పెట్టుబ‌డులు పెడుతున్నారా.. అయితే ఈ 4 విష‌యాలు గుర్తుంచుకోండి..

లిక్విడిటి, భ‌ద్ర‌త‌, రాబ‌డి, ప‌న్ను ప్ర‌యోజ‌నాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మీ ఆర్థిక ల‌క్ష్యానికి త‌గిన‌ పెట్టుబ‌డి సాధ‌నాల‌ను ఎంచుకోవాలి.

Updated : 11 Oct 2021 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంపాదించే మొత్తం డ‌బ్బులో ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తుంటాం. అయితే ఇక్క‌డితో బాధ్యత పూర్తైపోదు. సంప‌ద సృష్టికి పొదుపు ఒక్క‌టే స‌రిపోదు. మ‌దుపు చేయాలి. పొదుపు మొత్తాన్ని స‌రైన స‌మ‌యంలో, స‌రైన చోట మ‌దుపు చేస్తేనే ద్రవ్యోల్బణాన్ని అధిగ‌మించి స‌కాలంలో మీ ల‌క్ష్య‌సాధ‌న కోసం కావాల్సిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకోగ‌లుగుతారు. పెట్టుబ‌డులు పెట్టడంతో పాటు స‌కాలంలో డ‌బ్బు వృద్ధి చెందుతుందో లేదో కూడా నిర్ధారించుకోవాలి. అందుకు పెట్టుబ‌డి పెట్టేముందు ఈ కింది విష‌యాలు గుర్తుంచుకోవాలి.

1. త‌గినంత లిక్విడిటీ ఉండాలి..
ఆదాయం త‌గ్గిన‌ప్పుడు లేదా అనుకోని ఖ‌ర్చులు వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌మ‌ర్థ‌ంగా ఎదుర్కొనేందుకు త‌గినంత లిక్విడిటీ ఉండాలి. అనుకోని ఖ‌ర్చులు కోసం దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌ను ర‌ద్దు చేస్తే లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌గా ఉంటుంది. చివ‌రి వ‌ర‌కు కొన‌సాగిస్తేనే మంచి రాబ‌డి వ‌స్తుంది. అందువ‌ల్ల‌ దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల జోలికి పోకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లి
క్విడిటీ ఉన్న పెట్టుబడుల్లోనూ కొంత మొత్తాన్ని మ‌దుపు చేయాలి. దీంతో పాటు త‌గినంత హామీతో ఆరోగ్య, జీవిత బీమా రెండింటినీ తీసుకోవాలి. స‌రైన బీమా లేక‌పోయినా లిక్విడిటీ లేక‌పోయినా దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌ను నుంచి డ‌బ్బు తీయాల్సి వ‌స్తుంది. దీంతో న‌ష్ట‌పోక త‌ప్ప‌దు.

2. ఆస్తి కేటాయింపు వ్యూహం.. 
ఎక్క‌డ పెట్టుబ‌డులు పెట్టాలో తెలియాలంటే మూడు ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు మీ వ‌ద్ద ఉండాలి. ఎంత రిస్క్ తీసుకోవ‌డం అవ‌స‌రం? మీరు తీసుకోగ‌ల రిస్క్ సామ‌ర్థ్యం ఎంత‌? ఎంత రిస్క్ తీసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు? ఈ ప్ర‌శ్న‌ల‌కు  మీ వ‌ద్ద స‌మాధానం ఉంటే ఆస్తి కేటాయింపు ఎక్క‌డ చేయాలో తెలుస్తుంది. 
ల‌క్ష్యానికి ఉన్న స‌మ‌యం ఆధారంగా పెట్టుబ‌డులను ఎంచుకోవ‌చ్చు. మెచ్యూరిటీ వ్య‌వ‌ధి ద‌గ్గ‌ర‌గా ఉంటే త‌క్కువ న‌ష్ట‌భ‌యంతో కూడిన స్వ‌ల్ప‌కాలిక పెట్టుబ‌డులు, కొంచెం ఎక్కువ స‌మ‌యం ఉంటే మ‌ధ్య కాలిక పెట్టుబ‌డులు, ఇంకా ఎక్కువ కాలం ఉంటే అధిక రిస్క్‌తో కూడిన దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌ను ఎంచుకుని పోర్టిఫోలియోని ఏర్పాటు చేసుకోవ‌చ్చు.

3. సమీక్ష‌..
ల‌క్ష్యానికి చేరువవుతున్న కొద్దీ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యం.. మ‌ధ్య కాలికంగానూ, ఆ త‌ర్వాత స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యంగానూ మారుతుంది. నిర్దిష్ట ఆర్థిక లక్ష్యం ఆధారంగా పెట్టుబ‌డులు చేస్తుంటాం. కాబ‌ట్టి మ‌నం చేసే పెట్టుబ‌డులు అనుకున్న‌ స‌మ‌యానికి ఆర్థిక ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకునేందుకు అవ‌స‌ర‌మైన డ‌బ్బును అందిస్తాయా? లేదా? ఒక‌వేళ చేరుకోక‌పోతే, అద‌నంగా ఎంత పెట్టుబ‌డి పెట్టాలి అనే విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష చేసుకుంటూ ఉండాలి. మార్కెట్లో చోటుచేసుకునే మార్పుల కార‌ణంగా పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఏవైనా మార్పులు చేయాల్సి వ‌స్తే ఈ స‌మీక్ష‌ స‌హాయ‌ప‌డుతుంది. ఆర్థిక ల‌క్ష్యం పూర్తయ్యే స‌మయానికి పెట్టుబ‌డుల‌ను త‌గిన విధంగా స‌ర్దుబాటు చేయొచ్చు.

4. వైవిధ్య‌త‌.. 
పెట్టుబ‌డి పెట్టేప్పుడు అనేక ర‌కాలుగా ఆలోచించి, విశ్లేషించి పెట్టుబ‌డులు పెడుతుంటాం. కానీ ఒక్కోసారి మ‌న విశ్లేష‌ణ త‌ప్పుకావ‌చ్చు. అలాంట‌ప్పుడు పెట్టిన పెట్టుబ‌డి అంతా న‌ష్ట‌పోయే అవకాశం ఉంది. అందుకే మొత్తం పెట్టుబ‌డిని ఒకేచోట పెట్ట‌కూడ‌దు అంటారు నిపుణులు. పెట్టుబ‌డులకు వైవిధ్య‌తను క‌ల్పించ‌డం ద్వారా న‌ష్ట‌భ‌యాన్ని త‌గ్గించుకునేందుకు, దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. 
పెట్టుబ‌డిదారులు త‌మ‌ న‌ష్టభ‌యం ఆధారంగా వారి ల‌క్ష్యాల‌ను సాధించేందుకు.. వైవిధ్య‌తతో కూడిన పోర్ట్‌ఫోలియోను ఎంచుకోవాలి. ప్ర‌తి వ్య‌క్తికీ వారి వ‌య‌స్సు, ఆదాయం, చేస్తున్న ఉద్యోగం/వ్యాపారం మొద‌లైన వాటి ఆధారంగా విభిన్న ఆర్థిక ల‌క్ష్యాలు ఉంటాయి. అందువ‌ల్ల ప్ర‌తి పెట్టుబ‌డిదారుడు వారి త‌గిన‌ట్లుగా పెట్టుబ‌డుల‌ పోర్ట్‌పోలియోను అభివృద్ధి చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని