2021లోకి సరికొత్తగా అడుగుపెట్టాం

కొవిడ్‌-19 సంక్షోభాన్ని తట్టుకుని మహీంద్రా గ్రూప్‌ బలంగా నిలబడిందని, 2021లో సరికొత్త ఆవిష్కరణలు, ఉత్పత్తుల దిశగా అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు. తమ గ్రూప్‌లో పని చేస్తున్న సుమారు 100 దేశాల్లోని 2.56 లక్షల మంది ఉద్యోగులకు నూతన సంవత్సరం సందర్భంగా ఆయన లేఖ రాశారు.

Published : 05 Jan 2021 01:48 IST

వ్యాక్సిన్‌ ఆవిష్కరణ రీతిలో ముందుకు సాగుదాం
 గ్రూప్‌ ఉద్యోగులకు ఆనంద్‌ మహీంద్రా లేఖ

దిల్లీ: కొవిడ్‌-19 సంక్షోభాన్ని తట్టుకుని మహీంద్రా గ్రూప్‌ బలంగా నిలబడిందని, 2021లో సరికొత్త ఆవిష్కరణలు, ఉత్పత్తుల దిశగా అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు. తమ గ్రూప్‌లో పని చేస్తున్న సుమారు 100 దేశాల్లోని 2.56 లక్షల మంది ఉద్యోగులకు నూతన సంవత్సరం సందర్భంగా ఆయన లేఖ రాశారు. కరోనాకు ముందు, తరవాత పరిస్థితుల్ని విశదీకరిస్తూ, ఎలా పునరుత్తేజం కావాలో వివరించారు. ‘2020లో కరోనా మహమ్మారి చాలా సమస్యల్ని తీసుకొచ్చింది. ఆ సంక్షోభం నుంచి తొందరగానే బయటపడగలిగాం. కొవిడ్‌-19 వ్యాక్సిన్లు త్వరగా రావడమూ ఉపకరిస్తోంది. సాధారణంగా వ్యాక్సిన్ల తయారీకి 10 ఏళ్లు పట్టేది. అయితే పరిశోధకులు, నియంత్రణ సంస్థల వేగంతో కేవలం 10 నెలల్లో అవి రావడం హర్షణీయం. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయి. ప్రయోజన ఆధారిత వ్యాపారాన్ని కొనసాగించడం, రీబూట్‌ కావడం, పునఃమూల్యాంకనం చేసుకుని ముందుకు సాగడం ఎంతో అవసరం. వ్యాక్సిన్ల తయారీ అనేది పూర్తిగా ప్రయోజన ఆధారిత వ్యాపారం. దాని ప్రయోజనం ఇప్పుడు నెరవేరుతోంది. ఇవాళ ఆ సంస్థలకు డబ్బులు భారీగా వస్తున్నాయి. అలాగే సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి, అనుగుణంగా సన్నద్ధంకావల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో మెడికల్‌ సైన్స్‌ అదే చేసింది. సంప్రదాయ రీతిలో వ్యాక్సిన్‌ తయారీకి ఏళ్ల తరబడి సమయం తీసుకోకుండా, కొత్తగా వచ్చిన సాంకేతికతలతో కేవలం 10 నెలల కాలంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయగలిగింది. సంక్షోభం వచ్చినప్పుడే మనలోని సత్తా కూడా బయటపడుతుంది. ఇప్పుడు 3 వ్యాక్సిన్లు 10 నెలల కాలంలోనే అందుబాటులోకి రావడం దీన్నే నిరూపిస్తోంది. మన గ్రూప్‌ కూడా మన వ్యాపారంలో ఇదే విధానాన్ని కొనసాగించి బలంగా ఎదగాలని కోరుకుంటున్నాన’ని ఆనంద్‌ మహీంద్రా ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు.
బజాజ్‌ ఆటో అమ్మకాల్లో 11% వృద్ధి
దిల్లీ: గత డిసెంబరులో బజాజ్‌ ఆటో మొత్తం 3,72,532 వాహనాలు విక్రయించింది. 2019 ఇదే నెలలో కంపెనీ అమ్మకాలు (3,36,055)తో పోలిస్తే ఇవి 11 శాతం ఎక్కువ. దేశీయ విక్రయాలు 1,53,163 వాహనాల నుంచి 9 శాతం తగ్గి 1,39,606కు పరిమితం అయ్యాయి. మోటార్‌సైకిళ్ల విక్రయాలు 2,84,802 నుంచి 19 శాతం పెరిగి 3,38,584 గా నమోదయ్యాయి. ఎగుమతులు 1,82,892 నుంచి 27 శాతం అధికమై 2,32,926కు చేరాయి.
హోండా మోటార్‌సైకిల్‌ 3% పైకి: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) డిసెంబరులో 2,63,027 వాహన విక్రయాలు నమోదుచేసింది. 2019 ఇదే నెలలో నమోదైన అమ్మకాలు 2,55,283తో పోలిస్తే ఈసారి 3 శాతం పెరిగాయి. దేశీయ విక్రయాలు 2,30,197  నుంచి 5 శాతం వృద్ధితో 2,42,046కు చేరాయి. గిరాకీ పుంజుకోవడంతో వరుసగా అయిదో నెలా విక్రయాల్లో వృద్ధి నమోదైందని కంపెనీ తెలిపింది.

ఉత్పత్తి, విక్రయాలు పెంచేందుకు 1,500 నియామకాలు: నిస్సాన్‌
దిల్లీ: డీలర్‌ భాగస్వాములతో కలిపి భారత్‌లో కొత్తగా 1500 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని జపాన్‌ వాహన దిగ్గజం నిస్సాన్‌ వెల్లడించింది. డిసెంబరు 2న తాము విడుదల చేసిన ఎస్‌యూవీ మాగ్నైట్‌కు 32,800 బుకింగ్‌లు ఇప్పటికే వచ్చాయని, డెలివరీ కోసం వినియోగదారులు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపింది. ప్రస్తుతం చెన్నై ప్లాంట్‌లో నెలకు 2,500 మాగ్నైట్‌ వాహనాలు తయారవుతున్నాయని, వచ్చే నెల నుంచి ఈ సంఖ్యను 3,500-4,000 పెంచే ఉద్దేశంలో భాగంగా మూడో షిఫ్టులో కూడా ఉత్పత్తి ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకోసం కొత్తగా ప్లాంట్‌లో 1,000 మందిని నియమిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. అలాగే విక్రయ కేంద్రాల్లో మరో 500 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని