వాహన భద్రతా ప్రమాణాలు తగ్గిస్తే సహించం

కొన్ని వాహన తయారీ సంస్థలు భారత్‌లో తక్కువ భద్రత ప్రమాణాలున్న కార్లు విక్రయిస్తున్నాయంటూ వచ్చిన నివేదికలపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది.

Published : 10 Feb 2021 01:35 IST

కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ కార్యదర్శి గిరిధర్‌

దిల్లీ: కొన్ని వాహన తయారీ సంస్థలు భారత్‌లో తక్కువ భద్రత ప్రమాణాలున్న కార్లు విక్రయిస్తున్నాయంటూ వచ్చిన నివేదికలపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ‘క్షమార్హం కాని’ ఇటువంటి పనులు ఆపేయాల్సిందిగా కోరింది. రోడ్లపై భద్రత మరింతగా పెంచేందుకు వాహన లొకేషన్‌ ట్రాకింగ్‌ పరికరాలు ఉపయోగించడంపై తయారీదార్ల సంఘం సియామ్‌ నిర్వహించిన సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమానే ప్రసంగించారు. కొన్ని సంస్థలు మాత్రమే వాహన భద్రతా రేటింగ్‌ సిస్టమ్‌ను.. అది కూడా హై- ఎండ్‌ మోడళ్లకే వినియోగిస్తున్నాయని ఆయన తెలిపారు. దేశీయంగా ఉత్తమ నాణ్యత, భద్రతా ప్రమాణాలున్న వాహనాలే విక్రయించాలని సూచించారు. కొన్ని సంస్థలు మాత్రం భారత్‌లో విక్రయించే వాహనాలకు కావాలనే భద్రతా ప్రమాణాలు తగ్గిస్తున్నాయని, ఇటువంటి విధానాలు తక్షణం నిలపాలని అన్నారు. వాహనాలకు భద్రతా రేటింగ్‌లు ఉంటే, వినియోగదారులకు తాము ఎలాంటి కారు కొనుగోలు చేస్తున్నాం.. అది సురక్షితమా కాదా అనే విషయంపై అవగాహన వస్తుందని తెలిపారు. ‘అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేసిన కొన్ని కార్ల మోడళ్లలో ఉన్న భద్రతా ప్రమాణాలు, భారత్‌లో విక్రయించిన అవే మోడల్‌ కార్లలో లేవని’ కొన్నేళ్లుగా గ్లోబల్‌ ఎన్‌సీఏపీ నిర్వహించిన పరీక్షల్లో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని