కోవిడ్‌-19 క్లెయిమ్ కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా? అయితే ఈ విష‌యాలు గుర్తుంచుకోండి..

ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవ‌డం ఎంత ముఖ్యంమో..క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ సజావుగా పూర్తైయ్యేలా చూసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. 

Updated : 29 Apr 2021 11:02 IST

సంక్షోభ స‌మ‌యంలో బీమా అనేది ఆర్థికంగానే కాకుండా మాన‌సికంగా కూడా ధైర్యాన్ని ఇస్తుంది. కోవిడ్‌కి ముందే కొంత‌మందికి ఆరోగ్య బీమా పాల‌సీలు ఉన్నాయి. అయితే కోవిడ్ ఆరోగ్య బీమా ప్రాముఖ్య‌త‌, అవ‌స‌రాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసంది. అందువ‌ల్ల ఈ స‌మయంలో ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య కూడా బాగానే పెరిగిందని చెప్పాలి.

సాధార‌ణ ఆరోగ్య బీమా మాత్ర‌మే కాకుండా, కోవిడ్‌-19 కి సంబంధించిన ప్ర‌త్యేక పాల‌సీలు కూడా ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ పాల‌సీల‌ను తీసుకున్న‌వారు కుటుంబంలోని ఒక వ్య‌క్తికి కోవిడ్ సోకిన‌ప్పుడు, బీమా సంస్థ‌ను సంప్ర‌దించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లెయిమ్‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం చాలా ముఖ్యం. ఈ విధానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

కోవిడ్ సంబంధిత క్లెయిమ్‌లు సాధార‌ణ ఆరోగ్య బీమా కింద‌కి వ‌స్తాయి. బీమా నియంత్ర‌ణ సాధికారిక సంస్థ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం, బీమా సంస్థ‌లు త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలోనే పాల‌సీల‌ను ప‌రిష్క‌రిస్తున్నాయి.

క్లెయిమ్ చేసేముందు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి..

1. బీమా సంస్థ‌ల‌కు తెలియ‌జేయండి..
కోవిడ్ -19 కి సంబంధించిన ఏదైనా లక్షణాన్ని మీరు గమనించినట్లయితే,  మొదట  ప్రభుత్వ అధీకృత ప్రయోగశాలలలో మాత్రమే ప‌రీక్ష‌లు చేయాలి.

క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో ఎదురైయ్యే స‌మ‌స్య‌ల‌ను నివారించడానికి పాల‌సీ చేసిన వ్య‌క్తి తీసుకుంటున్న చికిత్స -  హోమ్ కేర్‌, క్వారంటైన్‌, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారా..అనే స‌మాచారాన్ని బీమా సంస్థకు తెలియజేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం బీమా సంస్థ క్లెయిమ్‌ల‌ను అంచనా వేసి, దాని ప్ర‌కారం క్లెయిమ్ల‌ను ప‌రిష్క‌రిస్తుంది. 

2. ప్ర‌భుత్వ అధీకృత‌ ప్ర‌యోగ‌శాల‌లో ప‌రీక్ష‌లు..
శ్వాసకోశ వ్యవస్థలో కరోనావైరస్ ఉనికిని నిర్ధారించడానికి ప్రయోగశాలలో పరీక్షలు చేయించ‌డం అవసరం. భారతదేశంలో కోవిడ్‌-19 పరీక్షలను నిర్వహించడానికి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్‌) ఆమోదించిన, ప్రభుత్వ ల్యాబ్‌లు, ప్రైవేట్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఐసీఎమ్ఆర్‌ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన వైద్యుడు సూచించినప్పుడు మాత్రమే ప్రైవేట్ ల్యాబ్‌లు పరీక్ష‌లు చేస్తాయి. మీరు క్లెయిమ్ కోసం దాఖలు చేస్తున్నప్పుడు, ప్రభుత్వ అధీకృత ప్రయోగశాల నుంచి పొందిన పరీక్ష నివేదికను, దీనితో పాటు అర్హ‌త క‌లిగిన వైద్యుడు ప‌రీక్ష కోసం సిఫారుసు చేసిన ప్రిస్క్రిస్ష‌న్‌ను ద‌ర‌ఖాస్తుతో పాటు స‌మ‌ర్పించాలి. ఈ విధంగా చేయ‌డం ద్వారా ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉంటాయి. 

3. ఖ‌ర్చుల‌ను తెలియ‌జేయండి..
సాధార‌ణంగా, ఆసుప‌త్రిలో చేరే ముందు, ఆ త‌రువాత అయిన ఖ‌ర్చులు(ప్రీ, పోస్ట్ హాస్ప‌ట‌లైజేష‌న్‌) - అంబులెన్స్ ఛార్జీలు, కోవిడ్‌-19కి సంబంధించిన చికిత్స ఖ‌ర్చులు వంటివి పాల‌సీలో క‌వ‌రవుతాయి. 

కోవిడ్ కేసుల‌కు సంబంధించి ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే, ప్రీ ఆథ‌రైజేష‌న్‌..అంటే బీమా సంస్థ‌కు ముందుగానే తెలియ‌జేసి ఆమోదం పొందితే, బీమా సంస్థ నుంచి గానీ, ఆసుప‌త్రిలో ఉంటే థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్(టీపీఏ) డెస్క్ నుంచి గానీ ఎక్కువ ప్ర‌శ్న‌లు ఉండ‌వని నిపుణులు చెబుతున్నారు. అందువ‌ల్ల‌, ఆసుప్ర‌తిలో చేరేందుకు ముందు అన్ని ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలి. డిస్చార్జ్ త‌రువాత బిల్లుల‌తో పాటు చికిత్స‌ను కూడా ఫాలోఅప్ చేయాలి. 

4. డిస్చార్జ్ సమరీ రికార్డ్‌..
క్లెయిమ్ సెటిల్‌మెంట్ స‌మ‌యంలో డిస్చార్జ్ సమరీ పేప‌ర్ల‌ను మీ వ‌ద్ద ఉంచుకోవాలి. దీని వ‌ల్ల ఆసుప్ర‌తిలో ఎన్ని రోజులు ఉన్నారు(ఐసీయూ, జ‌న‌ర‌ల్ రూమ్‌ల‌లో ఉన్న రోజుల‌తో స‌హా).. అనే విష‌యాలు బీమా సంస్థ‌కు తెలుస్తాయి. 

నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రిలో చేరితే న‌గ‌దు ర‌హితంగా క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేస్తారు. ఒక‌వేళ నెట్‌వ‌ర్క్‌లో లేని ఆసుప్ర‌తిలో జాయిన్ అయితే, రియంబ‌ర్స్‌మెంట్‌ వ‌స్తుంది.  బీమా సంస్థ‌కు/టీపీఏకు  క్లెయిమ్ దాఖ‌లు చేసిన త‌రువాత‌, గ‌రిష్టంగా 15 పని రోజుల‌లో ప‌రిష్కార‌మ‌వుతుంది. 

5. ఆసుపత్రిలో చేరేందుకు కావ‌ల‌సిన ప‌త్రాలు..
కోవిడ్‌కు సంబంధించిన కేసుల‌లో ఆసుప‌త్రిలో చేరేట‌ప్పుడు, పాల‌సీదారుడు త‌మ ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్‌, పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు మెడిక‌ల్ హెల్త్ కార్డును తీసుకెళ్ళాలి. ఇవి స‌మ‌ర్పించ‌డం వ‌ల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ సుల‌భంగా, వేగంగా పూర్త‌వుతుంది. 

గుర్తుంచుకోండి..
క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా స‌జావుగా సాగేందుకు, బీమా సంస్థ‌తో అనుసంధాన‌మైన నెట్‌వ‌ర్క్ ఆసుప్ర‌తిలో న‌గ‌దు ర‌హితంగా చికిత్స‌ను పొంద‌డం మంచింది. ఒక‌వేళ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో బీమా సంస్థ నెట్‌వ‌ర్క్‌లో లేని ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే, రియంబ‌ర్స్‌మెంట్‌ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. న‌గ‌దు ర‌హిత సేవ‌ల విష‌యంలో ఏమైనా ఇబ్బందులు తెలెత్తితే బీమా సంస్థ‌కు ఫిర్యాదు చేయాలి. బీమా సంస్థ వ‌ద్ద మీ క్లెయిమ్ స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే బీమా రెగ్యులేట‌రీ అండ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ)కు కూడా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అక్కడ కూడా పరిష్కారం లభించకపోతే బీమా అంబుడ్స్‌మెన్‌ ని సంప్రదించవచ్చు. ఈ ద‌శ‌లో నిజ‌మైన న‌గ‌దు ర‌హిత క్లెయిమ్‌ల‌ను బీమా సంస్థ‌లు, ఆసుప్ర‌తులు ఆల‌స్యం కాకుండా చూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని