Financial planning: థర్డ్‌ వేవ్‌ భయాలు.. మీ దగ్గర ఆర్థిక ప్రణాళిక ఉందా?

కరోనా భయాలు ఇంకా తొలగిపోలేదు. మానవాళిని ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా వదిలి పోలేదు. ఇటీవల వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచదేశాలను మరోసారి కలవరపెడుతోంది.

Published : 16 Dec 2021 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా భయాలు ఇంకా తొలగిపోలేదు. మానవాళిని ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా వదిలి పోలేదు. ఇటీవల వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచదేశాలను మరోసారి కలవరపెడుతోంది. వ్యాప్తిలో వేగం ఉన్నా, ఆరోగ్యంపై పెద్దగా దుష్ఫ్రభావాలు చూపడం లేదనేది మాత్రం ఊరట కల్పించే అంశం. ఇప్పటికే దేశాన్ని రెండు వేవ్‌లు కుదిపేశాయి. ఒమిక్రాన్‌తో మూడో వేవ్‌ వచ్చే అవకాశమూ లేకపోలేదంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ థర్డ్‌వేవ్‌ వస్తే దాన్ని సమర్థంగా ఎదుర్కొనే ఆర్థిక ప్రణాళిక మన దగ్గర ఉండాల్సిందే. ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు మళ్లీ మొదలయ్యాయి. విమాన రాకపోకలు తగ్గాయి. విదేశీ ప్రయాణికులు వచ్చిన వారిపై నిఘా కొనసాగుతోంది. పరిస్థితులు మరింత దిగజారితే మరోసారి దేశంలో సైతం ఆంక్షలు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. గతంలో రెండుసార్లు సంభవించిన వేవ్‌ల వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి పరిస్థితులను చూసైనా మనం గుణపాఠాలు నేర్వాల్సిందే.

అత్యవసర నిధి ఉందా?: థర్డ్‌ వేవ్‌ వచ్చినా సమర్థంగా ఎదుర్కోవాలంటే మన దగ్గర అత్యవసర నిధి ఉండాలి. అంటే, కనీసం ఆరు నెలలకు సరిపడా నెలవారీ ఖర్చులకు సరిపడా మొత్తం మన దగ్గర ఉండాలి. ఇళ్లు గడవడానికి కావాల్సిన మొత్తం నుంచి ఈఎంఐలు, బీమా పాలసీలు, పిల్లల ఫీజులు వంటివి కూడా ఈ మొత్తంలో కలిపి ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ప్రస్తుతం ఎమర్జెన్సీ ఫండ్‌ లేకపోతే.. మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి కొంతమొత్తాన్ని మీరు దగ్గర అట్టిపెట్టుకోవాలి. ఆ మొత్తం సేవింగ్స్‌ అకౌంట్‌లో భద్రపరుచుకోవాలి.

చేతిలో కొంత: అత్యవసర నిధి విషయాన్ని పక్కనపెడితే నిత్యం ఓ నెలకు సరిపడా మొత్తమైనా చేతిలో ఉండడం మంచిదంటారు ఆర్థిక నిపుణులు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో చాలా ఆస్పత్రులు క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డులను కాదని నగదును డిమాండ్‌ చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏదైనా అత్యవసర సందర్భం ఏర్పడినప్పుడు అప్పటికప్పుడు నగదు కోసం ఏటీఎంకో, బ్యాంకులకో పరుగులు పెట్టేబదులు నగదు రూపంలో కొంతమొత్తం ఉంచుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.

రిస్క్‌ వద్దు: థర్డ్‌వేవ్‌ భయాల నేపథ్యంలో స్పెక్యులేషన్స్‌కు (ఊహాగానాలకు) దూరంగా ఉండడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఒకవేళ మీరు ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారు అయితే అమ్మకాలకు దిగడమో, కొనుగోళ్లు చేయడమో మంచిది కాదు. ఒకవేళ అలాంటి ప్రణాళికలు ఏవైనా ఉంటే మానుకోవడం ఉత్తమం. స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టే రిస్క్‌ చేయకపోవడం అన్నింటికన్నా ముఖ్యం. ఒకవేళ క్రమానుగత పెట్టుబడి పద్ధతిలో (సిప్‌) మదుపు చేస్తుంటే వాటిని యథావిధిగా కొనసాగించండి. 

ఆరోగ్య బీమా సంగతేంటి?: కొవిడ్‌ మహమ్మారి ఆరోగ్య బీమా అవసరాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేసేలా చేసింది. ఆరోగ్య బీమా లేనివారు ముఖ్యంగా సెకండ్‌వేవ్‌ సమయంలో అప్పుల పాలైన ఉదంతాలూ చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు ఆరోగ్య బీమా లేనివారు ఇప్పటికైనా తీసుకోవడం మంచిది. నగరాల్లో ఉండేవారు కనీసం 15-20 లక్షల వరకు బీమా కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే, జీవిత బీమా పాలసీ కూడా ఉండాలి. అప్పుడే కుటుంబానికి ఎంతోకొంత ఆర్థిక భద్రత కల్పించిన వారవుతారు.

ఖర్చులను తగ్గించుకోండి: కొవిడ్‌ వేళ అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈఎంఐలను తగ్గించుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డు వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువ వడ్డీ ఉన్న అప్పును తక్కువ వడ్డీ ఉన్న చోటకు మారిస్తే ఆ మేర వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. అలాగే, మీ దగ్గర విలాస వస్తువులకు సంబంధించి ఏవైనా కొనుగోలు ప్రణాళికలు ఉంటే వాటిని కొద్ది రోజులు వాయిదా వేయడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని