Abhijit Banerjee: భారత ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు: అభిజిత్‌ బెనర్జీ

భారత్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ అన్నారు....

Published : 05 Dec 2021 13:10 IST

అహ్మదాబాద్‌: భారత్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా 2019 స్థాయి కంటే కిందే ఉందని తెలిపారు. ప్రజల చిన్న చిన్న ఆశలు సైతం క్రమంగా ఆవిరై పోతున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ పరిస్థితికి తాను ఎవరినీ బాధ్యుల్ని చేయాలనుకోవడం లేదన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విద్యార్థులు తమ గమ్యాల్ని ఎలా నిర్దేశించుకోవాలో ఈ సందర్భంగా బెనర్జీ విద్యార్థులకు హితబోధ చేశారు. కుటుంబం లేదా సమాజం నుంచి వచ్చే ఒత్తిడికి లోనుకావొద్దని సూచించారు. జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ దిశగా వెళ్లే ధైర్యం చేయాలని హితవు పలికారు. దిల్లీలోని జేఎన్‌యూలో చదువుకుంటున్న సమయంలో తాను 10 రోజులు తీహాడ్‌ జైలులో గడిపానని తెలిపారు. సరిగ్గా హార్వర్డ్‌కు వెళ్లాలనుకుంటున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. దీంతో చాలా మంది తన భవిష్యత్తు ముగిసిందని బెదిరించారని తెలిపారు. కానీ, అలా జరగలేదని పేర్కొన్నారు.

భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు సత్యజిత్‌ రే, శ్యామ్‌ బెనగళ్‌.. ఇద్దరూ ఎకనామిక్స్‌ పట్టభద్రులని అభిజిత్‌ బెనర్జీ గుర్తుచేశారు. కానీ, భిన్నమైన రంగంలోకి ప్రవేశించి రాణించారని తెలిపారు. అలా నచ్చిన పనిచేసేందుకు ధైర్యంగా ముందడుగు వేయాలని సూచించారు.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని