హోమ్‌లోన్ తీసుకునేముందు గ‌మ‌నించాల్సిన‌వి 

ఇంటి కోసం రుణం తీసుకునేట‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది

Updated : 16 Mar 2021 18:27 IST

మధ్య తరగతి వారు సొంత ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఉపకరించే ఒక మంచి మార్గం గృహ రుణం. ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే రుణం చెల్లించేటప్పుడు కొంత భారం ప‌డే అవ‌కాశం ఉంటుంది. మేలైన గృహ రుణాన్ని ఎంచుకునేందుకు 6 విషయాలను జాగ్రత్తగా గమనిస్తే వీలైనంత వరకూ రుణ చెల్లింపు సమయంలో వచ్చే ఇబ్బందులను అధిగమించవచ్చు.

స్వ‌ల్ప కాలపరిమితి: రుణ కాలపరిమితి విషయంలో బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలవైపే మొగ్గు చూపుతాయి. 30 లక్షల రుణానికి 8% వడ్డీ చొప్పున 20 సంవత్సరాలకు వడ్డీ రూపంలోనే దాదాపు 30 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ స్వల్పంగా వడ్డీ రేటు లేదా రుణ కాలపరిమితి పెరిగినా ఇంటి ధర కంటే మీరు చెల్లించే వడ్డీయే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సంపాదన సామర్థ్యం బాగా ఉన్నవారు స్వల్పకాలంలో ఈఎమ్‌ఐలు చెల్లించగలిగే గృహ రుణం తీసుకోవడం మంచిది.

వడ్డీ రేట్లను త‌గ్గించమ‌ని కోరండి: బ్యాంకుల వ‌డ్డీ రేట్ల గురించి తెలుసుకోవ‌డం చాలా అవ‌స‌రం. మీ రుణ సంస్థ వ‌డ్డీ ఎక్కువ‌గా ఉంద‌నుకుంటే ఇత‌ర బ్యాంకుల‌తో పోల్చి చూసుకోవ‌చ్చు. మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండి, మీరు రుణం స‌మ‌యానికి చెల్లించ‌గ‌లిగే స్థోమ‌త ఉన్న‌ప్పుడు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించే అవ‌కాశ‌ముంటుంది. ఒక‌వేళ త‌గ్గించ‌క‌పోతే, ఇత‌ర బ్యాంకులో రుణం తీసుకోవ‌డం మంచిది. ఆన్‌లైన్ బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థల వ‌డ్డీ రేట్ల‌ను చూసి నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు.

త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను ఎంచుకోండి: గృహ రుణం తీసుకునేముందు వ‌డ్డీ రేట్ల‌ను ప‌రిశీలించ‌డం చాలా కీల‌కం. చాలా మంది బ్యాంకు ఎంత వ‌డ్డీ విధిస్తే అంత చెల్లిస్తుంటారు. త‌గ్గించుకునే అవ‌కాశాల కోసం వెత‌క‌రు. రుణం తీసుకునే ముందు బ్యాంకు నియ‌మ నిబంధ‌న‌లు, ప‌రిమితులు, గ‌రిష్ఠ కాల‌ప‌రిమితి, చెల్లింపు విధానాలు వంటివి తెలుసుకోవాలి. అన్నీ చూసుకొని త‌క్కువ వ‌డ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో దానిని నిర్ణ‌యించుకోవాలి. ఇత‌ర బ్యాంకుల‌తో పోలిస్తే కొంత ఎక్కువ ఉన్నా ఫ‌ర్వాలేదు కానీ మ‌రీ ఎక్కువ‌గా ఉంటే మాత్రం త‌క్కువ వ‌డ్డీ ఉన్న బ్యాంకుల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

మంచి క్రెడిట్ స్కోర్: మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నంత మాత్రాన హోమ్ లోన్ ఇస్తార‌న్న‌ది క‌చ్చితంగా చెప్ప‌లేం. దీనికి ఇత‌ర కార‌ణాలు కూడా ఉండ‌వ‌చ్చు. బ్యాంకులు మీ ఆదాయం, వ‌య‌సు, రుణ నిష్ప‌త్తి, ప‌నిచేసే సంస్థ ఇవ‌న్నీ ప‌రిశీలిస్తుంది. గృహ రుణం కోసం దాఖ‌లు చేసే ముందు ఆన్‌లైన్ లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట‌ర్ల ద్వారా మీ రుణ అవ‌కాశాన్ని లెక్కించుకోండి. అప్పుడు మీకు రుణం ల‌భిస్తుందో లేదో సుల‌భంగా తెలుస్తుంది.

వివిధ రుసుములు: ప్రాసెసింగ్‌ రుసుము , నిర్వహణ రుసుము, ఆలస్య చెల్లింపు రుసుము, ముందస్తు చెల్లింపు రుసుము వంటి వాటి గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆర్థిక భారం ఎక్కువ అవుతోందని అనిపించి ఒక్కసారిగా రుణం తీర్చేయాలనుకుంటే అందుకుగానూ ముందస్తు చెల్లింపు రుసుము రూపంలో భారీ మొత్తంలో చెల్లించాల్సి రావచ్చు. ఒక్కోసారి వడ్డీ రేటు తక్కువ అని చెప్పినా, అన్నీ రుసుములు కలిపి లెక్కిస్తే చెల్లించే మొత్తం చాలా ఎక్కువ అవుతుంది. రుణం తీసుకునే ముందే అన్నింటినీ బేరీజు వేసుకుని జాగ్రత్త వహించండి.

వ‌డ్డీ రేట్లు పెరిగితే ఈఎమ్ఐ పెరుగుతుందా?

ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్లు పెంచింద‌ని తెలియ‌గానే త‌మ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు పెరుగుతాయ‌ని రుణ‌గ్ర‌స్తులు అనుకుంటారు. అయితే దీనికి బ‌దులుగా బ్యాంకులు కాల‌ప‌రిమితిని పెంచుకోమ‌ని చెప్తాయి. అయితే కాల‌ప‌రిమితి ఎంత పెరిగితే అంత ఎక్కువ వ‌డ్డీ చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంద‌న్న విష‌యం గుర్తుంచుకోండి. చెల్లించేగ‌లిగేంత స్థోమ‌త ఉంటే ఎక్కువ ఈఎంఐ అయినా స‌రే త‌క్కువ కాల‌ప‌రిమితిలో ముగించేలా చూసుకోవాలి. గృహ రుణాల‌ను ఇత‌ర బ్యాంకుల‌కు మార్చుకోవాల‌నుకుంటే ప్ర‌స్తుతం ఉన్న బ్యాంకు కంటే వ‌డ్డీ రేట్ల‌లో చాలా తేడా ఉంటేనే ఈ నిర్ణ‌యం తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు