‘రోజుకు ₹20 కోట్లు మిగిలింది!’.. ఎయిరిండియా విక్రయంపై దీపమ్‌ కార్యదర్శి

అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా విమానయాన సంస్థ టాటాల పాలిట కామధేనువేమీ కాదని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత్‌ పాండే అన్నారు. కొత్త యజమానికి సంస్థను నడపడం అంత సులువేమీ కాదని చెప్పారు.

Published : 17 Oct 2021 17:20 IST

దిల్లీ: అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా విమానయాన సంస్థ టాటాల పాలిట కామధేనువేమీ కాదని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత్‌ పాండే అన్నారు. కొత్త యజమానికి సంస్థను నడపడం అంత సులువేమీ కాదని చెప్పారు. విమానాలను పునరుద్ధరించడానికి ఆ సంస్థ పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎయిరిండియాను కారు చౌకగా టాటాలకు కట్టబెట్టారన్న కాంగ్రెస్‌ పార్టీ విమర్శల నేపథ్యంలో దీపమ్‌ కార్యదర్శి ఈ విధంగా స్పందించారు.

‘‘ఎయిరిండియాను నడపడం అంత సులువేమీ కాదు. కొత్త యజమానికి (టాటా) ఉన్న ఏకైక ప్రయోజనం ఏంటంటే సంస్థకు ఏళ్లుగా ఉన్న అప్పులను వారు తీసుకోవడం లేదు. కేవలం వారు నిర్వహించగల అప్పులను మాత్రమే తీసుకుంటున్నారు. ఎయిరిండియా విక్రయం వల్ల పెద్దఎత్తున పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఆదా అయ్యింది. ఎయిరిండియాను నడపడానికి ప్రస్తుతం రోజుకు రూ.20 కోట్లు ప్రజల సొమ్మును చెల్లించాల్సి వస్తోంది’’ అని తుహిన్‌ కాంత్‌ పాండే అన్నారు.

ఎయిరిండియా విమానాలను పునరుద్ధరించాలంటే చాలా పెద్ద మొత్తంలో టాటాలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని తుహిన్‌ కాంత్‌ పాండే చెప్పారు. ఏడాది వరకు ఉద్యోగులను ముట్టుకోవడం సాధ్యపడదని, ఏడాది తర్వాతే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) ఇవ్వడం కుదురుతుందని చెప్పారు. వీలైనంత తొందరగా టాటాలకు ఎయిరిండియాను అప్పగిస్తామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని