Updated : 01 Jan 2021 15:31 IST

ప్రయాణ బీమా తీసుకున్నారా?

ప్రయాణ సమయంలో మనకు లేదా మనతో ప్రయాణిస్తున్న కుటుంబసభ్యులకు ఏదైనా అత్యవసర వైద్య ఖర్చులకు, విమానం రద్దు అయిన‌ప్పుడు, ఇతర అవాంతరాలకు అయ్యే ఖర్చుల నుంచి ప్రయాణ బీమా మనల్ని ఆదుకుంటుంది. విదేశీ ప్రయాణాల్లో ఈ ఖర్చులు ఖరీదైన వ్యవహారంగా ఉండవచ్చు. ఒక్కోసారి ఆర్థికంగా సహాయం చేసేందుకు కూడా మన వాళ్లు ఎవరూ అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రయాణ బీమా కలిగి ఉంటే ఇలాంటి సమయాల్లో నిశ్చింతగా ప్రయాణించేందుకు భరోసా ఉంటుంది. స్వదేశీ, విదేశీ ప్రయాణాలకు వేర్వేరుగా లేదా రెండింటికీ కలిపి బీమా తీసుకోవచ్చు.

ప్రయాణ బీమా పరిధిలోకి వచ్చే అంశాలు :
ప్రయాణ బీమా తీసుకునేటప్పుడు అందులో ఏమేం అంశాలు ఉన్నాయో చూసి మనకు అవసరమైన వాటిని ఎంపిక చేసుకోవాలి. వివిధ రకాల అంశాలు బీమా పరిధిలోకి వస్తాయి.

వైద్య ఖర్చులు :

 • విదేశాల్లో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రయాణ బీమా మనల్ని ఆదుకుంటుంది. దీంట్లో వైద్యుని ఫీజు, అంబులెన్సు, రవాణా ఛార్జీలు, ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకునేందుకు, వైద్య పరీక్షలు, మందులకు అయ్యే ఖర్చులు చెల్లిస్తారు.

 • ఒక వేళ అనుకోని పరిస్థితుల్లో ప్రయాణికుడు మృతిచెందితే మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అయ్యే ఖర్చులు సైతం బీమా కంపెనీలు భరిస్తాయి.
  గమనిక : సాధారణంగా మనకు ఆరోగ్య బీమా ఉన్నా విదేశాల్లో అది వర్తించకపోవచ్చు. కాబట్టి ప్రయాణ బీమా తప్పనిసరి.

వ్యక్తిగత ప్రమాదాలు :
ప్రయాణంలో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించి గాయాలపాలైతే క్షతగాత్రులకు బీమా కంపెనీలు ఆర్థిక అవసరాలకు తోడ్పాటునిస్తాయి.

పాస్‌పోర్టు పోగొట్టుకుంటే :
ప్రయాణికులు అనుకోకుండా తమ ఒరిజినల్‌ పాస్‌పోర్టు పోగొట్టుకుంటే డూప్లికేట్‌ లేదా కొత్త పాస్‌పోర్టు పొందేందుకయ్యే ఖర్చును బీమా కంపెనీలే అందిస్తాయి.

లగేజీ పోగొట్టుకున్నప్పుడు :
ప్రయాణంలో ఉండగా మన లగేజీని పోగొట్టుకున్నా లేదా అపహరణకు గురైనా… విమానాశ్రయంలో లగేజీ పొరపాటుగా వేరే చోటికి తరలించినా, లగేజీ చేర్చడంలో ఆలస్యమైనా బీమా కంపెనీలు మన లగేజీ తిరిగి చేతికందేంత వరకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు లేదా మొత్తం వస్తువులు కొనుక్కునేందుకు అయ్యే ఖర్చులు చెల్లిస్తారు.
గమనిక : బంగారం, ఖరీదైన వస్తువులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలకు చెల్లించేదానికి పరిమితి ఉంటుంది. కొన్ని బీమా కంపెనీలు ఇలాంటి వాటిని బీమా పరిధిలోకి తీసుకురావు. పాలసీ ఎంచుకునే సమయంలో ఈ విషయాలను గమనించడం మంచిది.

ప్రయాణం రద్దవ్వడం :
మనకు లేదా మన కుటుంబసభ్యులకు ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నప్పుడు
లేదా రద్దు చేసుకున్నప్పుడు … విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యం అవ్వడం… అత్యవసర పరిస్థితుల్లో విమానం బయలుదేరే సమయానికి ఏదైనా అవాంతరాలెదురై విమానాశ్రయానికి చేరుకోలేకపోవడం… ఇలాంటి సందర్భాల్లో హోటల్‌లో బస చేసేందుకు, భోజన ఖర్చులకు, మళ్లీ టికెట్‌ తీసుకునేందుకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీలు అందజేస్తాయి.
గమనిక: విమానయాన సంస్థల కారణాల వల్ల ప్రయాణం రద్దయిన సందర్భంలో అయ్యే ఖర్చులను ఆ సంస్థలే భరిస్తాయి. ఈ వివరాలు ప్రయాణించే ముందు ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.

ఆర్థిక అత్యవసరాలు :

 • ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు డ‌బ్బు, కార్డులు ఉన్న‌ ప‌ర్సు పోయిన‌ప్పుడు లేదా హ‌ఠాత్తుగా కార్డు ప‌నిచేయ‌క‌పోయినా ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఇలాంటి సంద‌ర్బాల్లో బీమా కంపెనీ ఆస‌రాగా ఉంటుంది.

 • కొన్ని పాలసీల్లో ప్రయాణంలో ఉండగా స్వదేశంలో మన ఇంట్లో దొంగతనం జరిగితే, ప్రయాణ సమయంలో మన క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులు అపహరణకు గురై దుర్వినియోగం పాలైతే అందుకయ్యే పరిహారాన్ని బీమా కంపెనీలు చెల్లిస్తాయి.

పాలసీ పరిధిలోకి రాని అంశాలు:

 • ఆరోగ్య సమస్యలు ఉన్న సమయంలో వైద్యుల సూచనలకు వ్యతిరేకంగా ప్రయాణం చేయడం

 • ఇంతకుముందే ఉన్న ఆరోగ్య సమస్యలు… వాటి కారణంగా ప్రయాణంలో తలెత్తే ఇతర క్లిష్ట సమస్యలు.

 • ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం

 • యుద్ధం, ఉగ్రవాద చర్యలు

 • ప్రాణాంతకమైన క్రీడల్లో పాల్గొనడం

పై కారణాలకు సాధారణంగా ప్రయాణ బీమా వర్తించదు. అయితే ఈ అంశాలు పాలసీని బట్టి మారుతూ ఉంటాయి.

ప్రయాణ బీమా క్లెయిం చేసుకునేందుకు:
ప్ర‌యాణ బీమా క్లెయిం చేసే విధానం

పాలసీ రద్దయ్యే సందర్భాలు:
పాలసీ కొనే సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేయడం, కొన్ని వివరాలు దాచిపెట్టడం, ఫ్రాడ్‌, అంతర్జాతీయ నేరాలకు పాల్పడినప్పుడు బీమా కంపెనీలు పాలసీని రద్దు చేసే అవకాశం ఉంది.

ప్రయాణ అవసరాలు, వ్యక్తుల వయసు, వెళ్లే ప్రాంతం, అక్కడ ఉండబోయే కాలాన్ని బట్టి పాలసీ ఉంటుంది. అందుకనుగుణంగా ప్రీమియం, ఇతర షరతులు వర్తిస్తాయి.బీమా కంపెనీలు బీమాదారుల అవసరాలకు అనుగుణంగా (ఒకసారి ప్రయాణానికి, కుటుంబంతో సహా ప్రయాణించేటప్పుడు లేదా అనేక సార్లు ప్రయాణించేందుకు) వివిధ రకాల పాలసీలు అందిస్తున్నాయి. మన అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని