Lakshmi Gold Bar : లండన్‌లో లక్ష్మీదేవితో కూడిన బంగారు నాణెం విడుదల!

యూకేలో బంగారు నాణేలు ముద్రించే రాయల్‌ మింట్‌.. లక్ష్మీదేవితో కూడిన నాణేన్ని విడుదల చేసింది....

Published : 28 Sep 2021 22:43 IST

దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన రాయల్‌ మింట్‌

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా భారతీయులు జరుపుకొనే దీపావళి పర్వదిన ప్రాముఖ్యతను గుర్తించిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగకు ప్రారంభంగా భావించే ధనత్రయోదశి రోజు హిందువులు బంగారం కొనే ఆచారాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని యూకేలో బంగారు నాణేలు ముద్రించే రాయల్‌ మింట్‌.. లక్ష్మీదేవితో కూడిన నాణేన్ని విడుదల చేసింది. ఒక హిందూ దేవతతో కూడిన నాణేన్ని రూపొందించడం ఇదే తొలిసారి. దీని విక్రయాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.

ఈ నాణేన్ని రాయల్‌ మింట్‌కు చెందిన ఎమ్మా నోబుల్‌ రూపొందించారు. హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా కచ్చితత్వంతో రూపొందించేందుకు ఆమె క్యాడ్రిఫ్‌లోని శ్రీ స్వామినారాయణ దేవాలయ సహాయం తీసుకున్నారు. ఇది 999.9 స్వచ్ఛత కలిగిన 20 గ్రాముల బంగారు నాణెం. దీని ధర 1,080 పౌండ్లు (దాదాపు రూ.లక్ష). నవంబరు 4న జరుపుకోబోయే దీపావళి సందర్భంగా స్వామినారాయణ దేవాలయంలో ఈ నాణేన్ని ఉంచి లక్ష్మీపూజ చేయనున్నట్లు రాయల్‌ మింట్‌ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో మింట్‌ అధికారులు కూడా పాల్గొనున్నట్లు వెల్లడించాయి. నాణేనికి ముందుభాగంలో కమలంపై నిలబడి ఉన్న లక్ష్మీదేవి రూపాన్ని ముద్రించారు. హిందూ సంస్కృతిలో లక్ష్మీదేవి ప్రాముఖ్యతను స్ఫూర్తిగా తీసుకొనే తాము నాణేన్ని ముద్రించామని మింట్‌ అధికారులు తెలిపారు. ఈ నాణేన్ని కొన్నవారికి ‘ఓం’ చిహ్నంతో ముద్రించిన ప్రత్యేక కవర్‌లో అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని