ఆరోగ్య బీమా! అవ‌స‌ర‌మా?

ఆరోగ్య సమస్యలు ఎదురైతే, ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడకుండా ఆదుకునే ఆరోగ్య బీమా వివరాలు తెలుసుకుందాం

Published : 22 Dec 2020 17:12 IST

రోజురోజుకూ పెరుగుతోన్న వైద్య ఖర్చులతో ఆరోగ్య బీమా అవసరం, ప్రాముఖ్యత మ‌రింత పెరుగుతూ వ‌స్తోంది. భారతదేశంలో సగటున ఒక్కో కుటుంబ వార్షిక ఆదాయంలో 10శాతం వరకు వైద్య ఖర్చులకు వెచ్చిస్తున్నట్టు ఓ స‌ర్వే అంచనా. దీర్ఘకాలిక వ్యాధులకయ్యే ఖర్చుల గురించైతే ఇక చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఆరోగ్య అవ‌స‌రాల‌కే ఇంతింత ఖ‌ర్చు చేస్తుంటే ఏదో ఒక ద‌శ‌లో కుటుంబ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌వుతుంద‌న్న‌ది అక్ష‌ర స‌త్యం. ఆరోగ్య బీమా ఉండడం వల్ల ప‌రిస్థితిని కొద్దిగా అయినా అదుపులో పెట్టుకోవ‌చ్చు. ప్రీమియం రూపేణా కొంత సొమ్మును బీమా కంపెనీలు వసూలు చేసి ఆరోగ్య సమస్యలు త‌లెత్తిన‌ప్పుడు ఆర్థికంగా కొండంత అండ‌గా నిలుస్తాయి.

వివిధ రకాల పాలసీలు బీమా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కరికి లేదా కుటుంబసభ్యులందరికీ కలిపి తీసుకునే పాల‌సీలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలను బట్టి ప్రత్యేక పాలసీల (స్టాండ్‌ అలోన్‌ పాలసీలు)ను ఎంపిక చేసుకోవ‌చ్చు. ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు, తీవ్ర అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు మొదలైనవాటికి వేటిక‌వే విడివిడి గాను, ప్ర‌త్యేకంగానూ పాలసీలున్నాయి.

కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు వైద్య ఖర్చులకు మాత్ర‌మే చెల్లిస్తాయి. మరికొన్ని బీమాదారుల అభీష్టం మేరకు నిర్ణయించిన సొమ్మును చెల్లిస్తాయి.

ఆరోగ్య బీమా పాలసీల పరిధిలోకి వచ్చే అంశాలు:

పాలసీ తీసుకున్నవారి కోసం బీమా కంపెనీలు కొన్ని రకాల ఖర్చులను భరిస్తాయి. బీమా చేయించుకున్న సొమ్ము ఆధారంగా తలెత్తిన ఆరోగ్య సమస్యను బట్టి కేటాయింపులు నిర్ణ‌య‌మ‌వుతాయి. అవి ఏమిటో వివ‌రంగా చూద్దాం…

  • ఆసుపత్రి గది తీసుకున్నందుకు అయ్యే ఖర్చులు

  • ఆసుప‌త్రిలో పొందిన నర్సింగ్‌ ఖర్చులు

  • శస్త్రచికిత్సలకు, అనస్థీషియా, ఫిజీషియన్‌, కన్సల్టెంట్‌లకు, నిపుణులకు అయ్యే ఖర్చులు

  • అనస్థీషియా, రక్తం, ప్రాణవాయువు అందించేందుకు అయిన ఖర్చులు,

  • శస్త్రచికిత్స గదికి, వైద్య పరికరాలకు, మందులకు, ఎక్స్‌రే, డయాలసిస్‌, కీమోథెరపీ, రేడియోథెరపీ, పేస్‌ మేకర్‌, కృత్రిమ అవయవాలను అమర్చడం లాంటి వాటికి అయిన ఖర్చును బీమా కంపెనీలు చెల్లిస్తాయి.

ఆరోగ్య బీమా పాలసీ పరిధిలోకి రాని అంశాలు:

  • పాలసీ తీసుకునే ముందే ఉన్న వ్యాధులు

  • అందానికి మెరుగులు దిద్దేందుకు చేసే శస్త్రచికిత్సలకు…

  • కళ్లద్దాలకు, లెన్స్‌లకు, వినికిడి పరికరాలకు…

  • దంత సంబంధ సమస్యలకు (ప్రమాదం కారణంగా జరిగేవి పాలసీ కింద వర్తిస్తాయి)

  • గర్భస్థ, శిశు జనన సంబంధ

పాల‌సీని బ‌ట్టి బీమా పరిధిలోకి రాని అంశాలు మారుతుంటాయి. పాలసీ తీసుకునే ముందు వివరాలను పరిశీలించి తీసుకోవాలి.

ఆరోగ్య బీమా కొనుగోలు:

ఆరోగ్య బీమా పాలసీని నేరుగా ఆన్‌లైన్‌ విధానంలో కొనుగోలుచేయవచ్చు లేదా బీమా ఏజెంటును సంప్రదించవచ్చు. బీమా కంపెనీకి వెళ్లి నేరుగా తీసుకునే అవకాశం కూడా ఉంది.

బీమా మొత్తం:

పాలసీని ఎంచుకునేటప్పుడు మన అవసరానికి అనుగుణంగా బీమా చేయించుకోవచ్చు. ఆర్థిక స్థితి, నివసించే ప్రాంతంలో ఉండే వైద్య ఖర్చులు, చెల్లించగలిగే ప్రీమియం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని బీమా హామీ మొత్తాన్ని ఎంచుకోవాలి.

ప్రీమియం:

ఆరోగ్య బీమా ప్రీమియం వ్యక్తి వయసు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, కుటుంబ వైద్య చరిత్ర, అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.

వైద్య పరీక్షలు :

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేముందు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్య బీమాలో ఉండే కీలకాంశాలు:

ఆసుపత్రి ఛార్జీలు:

బీమా పరిధిలో ఉన్న వ్యక్తికి బీమా కంపెనీలు ఇన్‌ పేషెంట్‌లకు గది ఖర్చు, నర్సింగ్‌ ఛార్జీలు, మందుల ఖర్చులు పాలసీ గరిష్ఠ పరిమితికి లోబడి చెల్లిస్తారు. ఔట్‌ పేషెంట్‌లక‌యితే 24గంటల కంటే తక్కువగా ఆసుపత్రిలో ఉంటే డే కేర్‌ అంటారు. దీంట్లో శస్త్రచికిత్సలకు, ఇతర చికిత్సలకు, మందులకు బీమా సొమ్ము ఇస్తారు.

ఆసుపత్రిలో చేరకముందు… ఆ తర్వాత:

కొన్ని రకాల చికిత్సలకు ఆసుపత్రికి వెళ్లే ముందు వైద్యపరమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత ఆసుపత్రి నుంచి నిష్క్రమించాక కూడా కొన్ని వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి వాటికి డబ్బు ఖర్చు అవుతుంది. ఇలాంటి ఖర్చులను బీమా కంపెనీలు భరిస్తాయి. క్యాన్సర్‌ లాంటి జబ్బులకు ఆసుపత్రిలో చేరి వచ్చిన తర్వాత కూడా వైద్యపరంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి అవసరాలకు బీమా ఎంతో ఉపయోగపడుతుంది.

నగదురహిత సదుపాయం:

ఆరోగ్య బీమా తీసుకున్నవారు ఆసుపత్రిలో ఎలాంటి నగదు చెల్లించ‌కుండా చికిత్స చేయించుకునే సదుపాయాన్ని కొన్ని బీమా కంపెనీలు అందిస్తున్నాయి. బీమా కంపెనీలు కొన్ని ఆసుపత్రులతో నేరుగా లేదా మధ్యవర్తుల (థర్డ్‌ పార్టీ ఏజెంట్‌) ద్వారా ఒప్పందం కుదుర్చుకొని బీమాదారులకు నగదురహిత సేవలను అందిస్తాయి. ఈ ఆసుపత్రులనే నెట్‌వర్క్‌ ఆసుపత్రులంటారు. ఈ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్యం పొందేందుకు బీమాదారుడికి ఓ ప్రత్యేకమైన కార్డును జారీచేస్తారు. ఈ కార్డును ఉపయోగించి బీమాదారు నగదురహిత వైద్యం చేయించుకునే వెసులుబాటు ఉంటుంది.

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేముందు, ఈ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు మనం నివసించే ప్రాంతాల్లో మనకవసరమైన ప్రమాణాలతో ఉన్నాయో లేదో చూసుకోవాలి.

క్యుములేటివ్‌ బోనస్‌:

ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకున్న త‌ర్వాత పున‌రుద్ద‌ర‌ణ తేదీలోగా ఎలాంటి క్లెయింలు చేయ‌క‌పోతే బీమా కంపెనీలు బోన‌స్‌ను చెల్లిస్తాయి. దీనినే క్యుములేటివ్ బోన‌స్ లేదా నో క్లెయిం బోన‌స్ అంటారు. ఈ విధ‌మైన బోన‌స్‌, బీమా హామీ మొత్తంలో 10 నుంచి 50 శాతం వ‌ర‌కూ ఉండొచ్చు.

ఉదాహరణకు: ఒక వ్యక్తి రూ.లక్ష బీమా పొంది ఉండి పాలసీ పునరుద్ధరించుకునే సమయానికి ఎలాంటి క్లెయింలు చేయకుండా ఉంటే బీమా కంపెనీ 10శాతం నో క్లెయిం బోనస్‌ ఇచ్చిందంటే బీమాదారుడికి హామీ ఇచ్చే బీమా సొమ్ము విలువ రూ.10వేలు పెరుగుతుంది. అంటే ప్రస్తుత బీమా సొమ్ము రూ.1.1లక్షలు అవుతుందన్నమాట. వచ్చే సంవత్సరం బీమాదారుడు క్లెయిం చేసుకుంటే బోనస్‌గా ఇచ్చిన అదనపు బీమాను తొలగించే అవకాశం ఉంటుంది.

చిన్న చిన్న చికిత్స‌ల‌కు బీమా క్లెయిం చేసుకునే బదులు మన చేతి నుంచి ఖర్చు పెట్టడమే మేలు. భవిష్యత్తులో నో క్లెయిం బోనస్‌ వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది.

అంబులెన్స్‌ ఖర్చులు:

ఆరోగ్య బీమా పాలసీలు అత్య‌వ‌స‌ర వైద్యానికి ఉపయోగించే అంబులెన్స్‌ ఖర్చులను కొంతవరకు భరిస్తాయి. మనం తీసుకునే పాలసీ, బీమా కంపెనీ, పాలసీ పరిమితిని బట్టి అంబులెన్స్‌ ఖర్చులకు బీమా అందజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని