చిట్ ఫండ్ చట్టం 1982 గురించి మీకు తెలుసా?

సంబందిత రాష్ట్ర‌ప్ర‌భుత్వం వ‌ద్ద రిజిస్ట్రీ అయిన చిట్ ఫండ్ కంపెనీల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డులు పెట్టాలి.

Updated : 01 Jan 2021 18:10 IST

చిట్ ఫండ్ చట్టం 1982 గురించి మీకు తెలుసా?

సంబందిత రాష్ట్ర‌ప్ర‌భుత్వం వ‌ద్ద రిజిస్ట్రీ అయిన చిట్ ఫండ్ కంపెనీల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డులు పెట్టాలి.

శార‌దా గ్రూప్ కుంభ‌కోణం గురించి మీడియాలో చాలా వార్త‌లు వ‌చ్చాయి. దీనిని చిట్‌ఫండ్ కంపెనీగా ప్ర‌చారం చేశారు. కానీ నిజానికి శార‌దా గ్రూప్ చిట్ ఫండ్ చ‌ట్టం ప‌రిధిలోకి రాద‌ని మీకు తెలుసా? ఏదైనా కంపెనీని చిట్ ఫండ్ కంపెనీగా భావించి పెట్టుబ‌డి పెట్టే ముందు చిట్‌ఫండ్‌ చ‌ట్టం 1982 గురించి తెలుసుకోవ‌డం మంచిది.

చిట్‌ఫండ్ చ‌ట్టం 1982:

  • జ‌మ్మూ అండ్ కాశ్మీర్‌లో త‌ప్ప భార‌త‌దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల‌లో ఈ చ‌ట్టం అమ‌ల‌వుతుంది.
  • చిట్ ఫండ్‌ను చిట్టి, కురీ అనే పేర్ల‌తో కూడా పిలుస్తారు.
  • చిట్ ఫండ్ కంపెనీలు వాటి పేరులో చిట్‌, చిట్టి, కురీ ప‌దాల‌తో ఉండేలా చూసుకోవాలి. ఇత‌ర వ్యాపారాలు ఈ ప‌దాల‌ను వారి వ్యాపార పేరులో ఉప‌యోగించ‌రాదు.
  • అన్ని చిట్‌ ఫండ్ కంపెనీలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వ‌ద్ద‌ రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది.
  • చిట్ ఫండ్ సంబంధిత వ్యాపారంలో ఈ చ‌ట్టం కింద శిక్ష అనుభ‌వించిన‌వారు ఐదేళ్ల వ‌ర‌కు తిరిగి రిజిస్ర్టేష‌న్ చేసుకునేందుకు అనుమ‌తి ఉండ‌దు.
  • చిట్ ఫండ్‌లో ప్ర‌జ‌లను పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆహ్వానించే ప్ర‌తిపాద‌న చ‌ట్టం సెక్షన్ 4 కింద అన్ని వివ‌రాల‌తో కూడిన ప‌త్రాలు, నోటీసులు, ఉత్త‌ర్వులు, ఆమోదం పొందాలి.
  • ప్ర‌తీ ఒప్పందానికి ఒక డూప్లికేట్ కాపీ చందాదారుల సంత‌కంతో ఉండాలి. ఇందులో ప్రధానంగా చందాదారుల పేరు, చిరునామా, చందాదారుని వ‌ద్ద ఉన్న చిట్‌ల సంఖ్య‌, వాయిదా మొత్తం, వ‌డ్డీ, అప‌రాధ రుసుము, ప్రారంభించిన తేది, పూర్త‌య్యే తేది, డిస్కౌంటు పొందిన గ‌రిష్ట మొత్తం, డిస్కౌంటు మొత్తాన్ని ఏవిధంగా పంపిణీ చేస్తారు, సేక‌రించిన మొత్తాన్ని డిపాజిట్ చేసే బ్యాంకు పేరు, ఇత‌ర వివ‌రాలు ఉంటాయి.
  • చిట్ ఫండ్‌ను ప్రారంభించేందుకు కావ‌ల‌సిన క‌నీస పెట్టుబ‌డి రూ.1 ల‌క్ష‌.
  • సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా చిట్ ఫండ్ కంపెనీ వ్యాపారం చేయ‌రాదు.
  • సేకరించిన మొత్తాన్ని చిట్ వ్యాపారంలో మిన‌హా మ‌రి ఏ ఇత‌ర వ్యాపారంలోనూ పెట్టుబ‌డిగా పెట్ట‌కూడ‌దు. చిట్ మొత్తాన్ని పొంద‌ని చందాదారుల‌కు (నాన్ ప్రైజ్డ్ సబ్ స్క్రైబర్), చెల్లించిన వాయిదా మొత్తాన్ని సెక్యూరిటీగా బావించి రుణాలు మంజూరు చేయ‌వ‌చ్చు. ట్ర‌స్టీ సెక్యూరిటీల‌లో గాని, వివ‌రాల‌లో పొందుప‌రిచిన బ్యాంకులోగాని డిపాజిట్ చేయాలి.
  • ఫోర్మన్ , చందాదారుని అనుమ‌తి లేకుండా చిట్ ఒప్పందం మార్చ‌డం, ర‌ద్దు చేయ‌డం, అద‌నంగా చేర్చ‌డం వంటి చేయ‌కూడ‌దు.
  • చిట్ మొత్తానికి స‌మాన‌మైన మొత్తాన్ని ఆమోదం పొందిన‌ బ్యాంకులో ఫోర్మన్ జ‌మ చేయాలి.
  • ముందుగా చిట్టి మొత్తాన్ని పొంద‌ని చందాదారుడు(నాన్ ప్రైజ్డ్ సబ్ స్క్రైబర్), చిట్టి వాయిదాల‌ను చెల్లించ‌క‌పోతే, ఫోర్మ‌న్, చందాదారునికి నోటీసు ఇచ్చి 14 రోజుల లోపుగా చందాదారుడు వాయిదాలు చెల్లించ‌క‌పోతే అత‌నిని జాబితా నుంచి తొల‌గించ‌వ‌చ్చు
  • చిట్టి మొత్తం ముందుగా పొందిన చందాదారుడు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. లేదా భ‌విష్య‌త్తు వాయిదాల‌ను చెల్లించిన అనంత‌రం బ్యాలెన్స్ మొత్తాన్ని తీసుకోవాలి.
  • ఫోర్మ‌న్ క‌మీష‌న్ గ‌రిష్టంగా 5 శాతం ఉండాలి.
  • బిడ్డింగ్ మొత్తం 40 శాతానికి మించి ఉండ‌కూడ‌దు.
  • చిట్ ఫండ్ ఖాతాను చార్టర్డ్ అకౌంటెంట్‌తో ఆడిట్ చేయించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని