Twitter: ‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛపైనే మా ఆందోళన’ 

గత కొన్ని రోజులుగా భారత ప్రభుత్వంతో తరచూ వివాదాలు ఎదుర్కొంటున్న ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ట్విటర్‌.. కొత్త ఐటీ నియమ నిబంధనలపై ఎట్టకేలకు మౌనం వీడింది. కొత్త నిబంధనలను

Published : 27 May 2021 14:13 IST

ఐటీ నిబంధనలు పాటించేందుకు ప్రయత్నిస్తామన్న సంస్థ

దిల్లీ: గత కొన్ని రోజులుగా భారత ప్రభుత్వంతో తరచూ వివాదాలు ఎదుర్కొంటున్న ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ట్విటర్‌.. కొత్త ఐటీ నియమ నిబంధనలపై ఎట్టకేలకు మౌనం వీడింది. కొత్త నిబంధనలను పాటించేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. అయితే కొత్త విధానాలతో భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదముందంటూ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. 

‘‘భారత ప్రజల సేవలకు ట్విటర్‌ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. బహిరంగ చర్చల్లో మా వేదిక కీలక పాత్ర పోషిస్తుందని, మహమ్మారి సమయంలో మా మాధ్యమం ప్రజలకు అండగా ఉందనేది ఇప్పటికే రుజువైంది. అలాంటి మా సేవలను అందుబాటులో ఉంచడం కోసం భారత్‌లోని కొత్త చట్టాలను పాటించేందుకు ప్రయత్నిస్తాం. అయితే పారదర్శకత సూత్రాలను మాత్రం కచ్చితంగా కొనసాగిస్తాం. మా సేవల ద్వారా ప్రతి ఒక్కరి గళాన్ని వినిపించేందుకు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేందుకు కట్టుబడి ఉంటాం’’ అని ట్విటర్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదే సమయంలో కొత్త చట్టాల ద్వారా భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగే అవకాశముందని ట్విటర్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘గత కొంతకాలంగా భారత్‌లో మా ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనలు, మేం సేవలు అందిస్తున్న వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు కొత్త నిబంధనలు ముప్పు కలిగిస్తాయనే మా ఆందోళన. మా కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీసులతో బెదిరింపు చర్యలకు పాల్పడటం, ఇలాంటి చట్టాలు తీసుకురావడం బాధాకరం. సోషల్‌మీడియా వేదికల్లో స్వేచ్ఛాయుత బహిరంగ చర్చలకు భంగం వాటిల్లకుండా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మేం కోరాలనుకుంటున్నాం. దీనిపై భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజాప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వానిదే’’అని ట్విటర్‌ పేర్కొంది.

బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనలపై ట్విటర్‌ స్పందించడం ఇదే తొలిసారి. ఇటీవల ‘కాంగ్రెస్‌ టూల్‌కిట్‌’ వ్యవహారంలో ట్వటర్‌, కేంద్రం మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ టూల్‌కిట్‌ అంటూ భాజపా నేతలు చేసిన పోస్ట్‌లకు ట్విటర్‌ ‘నకిలీ మీడియా’ అనే ట్యాగ్‌కు జత చేయడం వివాదానికి కారణమైంది. దీనిపై ఆగ్రహించిన కేంద్రం.. ఆ ట్యాగ్‌ను తొలగించాలంటూ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది. మరోవైపు దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఇటీవల దిల్లీ పోలీసులు ట్విటర్‌ ఇండియా కార్యాలయానికి వెళ్లి మరీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని