రూ.20వేలతో మొదలై రూ.1000కోట్లకు..

కాలక్షేపం కోసం మొదలుపెట్టిన పని వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఇంటి పెరట్లో మొదలైన చిన్న కొట్టు.. నేడు రూ. 1000కోట్ల కంపెనీగా అవతరించింది. అదే బిస్కట్‌ రంగంలో అగ్రగామిగా పేరొందిన ‘మిసెస్‌ బెక్టార్‌ - క్రీమికా’ సంస్థ.

Published : 26 Dec 2020 17:54 IST

‘మిసెస్‌ బెక్టార్’ సక్సెస్‌ స్టోరీ ఇది

ఆమె కాలక్షేపం కోసం మొదలుపెట్టిన ఓ వ్యాపకం ఏకంగా వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించింది. ఇంటి పెరట్లో మొదలైన చిన్న దుకాణం.. నేడు రూ. 1000కోట్ల టర్నోవర్‌ కంపెనీగా అవతరించింది. అదే బిస్కట్‌ తయారీ రంగంలో అగ్రగామిగా పేరొందిన ‘మిసెస్‌ బెక్టార్‌ - క్రీమికా’ సంస్థ. ఈ పేరు దక్షిణాదివారికి పెద్దగా తెలియకపోచ్చు.. కానీ, ఉత్తర భారతదేశంలో ప్రతి ఇంటికి సుపరిచితమే. విదేశీ బ్రాండ్ల పోటీని తట్టుకొని దేశీయ మార్కెట్‌ రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందింది. ఇటీవల ఐపీవోకు వచ్చి సంచలనం సృష్టించింది. బిడ్డింగ్‌ తెరిచిన రెండు గంటల్లోనే దాదాపు 200రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయి విశ్లేషకులను విస్మయపరిచింది. ఈ ఘనత వెనుక ఓ మహిళ 40ఏళ్ల కృషి ఉంది. ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడమా?అని ముక్కున వేలేసుకున్న రోజుల్లోనే ఏకంగా కంపెనీని ప్రారంభించడమేగాక, మహిళా వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆమే ‘మిసెస్‌ బెక్టార్‌’ ఫుడ్స్‌ సంస్థ అధినేత్రి రజనీ బెక్టార్‌. 

17ఏళ్లకే పెళ్లి.. తర్వాత చదువు

రజనీ బెక్టార్‌ అవిభక్త భారత్‌లోని కరాచీ(ప్రస్తుతం పాకిస్థాన్‌) జన్మించారు. తన చిన్నతనమంతా లాహోర్‌లో గడిపిన ఈమె.. విభజన తర్వాత కుటుంబంతో కలిసి దిల్లీకి చేరుకున్నారు. ఇక్కడే ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించారు. అయితే ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆశ ఉన్నప్పటికీ తల్లిదండ్రుల బలవంతం మీద 17ఏళ్ల వయసులోనే రజనీకి లూధియానాకు చెందిన ధర్మవీర్‌ బెక్టార్‌తో వివాహం జరిగింది. అత్తామామలు కూడా చదువుకు అడ్డుచెప్పినా భర్త ప్రోత్సాహంతో పెళ్లి తర్వాత డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టడంతో వారి పెంపకంతో గడిచిపోయింది. అయితే రజనీకి మాత్రం కొత్తగా ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడూ ఉండేది. ఈ క్రమంలోనే పిల్లలను ముస్సోరిలోని బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించడంతో ఆమెకు ఖాళీ దొరికింది. వంటలపై ఉన్న ఆసక్తితో రజనీ కాలక్షేపం కోసం పంజాబ్‌ అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో కుకింగ్‌ అండ్‌ బేకరీ కోర్సులో చేరారు. అక్కడ నేర్చుకున్న అనుభవంతో ఐస్‌క్రీమ్‌లు, బిస్కెట్లు తయారుచేసి తన స్నేహితులకు రుచి చూపించేవారు. అవి తిన్న స్నేహితులు ఎంతో బాగున్నాయంటూ ఆమెను మెచ్చుకునేవారట. 

పెరట్లో మొదలై..

స్నేహితుల సలహాతో ఓవెన్‌, ఐస్‌క్రీం తయారీ మిషన్‌ కొనుగోలు చేసిన రజనీ తన ఇంటి పెరట్లోనే చిన్న బేకరీ షాపు పెట్టుకున్నారు. మొదట్లో తక్కువ ధరకు అమ్మడంతో కొన్ని రోజులు నష్టాలు తప్పలేదు. అంతేగాక, రజనీ ఉంటున్న లూధియానా ఒకప్పుడు చాలా వెనుకబడిన ప్రాంతం. అక్కడ మహిళలు ఉద్యోగం చేస్తున్నారంటే వారిని వింతగా చూసేవారు. ఇంకా వ్యాపారం అంటే మాటలా.. రజనీని చూసి ఇరుగుపొరుగు చెవులుకొరుక్కునేవారట. బయటివారితో పాటు ఇంట్లో అత్తామామల నుంచి కూడా ఆమెకు విమర్శలు తప్పలేదు. ఆ సమయంలో భర్త ధర్మవీర్‌ ఆమెకు అండగా నిలిచారు. స్వతహగా వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ధర్మవీర్‌.. భార్యను వ్యాపారం దిశగా ప్రోత్సహించారు. అలా 1978లో రూ.20వేలు పెట్టుబడి పెట్టి లూధియానాలో ఓ ఐస్‌క్రీం తయారీ యూనిట్‌ను ప్రారంభించారు రజనీ. దాని పేరు ‘క్రీమికా’. ఇక అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత బిస్కెట్లు, బ్రెడ్లు, బన్స్‌, సాస్‌ల తయారీకి వ్యాపారం విస్తరించింది. అనతికాలంలోనే ‘మిసెస్‌ బెక్టార్‌’ బ్రాండ్‌తో ఉత్తర భారత్‌లోని ఆహార విపణిలో మంచి గుర్తింపు సాధించింది. 

మెక్‌డొనాల్డ్స్‌తో ఒప్పందం..

1990ల్లో మెక్‌డొనాల్డ్స్‌ భారత మార్కెట్లోకి అడుగుపెడుతూ బన్‌ తయారీ కోసం స్థానిక వ్యాపార సంస్థలను అన్వేషించింది. 1995లో క్రీమికా ఆ అవకాశం దక్కించుకుంది. మెక్‌డొనాల్డ్స్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. ఆ కంపెనీకి బన్‌, బ్రెడ్‌లను సరఫరా చేస్తోంది. అలా 2006 నాటికి మిసెస్‌ బెక్టార్‌ కంపెనీ ఆదాయం రూ. 100కోట్లకు చేరింది. 2011-12 నాటికి టర్నోవర్‌ రూ. 650కోట్లకు చేరింది. ఆ తర్వాత పిజా హట్‌, పాపా జాన్స్‌, డోమినోస్‌, బర్డర్‌ కింగ్‌ లాంటి ఎన్నో విదేశీ సంస్థలతో మిసెస్‌ బెక్టార్‌ ఒప్పందం కుదుర్చుకుంది. వాటికి బ్రెడ్, పిజా బేసెస్‌, సాస్‌లను సరఫరా చేస్తోంది. ‘ఇంగ్లీష్‌ ఓవెన్‌’ పేరుతో కేక్‌లు, బన్స్‌ సరఫరా చేస్తున్న ‘మిసెస్‌ బెక్టార్‌’ కంపెనీ మాండెలెజ్‌ ఇండియా ఫుడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో ఓరియో, చాకోబేక్స్‌ వంటి ప్రముఖ బ్రాండ్ల బిస్కట్లను కూడా తయారుచేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్‌ దాదాపు రూ. 1000కోట్లుగా ఉంది.

పనే పరమావధిగా.. 

విజయానికి దగ్గరదారులుండవు.. కష్టపడి పనిచేయాల్సిందే అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు రజనీ బెక్టార్‌. పనే దైవంగా భావించే ఆమె.. నాణ్యత విషయంలోనూ ఎక్కడా రాజీపడరు. సాధారణంగా ఇతర వ్యాపారాలతో పోలిస్తే ఆహార పదార్థాల విక్రయాల్లో నమ్మకం అత్యంత అవసరం. నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తామనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడంతో పాటు దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. దాని కోసం రజనీ నిరంతరం కృషి చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యమైన ఉత్పత్తులనే అందించాలనుకుంటారు. ఉత్పత్తుల కోసం ముడిసరుకులను సేకరించడం దగ్గర్నుండి సిబ్బంది పనిచేసే విధానాన్ని దగ్గరుండి చూసుకునేవారు. ఇందుకోసం రోజుకు 16 గంటలు శ్రమించి కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పటికీ ‘మిసెస్‌ బెక్టార్‌’ తయారుచేసే ఉత్పత్తులను ఆమె రుచిచూసి ఓకే చెబితేనే అవి మార్కెట్లోకి వస్తాయంటే పనిపట్ల ఎంత నిబద్ధతగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

రజనీ భర్త ధర్మవీర్‌ బెక్టార్‌ కుటుంబానికి ఎరువులు, విత్తనాల వ్యాపారం ఉండేంది. పంజాబ్‌లో బెక్టార్‌ కంపెనీకి మంచి గుర్తింపు ఉండేది. 1984లో ఆపరేషన్‌ బ్లూస్టార్‌, అనంతరం అల్లర్ల సమయంలో పరిస్థితులు ఇబ్బందికరపరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో వీరికి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ధర్మవీర్‌ కూడా భార్య ఫుడ్‌ బిజినెస్‌పైనే దృష్టిపెట్టారు. అలా మిసెస్‌ బెక్టార్‌ సంస్థ మరింత ప్రాచుర్యంలోకి వెళ్లింది. చదువులు పూర్తయిన తర్వాత కుమారులు కూడా మిసెస్‌ బెక్టార్‌ కంపెనీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు అక్షయ్‌ సాస్‌లు, బ్రెడ్ల తయారీ వ్యాపారం చూసుకుంటుండగా.. మిగతా ఇద్దరు కుమారులు అనూప్‌, అజయ్‌ క్రీమికా బ్రాండ్‌ కింద బిస్కట్ల వ్యాపారం చూసుకుంటున్నారు. 

మార్కెట్లో సంచలనం..

* ఈ నెల 15న మిసెస్‌ బెక్టార్‌ కంపెనీ స్టాక్‌మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఐపీఓకు వెళ్లి రెండు గంటల్లోనే దాదాపు 200 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ దక్కించుకుంది. ఈ నెల 24న షేర్ల కేటాయింపు వివరాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. 30వ తేదీన మార్కెట్లో లిస్ట్‌ కానుంది. 

* 2018లో ఈ కంపెనీ ఒక సారి ఐపీవోకు వచ్చేందుకు అవసరమైన అనుమతులు తీసుకొంది. కానీ, నాటి మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంది. 

* అంతర్జాతీయ బ్రాండ్లు దేశంలో పాగా వేస్తున్న తరుణంలో పోటీని తట్టుకుని తన వ్యాపార తెలివితేటలతో కంపెనీని ముందుకు నడిపిస్తోన్న శ్రీమతి రజనీ బెక్టార్‌ నేటి మహిళలకు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఇవీ చదవండి..

మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోండిలా..

డిజిటల్‌ రంగంలోకి స్వదేశీకే మొగ్గు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని