Global Task force: భారత్‌కు అండగా అమెరికా కంపెనీలు!

Taskforceగా ఏర్పడి సాయం చేసేందుకు సిద్ధమైన 40 దిగ్గజ సంస్థలు

Updated : 27 Apr 2021 12:31 IST

టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడిన 40 దిగ్గజ సంస్థలు

వాషింగ్టన్‌: కరోనా విలయానికి తల్లడిల్లుతున్న భారతావనికి అండగా నిలిచేందకు యావత్తు ప్రపంచం ముందుకు వస్తోంది. ఇప్పటికే పలు దేశాలు తమ సాయాన్ని ప్రకటించగా.. తాజాగా అమెరికాలోని వాణిజ్య వర్గాలు ఏకమయ్యాయి. అగ్రరాజ్యంలో పేరెన్నికగన్న దాదాపు 40 కంపెనీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఓ కార్యదళంగా (Task force) ఏర్పడి భారత్‌కు కావాల్సిన సహకారం అందించాలని నిర్ణయించాయి. ఈ క్రతువును ‘యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ (US-India Business Council of the US Chambers of Commerce), ‘యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరం అండ్‌ బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ (US-India Strategic and Partnership Forum and Business Roundtable)  వంటి వాణిజ్య సంఘాలు స్వయంగా పర్యవేక్షించనున్నాయి. సోమవారం ఈ మేరకు సమావేశం జరిగింది. రానున్న కొన్ని వారాల్లో దాదాపు 20 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను (Oxygen Concentrators) భారత్‌కు పంపాలని నిర్ణయించినట్లు డెలాయిట్‌ సీఈఓ పునీత్‌ రెంజెన్‌ తెలిపారు.

రానున్న రోజుల్లో కీలక వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌ సహా ఇతర కీలక సరఫరాలను భారత్‌ అందజేయనున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ వర్గాలు తెలిపాయి. ఓ దేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని రూపుమాపేందుకు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్‌ వర్గాలు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పడడం ఇదే తొలిసారని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ (Tony Blinken) అభిప్రాయపడ్డారు. సాధ్యమైన మార్గంలో వీలైనంత మేర భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని పునీత్‌ రెంజెన్‌ (Puneet Renjen) తెలిపారు. ఈ వారం మధ్యలో భారత్‌కు 1000 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు చేరనున్నట్లు వెల్లడించారు. మే 5 నాటికి ఆ సంఖ్య 11,000కి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం 25 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అవసరమైతే అంతకుమించే పంపుతామని హామీ ఇచ్చారు. తర్వాతి దశలో 10 లీటర్లు, 45 లీటర్ల ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర మానిటరింగ్‌ కిట్లు పంపుతామన్నారు.

తాజాగా ఏర్పడిన టాస్క్‌ఫోర్స్‌లో ఈ-కామర్స్‌, రిటైల్‌, ఫార్మా, టెక్‌, తయారీ రంగాల పరిశ్రమలు భాగస్వామ్యం అయ్యాయి. అమెరికాలోని భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధుతో ఈ టాస్క్‌ఫోర్స్‌ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఆయన ఇప్పటికే భారత్‌కు కావాల్సిన కీలక పరికరాల జాబితాను వారికి అందజేశారు. త్వరలోనే భారత్‌ ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతుందని టాస్క్‌ఫోర్స్‌ తరఫున పునీత్‌ రంజన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని