మ‌రో మూడు నెల‌లు గ‌డువు పెంపు

పాన్‌ - ఆధార్‌ల‌ను లింక్ చేసేందుకు చివ‌రి తేది జూన్ 30,2021   

Updated : 01 Apr 2021 12:39 IST

పాన్‌(శాశ్వ‌త ఖాతా సంఖ్య‌) -  ఆధార్‌ల‌ను అనుసంధానించేందుకు మ‌రో మూడు నెల‌లు గ‌డ‌వు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం బుధ‌వారం వెల్ల‌డించింది. ‌కోవిడ్‌-19 మహమ్మారి నుంచి తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మార్చి 31 నుంచి జూన్ 30, 2021వరకు మూడు నెల‌ల పాటు గ‌డువు పొడిగించిన‌ట్లు ఆదాయ‌పు ప‌న్నుశాఖ ట్వీట్ చేసింది.

2018 వ‌చ్చిన సుప్రీంకోర్టు తీర్పు త‌రవాత, ఆదాయ‌పు పన్ను రిట‌ర్నులు (ఐటీఆర్‌) దాఖ‌లు చేసేవారు పాన్ నెంబ‌రును, 12-అంకెల ఆధార్‌తో అనుసంధానించ‌డం త‌ప్ప‌నిస‌రి అయ్యింది. కొత్త పాన్ కార్డు తీసుకునే వారికి ఆధార్ నెంబ‌రు స్వ‌యం చాలకంగా లింక్ చేయ‌డం జ‌రుగుతుంది. ఇందుకోసం ద‌ర‌ఖాస్తు ఫారంలోనే ఆధార్ నెంబ‌రును కోడ్ చేయాల్సి ఉంటుంది. 

ఇప్పటికే పాన్ కార్డ్ ఉన్న‌వారు, చివరి తేదీలోపు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. మీ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి, ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి, ఎడమ వైపున ఉన్న లింక్ ఆధార్ విభాగంలో క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్క‌డ మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పేరు వంటి వివ‌రాల‌ను పూర్తిచేయాలి. ఆదాయ‌పు ప‌న్ను శాఖ వారు, మీరు ఇచ్చిన వివ‌రాల‌ను ఆధార్ వివ‌రాల‌తో పోల్చి చూస్తారు. రెండింటిలోనూ వివ‌రాలు ఒకే మాదిరిగా ఉంటే లింక్ చేస్తారు. 

బ్యాంక్ ఖాతా తెరవడం, ఖాతాలో నగదు జమ, డీమ్యాట్‌ ఖాతా తెరవడం, స్థిర ఆస్తులకు సంబంధించిన‌ లావాదేవీలు, సెక్యూరిటీ వ్యవహారాలు వంటి అనేక ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి. పాన్ కార్డు ఫోటో గుర్తింపుగా కూడా పనిచేస్తుంది. దీనిని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అంగీకరిస్తాయి. అయితే ఆధార్‌ను ఇత‌ర గుర్తింపు ప‌త్రాల ఆధారంగా కాకుండా బయోమెట్రిక్‌ ఆధారంగా న‌మోదు చేస్తారు కాబ‌ట్టి పాన్‌-ఆధార్‌లను అనుసంధానించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని