Economy: కొవిడ్‌-19 రెండోదశ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై స్వల్పమే

కొవిడ్‌-19 రెండో దశ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై స్వల్పంగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని వివరించింది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికను ఆర్థిక మంత్రిత్వ...

Published : 11 Aug 2021 12:27 IST

పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయ్‌: ఆర్థిక శాఖ

దిల్లీ: కొవిడ్‌-19 రెండో దశ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై స్వల్పంగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని వివరించింది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. పన్నుల వసూళ్లు పెరగడం ద్రవ్యలోటు నియంత్రణ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపకరించనున్నాయని నివేదిక పేర్కొంది. టీకాలు వేసే కార్యక్రమం వేగవంతమైతే కొవిడ్‌-19 వ్యాధి తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ‘యాంటీబాడీస్‌ పెరగడం వల్ల ఒకవేళ కొవిడ్‌-19 వచ్చినా.. అది తీవ్ర లక్షణాలకు దారితీయకపోవచ్చు. అందువల్ల కొవిడ్‌-19 మళ్లీ విస్తరించినా, ఓ మోస్తరు నుంచి మధ్యస్థ లక్షణాలతో బయటపడే వీలు ప్రజలకు ఉంటుంద’ని ఆర్థిక శాఖ తన నివేదికలో వివరించింది. అయితే కొవిడ్‌-19 ఎలా రూపు మార్చుకుంటుందో (వేరియంట్‌) తెలియదు కనుక.. ముందస్తు జాగ్రత్తలు పాటించడాన్ని కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంది. ‘ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ, దేశం సంక్లిష్ట పరిస్థితుల నడుమ ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పురోగతి, టీకాల కార్యక్రమం వేగవంతం, కొవిడ్‌-19 మలివిడత పరిణామాలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం వీటన్నింటినీ సమన్వయపర్చుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంద’ని నివేదిక వివరించింది. రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమక్రమంగా తొలగించడంతో మే రెండో అర్ధభాగం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభమైందని తెలిపింది. అందువల్ల ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 రెండో దశ ప్రభావం స్తబ్దుగానే ఉండొచ్చని అనుకుంటున్నామని వివరించింది. రానున్న నెలల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. సానుకూల వర్షపాత పరిస్థితులు, సరఫరా అవరోధాలు తొలగడం లాంటివి ఇందుకు దోహదం చేస్తాయని వివరించింది. వ్యవసాయం, దాని అనుబంధ సంస్థలు, ఎంఎస్‌ఎమ్‌ఈలకు రుణ సదుపాయం పెరగడం వల్ల జులైలో ఇవి వృద్ధిని నమోదుచేశాయని, ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ అమలు ఈ రంగాలకు సానుకూలతను తీసుకొచ్చేందనే విషయం దీనితో అర్థమవుతోందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని