రూ.675 లక్షల కోట్లకు విమానయాన విపణి

విమానయాన పరిశ్రమ కొవిడ్‌ ప్రభావం నుంచి బయటపడి రికవరీ బాటలో నడుస్తోందని బోయింగ్‌ కంపెనీ వెల్లడించింది. ఈ రంగంపై బుల్లిష్‌గా ఉన్నామని, వచ్చే దశాబ్ద కాలంలో ప్రయాణ, మిలిటరీ

Updated : 15 Sep 2021 03:38 IST

బోయింగ్‌ అంచనా

వాషింగ్టన్‌: విమానయాన పరిశ్రమ కొవిడ్‌ ప్రభావం నుంచి బయటపడి రికవరీ బాటలో నడుస్తోందని బోయింగ్‌ కంపెనీ వెల్లడించింది. ఈ రంగంపై బుల్లిష్‌గా ఉన్నామని, వచ్చే దశాబ్ద కాలంలో ప్రయాణ, మిలిటరీ విమానాలు, ఇతర ఎరోస్పేస్‌ ఉత్పత్తులు, సేవల విపణి 9 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.675 లక్షల కోట్లు) చేరొచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొంది. ‘రెండేళ్ల వృద్ధిని కొవిడ్‌ ప్రభావంతో కోల్పోయాం. వైరస్‌ పూర్వ స్థాయికి విమానయాన రంగం చేరుకోవడానికి 2023 డిసెంబరు/2024 ప్రారంభం వరకు సమయం పట్టొచ్చ’ని బోయింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డారెన్‌ హస్ట్‌ వెల్లడించారు. గత ఆగస్టులో అమెరికాలో ప్రతి రోజు సరాసరిన 18.5 లక్షల మంది ప్రయాణికులు విమానాలు ఎక్కారని, 2020 ఇదే సమయంలో ప్రయాణించిన 7 లక్షల మందితో పోలిస్తే ఇది చాలా ఎక్కువని బోయింగ్‌ తెలిపింది. అయితే 2019 ఆగస్టుతో (24 లక్షల మంది ప్రయాణికులతో) పోలిస్తే 23 శాతం తక్కువగానే ఉందని పేర్కొంది. 2030 నాటికి విమానయాన సంస్థలకు 19,000 కొత్త విమానాలు అవసరమవుతాయని తెలిపింది. 2040 నాటికి అంతర్జాతీయంగా 49,000 విమానాలు ఉంటాయని, ఇందులో 40 శాతం వాటా ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌కు లభిస్తుందని,  చైనా వాటా ఎక్కువ ఉంటుందని పేర్కొంది. ఆ విమానాలను నడిపేందుకు ప్రపంచానికి వచ్చే 20 ఏళ్లలో మరో 6,12,000 మంది పైలట్లు, 6,26,000 మంది సాంకేతిక నిపుణులు, 8,86,000 మంది సహాయకులు కావాల్సి ఉంటుందని బోయింగ్‌ అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు