Published : 19 Jan 2021 01:14 IST

కరోనాలోనూ చైనాలో ఆగని ప్రగతి

 2020 వృద్ధి రేటు 2.3%

బీజింగ్‌: కరోనా వైరస్‌కు గురయిన తొలి దేశంగానే కాకుండా, దాని నుంచి ప్రథమంగా కోలుకున్న దేశంగా కూడా చైనా గుర్తింపు పొందింది. ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక ప్రగతి ఈ మహమ్మారి కారణంగా మందగించగా ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా మాత్రం, ఇంతటి కష్టంలోనూ అభివృద్ధి సాధించింది. 2020లో 2.3 శాతం మేర వృద్ధి రేటు నమోదు చేసుకుంది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఇది సంతృప్తికరంగా కనిపించినా ఆ దేశ గణాంకాలతో పోల్చితే గత 45 ఏళ్లతో ఇదే కనిష్ఠ ప్రగతి. అయితే 100 ట్రిలియన్‌ యువాన్లు (సుమారు రూ.1100 లక్షల కోట్లు) స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) లక్ష్యాన్ని అధిగమించి, 101.56 ట్రిలియన్‌ యువాన్లను నమోదు చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా మొదటి మూడు నెలల పాటు 6.8 శాతం మేర తిరోగమనం కనిపించినా క్రమేణా పుంజుకుంది. ఉద్యోగాల కల్పనతో పాటు, సంక్షేమ చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణమని చైనా జాతీయ గణాంకాల సంస్థ తెలిపింది. కరోనా నిరోధక వైద్య సామగ్రిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కూడా లబ్ధి పొందింది. ఆర్థిక రంగం సాధారణ పరిస్థితులకు చేరుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  
టెస్లా పెట్టుబడులు నెదర్లాండ్స్‌ మీదుగా పన్నులు తగ్గించుకోవడానికే
టెస్లా మోటార్స్‌ భారత్‌లోకి అడుగుపెట్టడం ఖరారైంది. ఆ విషయాన్ని కంపెనీ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ధ్రువీకరించారు కూడా. అయితే ఆ కంపెనీ నేరుగా భారత్‌లో పెట్టుబడులు పెట్టడం లేదు. పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే నెదర్లాండ్స్‌ నుంచి భారత్‌కు పెట్టుబడులను మళ్లించనుంది. ‘టెస్లా మోటార్స్‌ అండ్‌ ఎనర్జీ ఇండియా’కు మాతృ సంస్థ ‘టెస్లా మోటార్స్‌ ఆమ్‌స్టర్‌డామ్‌’గా పత్రాలు సూచిస్తున్నాయి. ఇందువల్ల మూలధన లాభాలు, డివిడెండు చెల్లింపులపై పన్ను ప్రయోజనాలు టెస్లాకు దక్కుతాయని విశ్లేషకులు అంటున్నారు.
నెదర్లాండ్సే ఎందుకంటే..: 2017లో ఎమ్‌జీ మోటార్స్‌ కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టింది కానీ.. అది తన మాతృ సంస్థ సియాక్‌ మోటార్స్‌ ఉండే చైనా నుంచి పెట్టుబడులు పెట్టింది. కియా కూడా తన సొంత దేశమైన దక్షిణకొరియా నుంచి భారత్‌లో పెట్టుబడులు పెట్టింది. టెస్లా కంపెనీ కాలిఫోర్నియాలో నమోదై ఉండగా.. అనుబంధ సంస్థ టెస్లా మోటార్స్‌ నెదర్లాండ్స్‌లో ఉంది. పన్ను రేట్లు సానుకూలంగా ఉండడంతో పాటు.. మేధోపర హక్కుల(ఐపీ) రక్షణలో నెదర్లాండ్స్‌లో బలమైన చట్టాలుండడం వల్ల అమెరికా కంపెనీలు ఆ దేశాన్ని ఎంచుకుంటుంటాయి. మారిషస్‌, సింగపూర్‌లతో ఉన్న పన్ను ఒప్పందాల్లో భారత్‌ చేసిన సవరణల కారణంగా ఎఫ్‌డీఐ లావాదేవీల విషయంలో మూలధన పన్ను మినహాయింపులు లభించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. అదే నెదర్లాండ్స్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం..మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంది. డివిడెండు పన్ను రేట్లు కూడా నెదర్లాండ్స్‌ ద్వారా వచ్చే పెట్టుబడులపై తక్కువగా ఉంటాయని పన్ను విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే అటు నుంచి వస్తోందని సమాచారం.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని