సంక్షోభ నివారణ చర్యలను ప్రపంచ బ్యాంకు కొనసాగించాలి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బలహీన దేశాలను దృష్టిలో పెట్టుకుని సంక్షోభ నివారణ ...

Published : 10 Apr 2021 01:01 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బలహీన దేశాలను దృష్టిలో పెట్టుకుని సంక్షోభ నివారణ చర్యలను ప్రపంచ బ్యాంకు గ్రూప్‌(డబ్ల్యూబీజీ) కొనసాగించాలని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. ప్రపంచ బ్యాంకు-అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎమ్‌ఎఫ్‌)కి చెందిన అభివృద్ధి కమిటీ 103వ సమావేశంలో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె పాల్గొన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ, గవి(అంతర్జాతీయ టీకా సమాఖ్య)లతో కలిసి వర్థమాన దేశాలకు టీకాలు సరైన సమయంలో, అందుబాటు ధరలో లభించేలా డబ్ల్యూబీజీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు తొలిసారిగా 100 బిలియన్‌ డాలర్లకు పైగా రుణ అనుమతులు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా నుంచి తమ ఆర్థిక వ్యవస్థ, ప్రజలను రక్షించడానికి పనిచేస్తున్నాయన్నారు. భారత్‌లో మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి గత ఏడాది కాలంగా జీడీపీలో 13 శాతం లేదా రూ.27.1 లక్షల కోట్ల ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలను తమ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ ప్యాకేజీలు పేదలకు సామాజిక రక్షణ ఇవ్వడమే కాకుండా.. ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాయని వివరించారు.

సంక్షిప్తాలు
మాక్రోటెక్‌ డెవలపర్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు చివరి రోజున 1.36 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 3,64,18,219 షేర్లను జారీ చేయనుండగా.. 4,94,64,480 షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయి. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.2,500 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది.
మలేసియాలోని తమ ఉన్నతస్థాయి 220 పడకల ఆసుపత్రిని రామ్‌సే సైమ్‌ డార్బే హెల్త్‌కేర్‌కు విక్రయించనున్నట్లు మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. అయితే ఎంతకు విక్రయించనుందో ఆ వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
సౌదీ అరేబియాలోని రియాద్‌ ప్రావిన్స్‌లో 1.5 గిగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ఎల్‌అండ్‌టీకి చెందిన విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యాపార విభాగానికి కాంట్రాక్టు లభించింది.
2020-21 నాలుగో త్రైమాసికానికి లైసెన్సు రుసుం చెల్లించనందుకు వొడాఫోన్‌ ఐడియాకు షోకాజ్‌ నోటీసులను టెలికాం విభాగం పంపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని