పన్ను రిఫండ్‌లకు దరఖాస్తు గడువు డిసెంబరు 31

పెండింగ్‌లో ఉన్న పన్ను రిఫండ్‌లు పొందేందుకు ఎగుమతిదార్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు డిసెంబరు 31ని గడువు తేదీగా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఎగుమతిదార్లకు వివిధ ఎగుమతి ప్రోత్సాహక పథకాల ...

Published : 18 Sep 2021 02:46 IST

దిల్లీ: పెండింగ్‌లో ఉన్న పన్ను రిఫండ్‌లు పొందేందుకు ఎగుమతిదార్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు డిసెంబరు 31ని గడువు తేదీగా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఎగుమతిదార్లకు వివిధ ఎగుమతి ప్రోత్సాహక పథకాల కింద రావాల్సిన పన్ను రిఫండ్‌ల కోసం సెప్టెంబరు 9న రూ.56,027 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మర్చండైజ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఫ్రమ్‌ ఇండియా స్కీమ్‌ (ఎంఈఐఎస్‌) కింద పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌ల కోసం.. 2018 జులై 1 నుంచి 2019 మార్చి 31 వరకు, 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31 వరకు, 2020 ఏప్రిల్‌ నుంచి 2020 డిసెంబరు 31 వరకు జరిపిన ఎగుమతులపై దరఖాస్తులను ఎగుమతిదార్లు సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడిచింది. సర్వీస్‌ ఎక్స్‌పోర్ట్‌ ఫ్రమ్‌ ఇండియా స్కీమ్‌ (ఎస్‌ఈఐఎస్‌) కింద 2018-20 మధ్య కాలంలో జరిపిన ఎగుమతులపై రిఫండ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. జౌళి ఎగుమతిదార్లు 2019 మార్చి 7 నుంచి డిసెంబరు 31, 2020 మధ్య ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌ (రిబేట్‌ ఆఫ్‌ స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ లెవీస్‌ అండ్‌ ట్యాక్సెస్‌) పథకం కింద జరిపిన ఎగుమతులకు దరఖాస్తు చేయవచ్చని తెలిపింది. ‘ఎంఈఐఎస్‌, ఎస్‌ఈఐఎస్‌, ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌, ఆర్‌ఓఎస్‌ఎల్‌, 2 శాతం అదనపు ప్రోత్సాహక పథకాల కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు 2021 డిసెంబరు 31ను తుది గడువుగా నోటిఫై చేశామ’ని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


సిటీ గ్యాస్‌ లైసెన్సుల కోసం బిడ్‌లు ఆహ్వానించిన పీఎన్‌జీఆర్‌బీ

దిల్లీ: దేశంలోని 65 భౌగోళిక ప్రాంతాల్లో (జీఏ) సిటీ గ్యాస్‌ (పైపుల ద్వారా సరఫరా అయ్యే) విక్రయ లైసెన్సుల మంజూరు నిమిత్తం పెట్రోలియమ్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) బిడ్‌లను ఆహ్వానించింది. డిసెంబరు 15న నిర్వహించబోయే 11వ విడత సిటీ గ్యాస్‌ లైసెన్సింగ్‌ ప్రక్రియలో భాగంగా.. ఈ బిడ్‌లు ఆహ్వానిస్తున్నట్లు పీఎన్‌జీఆర్‌బీ తెలిపింది. 65 భౌగోళిక ప్రాంతాల్లో తెలంగాణలోని నిజామాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. 11వ విడత నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో లైసెన్సుల జారీ ప్రక్రియను 2021 డిసెంబరు 31లోగా పూర్తి చేయనుంది.
ఆగస్టులో పెరిగిన పింఛను చందాదార్లు


 24 శాతం వృద్ధితో 4.53 కోట్లకు

దిల్లీ: పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిర్వహిస్తున్న పలు పింఛను పథకాల్లోకి చందాదార్లు 24 శాతం పెరిగి 4.53 కోట్లకు చేరారు. పీఎఫ్‌ఆర్‌డీఏ జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్‌), అటల్‌ పింఛను యోజన (ఏపీవై) పథకాలను నిర్వహిస్తోంది. 2020 ఆగస్టు ఆఖరుకు 3.65 కోట్ల మంది చందాదార్లు ఉండగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ సంఖ్య 4.53 కోట్లకు చేరిందని పీఎఫ్‌ఆర్‌డీఏ వెల్లడించింది. ఏపీఐ కింద చందాదార్లు ఏకంగా 33.2 శాతం పెరిగి 3.04 కోట్లకు చేరారని తెలిపింది. ఆస్తుల పరంగా చూస్తే ఆగస్టు చివరకు పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్వహణలోని మొత్తం పింఛను ఆస్తులు రూ.6,47,621 కోట్లు ఉన్నట్లు, ఏడాది క్రితంతో పోలిస్తే 32.91 శాతం అధికమని వెల్లడించింది. ఏపీవై కింద ఉన్న ఆస్తులు 33 శాతం పెరిగి రూ.18,059 కోట్లకు చేరాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని