
Videocon AGR Charges: వీడియోకాన్ ఏజీఆర్ బకాయిలు.. ఎయిర్‌టెల్‌కు సుప్రీంలో ఊరట!
దిల్లీ: వీడియోకాన్ ‘సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్)’ ఛార్జీల చెల్లింపు విషయంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. మూడు వారాల వరకు ఎయిర్టెల్ బ్యాంకు గ్యారంటీలను సొమ్ము చేసుకోవద్దని ప్రభుత్వ టెలికాం విభాగాన్ని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వానికి వీడియోకాన్ రూ.1,376 కోట్ల ఏజీఆర్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంది. అయితే, వీడియోకాన్ తమకు బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ (తూర్పు), ఉత్తర్‌ప్రదేశ్ (పశ్చిమ), గుజరాత్ సర్కిళ్లలో కేటాయించిన స్పెక్ట్రంను ఎయిర్‌టెల్‌కు విక్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనుగడలో లేని వీడియోకాన్ సంస్థ ఏజీఆర్ ఛార్జీలను ఎయిర్టెల్ చెల్లించాలని టెలికాం విభాగం నోటీసులు జారీ చేసింది. అందుకు ఆగస్టు 17ను తుది గడువుగా విధించింది. లేదంటే బ్యాంకు గ్యారంటీలను సొమ్ము చేసుకుంటామని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ.1,376 కోట్ల ఏజీఆర్ ఛార్జీలు వీడియోకాన్‌కు సంబంధించినవని.. వాటితో ఎయిర్‌టెల్‌కు ఎలాంటి సంబంధం లేదని వాదించింది. నిబంధనల ప్రకారం.. స్పెక్ట్రం విక్రయానికి ముందే వీడియోకాన్ ఆ ఛార్జీలు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఒకవేళ వీడియోకాన్ ఏజీఆర్ ఛార్జీలను ఎయిర్టెల్ ఏజీఆర్ బకాయిలతో కలిపినా.. తాము ఇప్పటికే రూ.18,004 కోట్ల ఏజీఆర్ ఛార్జీలు చెల్లించామని తెలిపింది. దీంతో నిబంధనల ప్రకారం మార్చి 2021 నాటికి చెల్లించాల్సిన 10 శాతం బకాయిలు చెల్లించేశామని పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలను సొమ్ము చేసుకోవాల్సిన అవసరం లేదని వాదించింది.
ఇవీ చదవండి
Advertisement