మూడింటికి ఒకే ఖాతా (3-ఇన్‌-1 అకౌంట్‌)

బ్యాంకింగ్‌తో పాటే పెట్టుబడులు, ట్రేడింగ్‌ గురించి వినియోగదారులకు అవగాహన పెరగడంతో నేటి రోజుల్లో ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాల అవసరం తప్పనిసరైంది. దేశంలో ప్రధాన బ్యాంకులన్నీ 3-ఇన్‌-1 అకౌంట్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీని ద్వారా ఒక్కచోట నుంచే షేర్ల కొనుగోలు, అమ్మకాలు చేయడానికి సులభంగా వీలవుతుంది. ఈ నేపథ్యంలో 3-ఇన్‌-1 అకౌంట్‌ గురించి వివరంగా తెలుసుకుందాం

Updated : 01 Jan 2021 19:46 IST

బ్యాంకింగ్‌తో పాటే పెట్టుబడులు, ట్రేడింగ్‌ గురించి వినియోగదారులకు అవగాహన పెరగడంతో నేటి రోజుల్లో ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాల అవసరం తప్పనిసరైంది. దేశంలో ప్రధాన బ్యాంకులన్నీ 3-ఇన్‌-1 అకౌంట్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీని ద్వారా ఒక్కచోట నుంచే షేర్ల కొనుగోలు, అమ్మకాలు చేయడానికి సులభంగా వీలవుతుంది. ఈ నేపథ్యంలో 3-ఇన్‌-1 అకౌంట్‌ గురించి వివరంగా తెలుసుకుందాం.

3-ఇన్‌-1 అకౌంట్‌లో ఉండే మూడు ఖాతాలు

  • బ్యాంకు ఖాతా(సాధారణ బ్యాంకు డిపాజిట్‌ ఖాతా లాంటిది)
  • ట్రేడింగ్‌ ఖాతా(షేర్లు, డిబెంచర్‌ల వంటి లావాదేవీలకు సంబంధించింది)
  • డీమ్యాట్‌ ఖాతా(పెట్టుబడులను ఒకచోట ఉంచుకునేందుకు సంబంధించింది)

షేర్లు, ఫండ్ల కొనుగోలు సమయంలో బ్యాంకు పొదుపు ఖాతా నుంచి ట్రేడింగ్‌ ఖాతాలోకి, అమ్మకం సమయంలో ట్రేడింగ్‌ ఖాతా నుంచి పొదుపు ఖాతాలోకి డబ్బు బదిలీ అవుతుంది. ఈ విధంగా జరిగేటప్పుడు డీమ్యాట్‌ ఖాతాలో షేర్లు జమ అవుతూ, ఖాతా నుంచి విత్‌ డ్రా అవుతూ ఉంటాయి. లావాదేవీలు, బదిలీలు జరుగుతున్నప్పుడు బ్యాంకు పొదుపు ఖాతాలో మిగిలి ఉన్న డబ్బును, సాధారణ బ్యాంకు ఖాతాలాగే ఉపయోగించవచ్చు. చాలా బ్యాంకులు డీమ్యాట్‌ ఖాతా తెరిచేందుకు, నిర్వహణకు మొదటి సంవత్సరం ఎటువంటి రుసుములు లేకుండా, రెండో ఏడాది నుంచి నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నాయి.

ఖాతా తెరిచే విధానం:

  • 3-ఇన్‌-1 ఖాతాను బ్యాంకుకు వెళ్లి అకౌంట్‌ ఓపెనింగ్‌ ఫారంను నింపడం ద్వారా తెరిచే వీలుంది.
  • బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో పేరు, ఫోన్‌ నంబరు, మెయిల్‌ ఐడీ, చిరునామా వంటి వివరాలు నింపి కూడా ఖాతాను తెరవచ్చు. ఏవైనా సందేహాలుంటే బ్యాంకు సేవా ప్రతినిధికి ఫోన్‌ చేయవచ్చు.

రుసుములు:

  • ఖాతా ప్రారంభ రుసుము(అకౌంట్‌ ఓపెనింగ్‌ ఛార్జీ): ఖాతా తెరిచేందుకు రూ. 400 నుంచి రూ. 900 వరకూ రుసుము ఉంటుంది.
  • వార్షిక నిర్వహణ రుసుము: రూ. 350 నుంచి రూ. 750 వరకూ వార్షిక నిర్వహణ రుసుమును బ్యాంకులు విధిస్తున్నాయి.
  • బ్రోకరేజీ రుసుము: ఈక్విటీ లావాదేవీలపై 0.49 శాతం నుంచి 0.55 శాతం వరకూ బ్రోకరేజీ రుసుములు ఉంటాయి.
  • ఇంట్రాడే పెట్టుబడిదారులకు: ఇన్‌ట్రాడేలో జరిగే లావాదేవీల విలువలో 0.05 శాతం వరకూ ఛార్జీ వసూలు చేస్తారు.
  • ఈక్విటీ ఫ్యూచర్స్‌ ఇన్వెస్టర్స్‌: లావాదేవీలపై 0.03 నుంచి 0.09 వరకూ రుసుము
  • ఈక్విటీ ఆప్షన్స్‌ ట్రేడర్స్‌: ఒక్కో లాట్‌కు కనిష్ఠంగా రూ. 50, గరిష్ఠంగా రూ. 100

3-ఇన్‌-1 అకౌంట్‌ ప్రయోజనాలు:

ఈ కింది వాటిలో పెట్టుబడులు పెట్టొచ్చు

  • ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్లు, బాండ్లు, ఈటీఎఫ్‌లు, డెరివేటివ్‌లు, నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు, కంపెనీల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు , మొదలైనవి…
  • పెట్టుబడి పెట్టాలనుకుంటున్న షేర్ల స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు విశ్లేషణలు తెలుసుకోవచ్చు.
  • బ్యాంకు శాఖకు వెళ్లి ట్రేడింగ్‌కు సంబంధించిన లావాదేవీలను చేయవచ్చు. ఫోన్‌ , ఆన్‌లైన్‌ ద్వారా కూడా లావాదేవీలు చేసే వీలుంది. కొన్ని బ్యాంకులు మొబైల్‌ ట్రేడింగ్‌ యాప్‌లను కూడా అందిస్తున్నాయి.
  • సంస్థాగతంగా నిపుణుల చేత లోతైన విశ్లేషణ చేయించి పెట్టుబడులకు సంబంధించిన సలహాలను బ్యాంకులు అందిస్తాయి. ట్రేడింగ్‌ వెబ్‌సైట్లలో ఇచ్చే కథనాలు పెట్టుబడి పెట్టేందుకు తీసుకునే నిర్ణయాల్లో ఉపకరించగలవు.
  • 3-ఇన్‌-1 అకౌంట్‌ ద్వారా డీమ్యాట్‌ ఖాతాను కనిష్ఠ నిర్వహణ రుసుములతో నిర్వహించుకోవచ్చు.
  • పొదుపు ఖాతాకు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటి సదుపాయాలు ఉన్నందువల్ల ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా అవసరం ఉండకవపోవచ్చు.
  • ఇంట్రాడే ట్రేడింగ్‌కు సంబంధించి నగదు బదిలీ ఎప్పటికప్పుడు జరుగుతుంది.
  • ట్రేడింగ్‌ మొత్తం ఒక క్లిక్‌ ద్వారానే జరిగిపోయేందుకు బ్యాంకులు అవకాశం కల్పిస్తాయి.
  • ఈ ఖాతా ఉన్న వారికి బ్యాంకులు అదనంగా బీమా, ఎన్‌పీఎస్‌, ట్యాక్స్‌ ప్లానింగ్‌ వంటి ఇతర ఆర్థికసేవలను ఉచితంగా లేదా కనీస రుసుముతో అందజేస్తున్నాయి.

3-ఇన్‌-1 ఖాతా వల్ల ఇబ్బందులు:

  • కొన్ని బ్యాంకులు 3-ఇన్‌-1 ఖాతా ద్వారా తెరిచిన పొదుపు ఖాతాకు కనీస నిల్వ నిబంధనలను అమలుచేస్తాయి. అలాంటప్పుడు నిబంధనల మేరకు కనీస నిల్వ లేకపోతే పెనాల్టీలను చెల్లించాల్సి ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని