ఈపీఎఫ్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు!

ఉద్యోగ భ‌విష్య నిధికి సంబంధించిన ముఖ్య‌మైన విష‌యాల‌ను తెలుసుకుందాం

Updated : 02 Jan 2021 17:42 IST

ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసీలెనీయ‌స్ ప్రొవిజ‌న్స్ యాక్టు 1952 కింద ఉద్యోగ భ‌విష్య నిధికి (ఈపీఎఫ్) ఉంటుంది. ఈపీఎఫ్ ప‌థ‌కంలో ఉద్యోగి కొంత శాతం చెల్లింపు చేయ‌గా కొంత సంస్థ‌లు చెల్లిస్తాయి. దీనికి సంబంధించిన నియ‌మ‌నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏదైనా సంస్థ‌లో 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ప‌నిచేస్తే ఈచ‌ట్టం అమ‌లు చేయాలి. కొన్ని సంద‌ర్భాల్లో 20 కంటే త‌క్కువ మంది ఉన్న సంస్థ‌లు కూడా ఈ ప‌రిధిలోకి వ‌స్తుంటాయి. ఇది నిబంధ‌న‌ల‌ను బ‌ట్టి ఉంటుంది. ఉద్యోగుల ఫించ‌న్ ఫండ్ నిర్వ‌హ‌ణ ‌సంస్థ (ఈపీఎఫ్ఓ) ఈ చ‌ట్టానికి లోబ‌డి ఉంటుంది. రూ. 15 వేల కంటే ఎక్కువ వేత‌నం పొందే ఉద్యోగుల ఈ ప‌థ‌కంలో త‌ప్ప‌కుండా చేరాలి. ప్ర‌స్తుతం వేత‌నం రూ. 15 వేల కంటే ఎక్కువ‌ పొందేవారు అసిస్టెంట్ పీఎఫ్ క‌మీష‌న‌ర్ అనుమ‌తి తీసుకుని ఈపీఎఫ్ మెంబ‌రు కావ‌చ్చు.

1.ఉద్యోగులు, సంస్థ చెల్లించేది

ఉద్యోగికి ఇచ్చే బేసిక్ శాల‌రీ, డీఏ, రిటైనింగ్ అలోవెన్స్ ను క‌లిపితే వ‌చ్చే మొత్తంలో సంస్థ 12 శాతం చెల్లిస్తుంది. అదే మొత్తం ఉద్యోగి కూడా చెల్లించాల్సి ఉంటుంది. సంస్థ‌లో 20 మంది కంటే త‌క్కువ ఉద్యోగులు ఉన్న‌ట్ట‌యితే సంస్థ 10 శాతం, ఉద్యోగి 10 శాతం చెల్లించొచ్చు. ఎక్కువగా ప్రైవేటు రంగంలో ప‌నిచేసే ఉద్యోగులు ఉంటారు ఉదాహార‌ణ‌కు ఒక ఉద్యోగి నెల‌వారీ బేసిక్ రూ.30 వేలు అనుకుందాం. ఆ ఉద్యోగి ఈపీఎఫ్ గా ప్ర‌తీనెల రూ.3600 చెల్లించాలి.

2.సంస్థ‌లందించే వాటా

సంస్థ‌లు చెల్లించే మొత్తం అంతా ఈపీఎఫ్ కింద జ‌మ కాదు. దాంట్లో 8.33 (రూ.1250) శాతం ఎంప్లాయి పెన్ష‌న్ స్కీమ్ (ఈపీఎస్) కి జ‌మ‌వుతుంది. 3 .67% (రూ. 550) ఈపీఎఫ్ లోకి జ‌మ అవుతుంది. బేసిక్ రూ.15 వేల కంటే త‌క్క‌వ‌గా ఉంటే మొత్తంలో 8.33 శాతం ఈపీఎస్ లోకి జ‌మ‌వుతుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో ఉద్యోగికి సంస్థ‌, అత‌ను చెల్లించిన మొత్తం వ‌డ్డీతో పాటు అందుతుంది. సంస్థ చెల్లించే వాటా గరిష్టంగా రూ. 15,000 కు 12% లెక్కన రూ. 1800 చెల్లిస్తారు.

3.వాలంట‌రీ కంట్రీబ్యూష‌న్ (లేదా) వాలంట‌రీ ప్రావిడెంట్ ఫండ్

ఉద్యోగి త‌నంత‌ట తానుగా ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన 12 శాతం కంటే ఎక్కువ ఈ పథ‌కంలో పెట్ట‌వ‌చ్చు. దీన్నే వాలంట‌రీ ప్రావిడెంట్ ఫండ్ వీపీఎఫ్ అంటారు. దీని లెక్క వేరేగా ఉంటుది. వీపీఎఫ్ ద్వారా వ‌చ్చే వ‌డ్డీకి ప‌న్ను ఉండ‌దు. వీపీఎఫ్ కి సంస్థ‌లు చెల్లించ‌వు.

4.ఈపీఎఫ్ ఖాతానుంచి డ‌బ్బు తీసుకోవ‌డ‌మెలా

ఈపీఎఫ్ చ‌ట్టం ప్ర‌కారం ప్రావిడెంట్ ఫండ్ సెటిల్‌మెంట్ ఉద్యోగి ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన త‌రువాత ఉంటుంది. మొత్తం ఈపీఎఫ్ డ‌బ్బులు ఉద్యోగి, తాను ప‌ని చేసే సంస్థ అందించిన మొత్తం వ‌డ్డీతో పెరిగి మొత్తం అవుతుంది. పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ చేసుకునే అవ‌కాశం ఉంది. ఉద్యోగి తాను ముందుగా పీఎఫ్ నిధుల‌ను తీసుకోవాలంటే 90 శాతం వ‌ర‌కూ తీసుకోవ‌చ్చు. దీనికి 54 ఏళ్ల వ‌య‌సు దాటాలి. మ‌రి 55 ఏళ్ల‌కే రిటైర‌వ్వాల‌నుకుంటే ఎలా? అలాంట‌పుడు ఉద్యోగి వ‌రుస‌గా 60 రోజుల కంటే ఎక్కువ‌ సెల‌వు పెడితే పీఎఫ్ నిధి మొత్తం తీసుకోవ‌చ్చు.అయితే సంస్థ‌లు చెల్లించే వాటా పీఎఫ్ భాగాన్ని ఉద్యోగులు 58 సంవ‌త్స‌రాలు త‌ర్వాత మాత్ర‌మే తీసుకునే విధంగా ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయి.అయితే వీటిపై స్ప‌ష్ట‌త రావాలి. పీఎఫ్ డ‌బ్బు తీసుకునేందుకు యూఏఎన్ ఫామ్ 19 నింపి దానిపై సంస్థ అంగీకారం లేకుండా తీసుకునే వీలుంటుంది. ఈ స‌దుపాయం యూఏఎన్ కేవైసీ ఆధారంగా బ్యాంకు ఖాతాను ఆధార్ తో లింక్ చేసిన స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు ఉంటుంది.

5. వ‌డ్డీ లెక్క‌లిలా

ఈపీఎఫ్ ప‌థ‌కంలో నెల వారీ చొప్పున వ‌డ్డీ లెక్క క‌ట్టి చెల్లిస్తారు.ప్ర‌స్తుతం ఈపీఎఫ్ఓ వ‌డ్డీ వార్షిక రేటు 8.55 శాతంగా ఉంది.

6.విశ్వ‌జ‌నీన ఖాతా సంఖ్య (యూనివ‌ర్స‌ర్ అకౌంట్ నంబ‌రు)

యూనివ‌ర్స‌ర్ అకౌంట్ నంబ‌రు(యూఏఎన్) ను ఈపీఎఫ్ఓ జారీచేస్తుంది. వివిధ ర‌కాల గుర్తింపు కార్డుల‌ను అనుసంధానం చేసే విధంగా యూఎన్ఏ ఉంటుంది. ఈ సంఖ్య తో ఉద్యోగులు త‌మ పీఎఫ్ ఖాతాల‌ను చూసుకోవ‌చ్చు. ఉద్యోగం మారిన‌పుడు స‌ద‌రు ఉద్యోగి అత‌ని యూఏఎన్ ను కొత్తగా ఉద్యోగం చేసే సంస్థ‌కు ఇవ్వ‌డం మూలంగా కొత్త యూఏఎన్ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఈ సంఖ్యను శాస్వ‌తంగా ఉంచుకోవ‌చ్చు. కొత్త‌గా సంస్థ‌లో చేరే ఉద్యోగులు అప్ప‌టికే యూఏఎన్ క‌లిగిఉంటే ‘ఫామ్ 11- డిక్లరేష‌న్ ద‌ర‌ఖాస్తు’ తీసుకుని అందులో వివ‌రాలు నింపాలి. పీఎఫ్ సంఖ్య‌ను చివ‌రిగా ఉద్యోగం చేసిన తేదీతో పాటు ఇవ్వాలి.

7.ఐదేళ్లుంటే ప‌న్ను మిన‌హాయింపు

సాధార‌ణంగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన తొలినాళ్ల‌లో కొంత మంది సంస్థ‌లు మారుతుంటారు. వారికి పీఎఫ్ విష‌యంలో రెండు ఆప్ష‌న్లు ఉంటాయి. 60 రోజులు త‌రువాత డ‌బ్బు తీసుకోవ‌డం లేదా త‌ర్వాత చేరిన సంస్థ‌కు ఈ ఖాతాను అనుసంధానం చేయ‌డం.

ఉద్యోగి 5 ఏళ్ల రెగ్యుల‌ర్ స‌ర్వీసు పూర్తిచేసిన‌ట్ట‌యితే పీఎఫ్ ద్వారా అందే మొత్తానికి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఒక ఉద్యోగి ఏడాదిన్న‌ర పాటు ఒక సంస్థ‌లో ప‌నిచేసి త‌రువాతి మూడున్న‌ర ఏళ్లు వేరొక సంస్థ‌లో ప‌నిచేస్తే రెగ్యుల‌ర్ స‌ర్వీస్ అవుతుందా అంటే పీఎఫ్ ఖాతాను మూసివేయ‌కుండా కంపెనీ మారిన‌పుడు అదే ఖాతాను కొన‌సాగిస్తే ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అందుకే ఉద్యోగం మారిన‌పుడు పీఎఫ్ ఖాతాను మాత్రం మార్చ‌కూడ‌దు. అంటే అదే ఖాతాను కొన‌సాగించాలి.

8. ఉపసంహరణపై పన్ను ఉంటుందా?

5 సంవత్సరాల నిరంత‌ర స‌ర్వీసును పూర్తి చేయకుండా పీఎఫ్ డ‌బ్బుల‌ను ఉపసంహరించుకుంటే పన్ను మిన‌హాయింపు ఉండ‌దు. సంస్థ సహకారంగా చెల్లించిన వాటా, ఆర్జించిన వడ్డీ పై మొత్తం ఉపసంహరణ సంవత్సరంలో పన్ను విధించబడుతుంది. అంతేకాకుండా, సెక్షన్ 80 సి కింద పేర్కొన్న మినహాయింపు పొందిన ఉద్యోగి ఉపసంహరణ సంవత్సరంలో ఆదాయంగా ప‌రిగ‌ణించాలి. ఆ మొత్తంపై ఆర్జించిన‌ వడ్డీ కూడా పన్ను పరిధిలోకి వస్తుంది.

అకాల ఉపసంహరణలను నిరుత్సాహపరచడం, దీర్ఘకాల పొదుపులను ప్రోత్సహించడం కోసం పీఎఫ్ ఉపసంహరణలపై ప‌న్ను మిన‌హాయింపును ప్ర‌భుత్వం ప్రవేశపెట్టింది. అలాగే, ఒక ఖాతా నుంచి మ‌రో ఖాతాకి బదిలీ చేసినా టీడీఎస్ వర్తించదు. జూన్ 1, 2016 నుంచి, టీడీఎస్ ఉపసంహరణ రూ. 30,000 నుంచి రూ .50,000 కు పెంచారు. పాన్ కార్డు సమర్పించిన వారికి 10 శాతం రేటుతో టీడీఎస్ వ‌ర్తిస్తుంది.

9.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అడ్వాన్సెస్

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ప‌దవీ విరమణ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన‌వి. అయితే ఎవ‌రైనా త‌మ అవ‌స‌రాల‌కు డ‌బ్బు తీసుకునేందుకు ఉద్యోగం చేసే సమయంలో కూడా ఈపీఎఫ్ఓ అనుమ‌తి ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న డ‌బ్బును రుణాలుగా ప‌రిగ‌ణించ‌రు. వాటిని అడ్వాన్స్ గా పేర్కొంటారు. వీటిపై వ‌డ్డీ చెల్లించాల్పిన అవ‌స‌రం లేదు. కొన్ని ప్ర‌త్యేక పరిస్థితులలో మాత్రమే ఈ విధంగా ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌కు ఈపీఎఫ్ఓ అనుమ‌తిస్తుంది. ఇంటిని కొనుగోలు చేయడం, గృహ రుణాలను తిరిగి చెల్లించడం, వైద్య అవసరాలు, విద్య, పిల్లలకు వివాహం మొదలైనవి. ఈ విధంగా తీసుకునే మొత్తం నిర్దిష్ట పరిస్థితుల‌ ఆధారంగా ఉంటుంది. మిగిలి ఉన్న స‌ర్వీసు త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.

10.గృహం కోసం ముందస్తు ఉప‌సంహ‌ర‌ణ‌

ఈపీఎఫ్ఓ సభ్యులకు గృహ రుణాల ఈఎమ్ఐ లను చెల్లించటానికి, గృహాలను కొనుగోలు చేయడానికి ఈపీఎఫ్ సంచిత నిధి నుంచి 90 శాతం వ‌ర‌కూ తీసుకోవ‌డాన్ని ప్రోవిడెంట్ ఫండ్ పథకం అనుమతిస్తుంది.

కొత్త నిబంధనల ప్రకారం, పీఎఫ్ స‌భ్యునికి ఈ డ‌బ్బుతో రియల్ ఎస్టేట్ ఆస్తిని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. అయితే ఆ వ్య‌క్తి కనీసం 10 మంది సభ్యులతో కూడిన నమోదిత హౌసింగ్ సొసైటీ సభ్యుడిగా ఉండాలి. ఇంటి నిర్మాణం , ప్లాట్లు కొనుగోలు కోసం, గృహ రుణం డౌన్ పేమెంట్ గా పీఎఫ్‌ నిధులను ఉపయోగించవచ్చు. ఈ లావాదేవీలు కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ బిల్డర్, ప్రమోటర్లు, డెవలపర్ల ద్వారా పూర్తిచేయాలి. పీఎఫ్ స‌భ్య‌త్వం తీసుకుని 3 సంవత్సరాలు పూర్త‌యిన వారికి మాత్ర‌మే ఈ ప‌థ‌కానికి అర్హత ఉంటుంది.

చివ‌రిగా:

ప్ర‌స్తుతం పీఎఫ్ ప‌థ‌కం ద్వారా వార్షిక వ‌డ్డీరేటు 8.55 శాతం. వీటికి ప్ర‌భుత్వం హామీదారుగా ఉంటుంది. ప‌న్నుమిన‌హాయింపు ఉంటుంది. స్థిరాదాయ ప‌థ‌కాల్లో కూడా ఇంత‌కు మించి వ‌డ్డీ వ‌స్తుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం. కాబ‌ట్టి ఉద్యోగం మారిన‌పుడు పీఎఫ్ ఖాతాను మాత్రం మార్చ‌కుండా అదే ఖాతాను కొన‌సాగించ‌డం ద్వారా దీర్గ‌కాలంలో మంచి ఫ‌లితాలు అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని