యూలిప్‌లు vs మ్యూచువ‌ల్ ఫండ్లు - ఏది మేలు?

ఈ ఏడాది కేంద్ర బ‌డ్జెట్ లో ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డుల్లో దీర్ఘ‌కాల మూల‌ధ‌న ఆదాయంపై ప‌న్ను పున‌:ప్రారంభిచ‌డం తెలిసిందే. దీంతో ఏడాది పైబ‌డిన ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై ప‌న్ను 10 శాతం ఉంటుంది.....

Updated : 02 Jan 2021 17:24 IST

ఈ ఏడాది కేంద్ర బ‌డ్జెట్ లో ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డుల్లో దీర్ఘ‌కాల మూల‌ధ‌న ఆదాయంపై ప‌న్ను పున‌:ప్రారంభిచ‌డం తెలిసిందే. దీంతో ఏడాది పైబ‌డిన ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై ప‌న్ను 10 శాతం ఉంటుంది. దీంతో మ‌దుప‌ర్ల‌లో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయాలా యూలిప్స్ లో చేయాలా అనే సందేహం నెల‌కొంద‌నే చెప్పాలి. ఈ క‌థ‌నంలో దీని గురించి వివ‌రంగా తెలుసుకుందాం. ప్రాథ‌మికంగా యూలిప్, మ్యూచువ‌ల్ అంటే ఏంటో చూద్దాం. 

యూనిట్ లింకెడ్ ఇన్సురెన్స్ పాల‌సీలు (యూలిప్)

జీవిత బీమాతో పాటు పెట్టుబడుల‌ను క‌లిపి ఉండే దాన్ని యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యూలిప్స్‌) అంటారు. యూలిప్స్‌ కోసం చెల్లించే ప్రీమియంను కొంత మొత్తం బీమా కోసం, ఛార్జీలను మినహాయించుకొని మిగతా సొమ్మును మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్ల పెట్టుబడులకు వినియోగిస్తారు.

మ్యూచువ‌ల్ ఫండ్

మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను వివిధ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేసి రాబ‌డి పొందే వాటిని మ్యూచువ‌ల్ ఫండ్లు అంటారు. ఇవి సంపూర్ణంగా పెట్టుబ‌డిని ఉద్దేశించిన‌వి. వీటికి బీమా అనుసంధానం ఉండ‌దు.

ఈ రెండింటి ఉన్న తేడాల గురించి తెలుసుకుందాం.

రాబ‌డి

యూలిప్ ప‌థ‌కాల్లో మ‌దుప‌ర్లు చెల్లించే ప్రీమియంలో కొంత భాగం బీమా ప్రీమియం చెల్లింపు అవుతుంది. కాబ‌ట్టి మ‌దుప‌రి చెల్లించే మొత్తం ప్రీమియం పెట్టుబడుల్లోకి వెళ్ల‌దు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోఅయితే బీమా ఉండ‌దు కానీ పెట్టుబ‌డిల్లోకి వెళ్తుంది. దీంతో రాబ‌డి కూడా యూలిప్ కంటే ఎక్కువ‌గానే వ‌స్తుంది. ప‌న్ను 10 శాతం వేసినా స‌రే యూలిప్‌ల కంటే మ్యూచువ‌ల్ ఫండ్లు ఆక‌ర్ష‌ణీయంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఛార్జీలు

యూలిప్ ప‌థ‌కాల్లో ప్రీమియం అలోకేష‌న్ ఛార్జీలు , మోర్టాలిటీ ఛార్జీలు, ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలు, పాల‌సీ నిర్వ‌హ‌ణ ఛార్జీలు స‌రెండ‌ర్ ఛార్జీలు, ఫండ్ స్విచ్ఛింగ్ ఛార్జీలు ఉంటాయి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఫండ్ నిర్వహ‌ణ ఛార్జీలు మాత్ర‌మే ఉంటాయి. అయితే వీటిలో ఉండే ఎక్జిట్ లోడ్ ఉంటుంది. నిర్ణీత కాలం కంటే ముందు
ఉప‌సంహ‌రిస్తే ఈ ఛార్జీలు ఉంటాయి.

లిక్విడిటీ

లిక్విడిటీ ప‌రంగా చూస్తే యూలిప్ ల కంటే మ్యూచువ‌ల్ ఫండ్లు ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఎప్పుడైనా యూనిట్ల‌ను విక్ర‌యించి నిధులు పొందే వీలుంటుంది. క్లోజ్ ఎండెడ్ ఫండ్ల‌కు కొంత కాల‌ప‌రిమితి ఉంటుంది. అయితేవీటిని ఎక్స్ఛేంజీ ద్వారా నేరుగా విక్ర‌యించ‌వ‌చ్చు. యూలిప్‌ల‌కు ప్ర‌స్తుతం ఐదేళ్ల లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంది.

ప‌న్నువిధానం

ప్ర‌స్తుతం ప‌న్నువిధానం ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో దీర్ఘ‌కాలానికి ఏడాది పైన వ‌చ్చే రాబ‌డికి 10 శాతం ప‌న్ను ఉంది. యూలిప్ ప‌థ‌కాల్లో సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ప‌న్ను మిన‌హాయింపు కోస‌మే అయితే దీని కంటే కూడా ఈఎల్ఎస్ఎస్ లో పెట్టుబ‌డి చేయ‌డం మంచిది. ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాలు యూలిప్ ల కంటే మేల‌ని చెప్పాలి. వీటికి 3 ఏళ్ల లాక్ ఇన్ కాల‌ప‌రిమితి ఉంది. ఇందులో కూడా బీమా ఉండ‌దు. కాబట్టి ఛార్జీలు మిన‌హా మ‌దుప‌ర్ల పెట్టుబ‌డి మొత్తం పెట్టుబ‌డి అవుతుంది.

యూలిప్స్ విక్ర‌యాలు ఎక్కువ‌గా జ‌ర‌గ‌డానికి కార‌ణం మ‌దుప‌ర్ల‌లో అవ‌గాహ‌న త‌క్కువ ఉండ‌టం అనే చెప్పాలి. ఎందుకంటే బీమా ఏజెంట్లు యూలిప్‌ల్లో బీమా, పెట్టుబ‌డి రెండూ ఒకే చోట పొందొచ్చ‌ని చెప్ప‌డం, దీనికి తోడుగా మ‌నీ బ్యాక్ లాంటి స‌దుపాయాలను ఇవ్వ‌టం మ‌దుప‌ర్లు ఎక్కువ‌గా వీటిని కొనుగోలు చేసే అవ‌కాశాలున్నాయి.

చివ‌ర‌గా

యూలిప్‌ల్లో పెట్టుబ‌డి పెట్టే బ‌దులు మ‌దుప‌ర్లు త‌మ‌కు అవ‌స‌ర‌మై హామీ మొత్తానికి ట‌ర్మ్ పాల‌సీని తీసుకోవాలి. త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌ను దృష్టిలో ఉంచుకుని మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని