఆర్‌బీఐ తాత్కాలిక నిషేధం విధించినప్పుడు.. ఖాతాలు స్తంభింపజేసినప్పుడు.. రూ. 5లక్షల వరకు నిధులను బీమా ద్వారా పొందే వీలుంటుంది. 

ఎప్పుడు వర్తిస్తుంది..

* రెండు వేర్వేరు బ్యాంకులలో డిపాజిట్లు ఉన్నప్పుడు.. ఆ రెండు బ్యాంకులూ మూసివేత దిశగా వెళ్తే.. ఒక్కో బ్యాంకులో ఉన్న ఖాతాల మీద రూ.5లక్షల వరకూ.. అంటే రూ.10లక్షలకూ బీమా ఉంటుంది.

* ఒకే బ్యాంకులో ఒక వ్యక్తి వద్ద ఉన్న అన్ని డిపాజిట్ల మొత్తం రూ.ఐదు లక్షలకు మించి ఉంటే.. అసలు, వడ్డీ మొత్తంతో కలిపి రూ.ఐదు లక్షలు మాత్రమే పొందగలుగుతారు.

* బ్యాంకు ఖాతాకు అనుబంధంగా ఉన్న పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, పెద్దల పొదుపు పథకం ఖాతాలకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి, వీటిని బీమా మొత్తంలో కలపరు.

* బ్యాంకులు ఆర్థికంగా విఫలమై.. డిపాజిటర్లకు చెల్లించేందుకు డబ్బు లేనప్పుడు.. ఆ బ్యాంకులో ఉన్న ఖాతాదారులకు ఈ బీమా వర్తిస్తుంది.

* అన్ని వాణిజ్య బ్యాంకులు, విదేశీ బ్యాంకులతోపాటు, రాష్ట్ర, కేంద్ర, పట్టణ సహకార బ్యాంకులు, లోకల్‌ ఏరియా బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు ఈ బీమా రక్షణ ఉంటుంది. కానీ, ప్రాథమిక సహకార సంఘాలలో చేసే డిపాజిట్లకు ఇది వర్తించదు.

* పొదుపు,స్థిర, కరెంటు, రికరింగ్‌ డిపాజిట్‌ వంటి అన్ని బ్యాంకు  డిపాజిట్లకూ కలిపి ప్రతి ఖాతాదారుడికి రూ.5లక్షల మొత్తం మీద బీమా వర్తిస్తుంది.

* ఒకే వ్యక్తికి వేర్వేరు హోదాల్లో ఖాతాలుంటే.. వాటికి విడివిడిగా బీమా రక్షణ ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి తన డిపాజిట్లపై రూ.5లక్షల వరకూ బీమా ఉంటుంది. అదే వ్యక్తికి వేరొకరితో ఉమ్మడి ఖాతా ఉంటే.. దానికీ బీమా లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని