ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై రుణం తీసుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి.. 

ఒక వ్య‌క్తి డిపాజిట్ చేసిన‌ ఫిక్స్‌‌డ్ డిపాజిట్ విలువ ఆధారంగా బ్యాంకులు ఓవర్‌డ్రాఫ్ట్ ప‌రిమితిని నిర్ణ‌యిస్తాయి. 

Updated : 24 Apr 2021 09:08 IST

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనాల్లో ఒకటి. ఇది సురక్షితమైనదిగా భావిస్తున్నందును ఇందులో పెట్టుబడుల‌కు ఇష్టపడతారు, హామీ రాబడి కూడా ఉంటుంది. మీ అవసరాన్ని బట్టి,  7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ గ‌డువుతో ఎఫ్‌డీని ఎంచుకోవచ్చు. అవసరమైనప్పుడు బ్యాంక్ ఎఫ్‌డీలను సులభంగా ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ, గ‌డువుకు ముందే ఉపసంహరణ చేస్తే కొంత జరిమానాను  చెల్లించాల్సి రావ‌చ్చు. 

త‌క్కువ ఖ‌ర్చుతో నిధులు సేక‌రించేందుకు ఉన్న మార్గాల‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒక‌టి. బ్యాంకులో  ఎఫ్‌డీలు ఉన్న‌వారు వాటిని ర‌ద్దు చేయ‌కుండా రెండు ర‌కాలుగా అప్పు తీసుకోవ‌చ్చు. మొద‌టిది బ్యాంకులో ఉన్న‌ ఎఫ్‌డీని హామీగా ఉంచి రుణం తీసుకోవ‌డం.  రెండ‌వ‌ది మీ డిపాజిట్‌పై  ఓవ‌ర్ డ్రాఫ్ట్‌(ఓడి) జారీ చేయ‌మ‌ని బ్యాంకుని అడ‌గడం. 

మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ విలువపై ఓవ‌ర్ డ్రాఫ్ట్ ప‌రిమితి ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక‌వేళ మీరు రూ.10 ల‌క్ష‌ల‌కు ఫిక్స‌డ్ డిపాజిట్ చేస్తే, రూ.9 ల‌క్ష‌ల వ‌ర‌కు ఓవ‌ర్‌డ్రాఫ్ట్ లిమిట్‌ను మంజూరు చేసే అవ‌కాశం ఉంటుంది. ఈ రూ.9 ల‌క్ష‌ల ప‌రిమితిలో త‌మ‌కు కావ‌ల‌సిన మొత్తాన్ని తీసుకోవ‌చ్చు. ఓవ‌ర్ డ్రాఫ్ట్ చేసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నిర్ణీత‌ కాల‌ప‌రిమితి లేదు. అయితే అప్పు తీసుకున్న వ్య‌క్తి, తిరిగి చెల్లించేంత‌వ‌ర‌కు వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 

ఎఫ్‌డీపై రుణం ఇత‌ర రుణాల మాదిరిగానే ఉంటుంది. రుణ‌గ్ర‌హీత బ్యాంకు నుంచి ఒకేసారి డ‌బ్బు అప్పుగా తీసుకుని స‌మాన‌మైన నెల‌వారీ వాయిదాల(ఈఎమ్‌లు)లో తిరిగి చెల్లిస్తాడు. సాధార‌ణంగా, అన్ని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రుణం తీసుకునే అవ‌కాశం ఉంది. ఈ రుణంపై వసూలు చేసే వడ్డీ బ్యాంకులు ఎఫ్‌డీ డిపాజిట్‌పై చెల్లించే వడ్డీ కంటే 2 శాతం ఎక్కువ‌గా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి, ఒక వ్య‌క్తి ఫిక్స్‌డ్ డిపాజిట్ పై 7 శాతం వ‌డ్డీ పొందుతుంటే, ఎఫ్‌డీపై తీసుకున్న రుణానికి అత‌ను 9 శాతం వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏదేమైనా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని బ్యాంకులు  మాత్రం ఎఫ్‌డీ రేటు కంటే 0.75 శాతం, 1 శాతం ఎక్కువ వ‌డ్డీ వసూలు చేస్తున్నాయి. 

ఎఫ్‌డీ డిపాజిట్ల‌పై వివిధ బ్యాంకులు అందించే  వ‌డ్డీ రేట్లు, రుణ ప‌రిమితి, వ‌సూలు చేసే వ‌డ్డీ వివ‌రాలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ఎఫ్‌డీ డిపాజిట్ల‌పై ఎస్‌బీఐ 2.90 శాతం నుంచి 5.40 శాతం వ‌ర‌కు వివిధ కాల‌ప‌రిమితుల‌కు వ‌డ్డీ అందిస్తుండ‌గా,  రుణాల‌పై బ్యాంకు అందించే వ‌డ్డీ రేటు కంటే ఒక‌శాతం అధికంగా వ‌డ్డీ వ‌సూలు చేస్తుంది.  అలాగే ఆన్‌లైన్లో క‌నీసం రూ.25వేల‌ వ‌ర‌కు ఎఫ్‌డీపై రుణం తీసుకోవ‌చ్చు. బ్యాంకు బ్రాంచ్‌లో క‌నీస ప‌రిమితి లేదు, రుణ విలువ‌లో గ‌రిష్టంగా 90శాతం రుణం అందిస్తుంది. 

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ..
పీఎన్‌బీ  3 శాతం మొద‌లుకుని గ‌రిష్టంగా 5.30 శాతం వ‌ర‌కు వ‌డ్డీ అందిస్తుండ‌గా,  రుణాల‌పై ఎఫ్‌డీ వ‌డ్డీ రేటు 0.75అధికంగా వ‌డ్డీ వ‌సూలు చేస్తుంది.  అలాగే ఆన్‌లైన్ ద్వారా క‌నీసం రూ.25 వేల‌ వ‌ర‌కు రుణం తీసుకోవాల్సి ఉంటుంది. గ‌‌రిష్టంగా ఎప్‌డీ విలువ‌పై 95శాతం రుణం పొందే వీలుంది. 

ఇండియన్ బ్యాంక్..
ఈ బ్యాంకులో 2.90 శాతం నుంచి 5.25 శాతం వ‌ర‌కు వ‌డ్డీతో వివిధ కాల‌ప‌రిమితుల‌కు ఎఫ్‌డీలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు అందించే వ‌డ్డీ రేటు కంటే 2శాతం అధికంగా వ‌డ్డీ ఉంటుంది. డిపాజిట్ విలువ‌పై గ‌రిష్టంగా 90శాతం వ‌ర‌కు రుణం పొంద‌చ్చు. 

సిటి బ్యాంక్ ..
ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సిటి బ్యాంక్ అందించే క‌నీస వ‌డ్డీ రేటు 1.85 శాతం. గ‌రిష్టంగా 3.50 శాతం ఉంది. రుణం తీసుకునే వారు ఎఫ్‌డీలపై వ‌చ్చే వ‌డ్డీ రేటు కంటే  2.50 వ‌ర‌కు ఎక్కువ వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. క‌నీస రుణం రూ.1ల‌క్ష‌, డిపాజిట్ విలువలో గ‌రిష్టంగా 90 శాతం రుణంగా పొంద‌చ్చు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..
ఎఫ్‌డీల‌‌పై క‌నీసం 2.50 శాతంతో మొద‌లుకుని గ‌రిష్టంగా 5.50 శాతం వ‌ర‌కు వ‌డ్డీ అందిస్తుంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. ఎఫ్‌డీ రేటుపై 2 శాతం అధికంగా వ‌డ్డీ ఉంటుంది. క‌నీస రుణ మొత్తం రూ.25వేలు. గ‌రిష్టంగా ఎఫ్‌డీలో 90శాతం మొత్తాన్ని రుణంగా పొందే వీలుంది. 

ఫెడ‌ర‌ల్ బ్యాంక్..
ఇందులో 2.50 నుంచి 5.50 వ‌ర‌కు వ‌డ్డీతో వివిధ కాల‌ప‌రిమితుల‌కు ఎఫ్‌డీలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు అందించే వ‌డ్డీ రేటు కంటే 2శాతం అధికంగా వ‌డ్డీ ఉంటుంది. క‌నీస ప‌రిమితి లేదు. డిపాజిట్ విలువ‌పై గ‌రిష్టంగా 90శాతం వ‌ర‌కు రుణం పొంద‌చ్చు. 

యాక్సిస్ బ్యాంక్ ..
ఎఫ్‌డీపై 2.50 శాతం మొద‌లుకుని గ‌రిష్టంగా 5.75 శాతం వ‌ర‌కు వ‌డ్డీ బ్యాంకు అందిస్తుండ‌గా,  రుణాల‌పై బ్యాంకు అందించే వ‌డ్డీ రేటు కంటే 2 శాతం అధికంగా వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. అలాగే క‌నీసం రూ.25 వేలు రుణం తీసుకోవ‌చ్చు. రుణ విలువ‌పై గ‌రిష్టంగా 85శాతం వ‌ర‌కు రుణం పొంద‌చ్చు. 

బంధ‌న్ బ్యాంక్.. 
ఈ బ్యాంకులో 3 శాతం నుంచి 5.75 శాతం వ‌ర‌కు వ‌డ్డీతో వివిధ కాల‌ప‌రిమితుల‌కు ఎఫ్‌డీలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు అందించే వ‌డ్డీ రేటు కంటే 1.50శాతం నుంచి 2శాతం అధికంగా వ‌డ్డీ ఉంటుంది. క‌నీస ప‌రిమితి లేదు. గ‌రిష్టంగా డిపాజిట్ విలువలో 90శాతం వ‌ర‌కు రుణం తీసుకునే వీలు క‌ల్పిస్తుంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని