కోకొల్ల‌లు మొబైల్ వ్యాలెట్ సేవ‌లు!

మొబైల్ వాలెట్ల జోరు ఊపందుకుంటున్న ఈ త‌రుణంలో వాటి అవ‌స‌రాలు, నిబంధ‌న‌లు, ఆఫ‌ర్ల గురించి తెలుసుకుందాం.

Published : 15 Dec 2020 16:41 IST

అన్ని వర్గాల వినియోగదారులను ప్రస్తుతం ఎక్కువగా ఆకర్షిస్తున్న పదం మొబైల్ వ్యాలెట్. విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఈ-కామర్స్ చెల్లింపులు అంటే ఇదివరకూ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే. మొబైల్ వాలెట్ల రాకతో అన్ని ఆర్ఠిక లావాదేవీలు ఒకచోట నుంచే చేసేలా కొత్త పద్దతులు వచ్చాయి.

మొబైల్ రీచార్జీ నుంచి మొదలుకొని విమాన ప్రయాణ టిక్కేట్ల వరకూ అయ్యే చెల్లింపులన్నీ నిమిషాల వ్యవధిలో మొబైల్ నుంచే సులభంగా చేయగలుగుతున్నారు.

మొబైల్ వ్యాలెట్ అందించే సేవలు

  • దేశంలో ఉండే అన్ని టెలికాం కంపెనీల మొబైల్ రీచార్జీ, పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లింపులను, డీటీహెచ్ రీచార్జీలను చేయవచ్చు. కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, బీమా ప్రీమియంల చెల్లింపులనూ చేసే వీలును కొన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి.

  • బస్సు, రైలు, విమాన టికెట్ చార్జీలను సైతం మొబైల్ వ్యాలెట్ ద్వారా చెల్లించవచ్చు.

  • ఇటీవల నవతరం ఎక్కువగా ఆసక్తి చూపుతున్న అంశం ఈ-కామర్స్. ఆన్‌లైన్ షాపింగ్‌లో కొన్న వస్తువులకూ మొబైల్ వ్యాలెట్ ద్వారా డబ్బు చెల్లిస్తున్నారు.

  • క్యాబ్ సేవలను వినియోగించుకున్నందుకు అయ్యే ఖర్చులను చెల్లించేందుకు మొబైల్ వ్యాలెట్
    వినియోగించుకోవచ్చు.

ఖాతా వినియోగం

ఏ మొబైల్ వ్యాలెట్ అయినా చెల్లింపుల కోసం వ్యక్తిగత గుర్తింపును రెండంచెల్లో తనిఖీ చేస్తుంది. మొదట లాగిన్ అయ్యేందుకు ఖాతా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తారు. లేదా ఫేస్‌బుక్ / జీమెయిల్ ద్వారా సైతం లాగిన్ అవ్వొచ్చు.

తదుపరి చెల్లింపులు జరిపేముందు రెండు మూడు రకాలుగా వ్యక్తిగత గుర్తింపును నిర్దారిస్తారు.

  • మొబైల్ ఓటీపీ ద్వారా

  • డెబిట్ కార్డు పిన్

  • 3డీ సెక్యూర్ పిన్ ద్వారా

అన్నీ చెల్లింపులనూ డెబిట్ కార్డు  లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే వీలుంటుంది.

వ్యాలెట్‌ నిబంధ‌న‌లు

  • ఆర్‌బీఐ సమయానుసారంగా విదించే నిబంధనలన్నీ మొబైల్ వ్యాలెట్ కంపెనీలకు వర్తిస్తాయి.

  • వ్యాలెట్‌లో రూ. 10 వేల వరకూ వ్యాలెట్‌లో నగదు కలిగి ఉండేందుకు వినియోగదారుడి మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ ఇవ్వడం తప్పనిసరి.

  • కొన్ని మొబైల్ వ్యాలెట్ కంపేనీలు పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్స్) నుంచి డబ్బు విత్ డ్రాయల్స్‌కు అనుమతి పొంది ఉండవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మ‌నం ప్ర‌ణాళిక వేసుకోవాలి.

  • గరిష్టంగా రూ. 10 వేల వరకూ చెల్లింపులు చేసేందుకు ఆర్‌బీఐ అంగీకరించింది.

  • ఒక్కో నెలలో గరిష్టంగా రూ. 50 వేల దాకా వాలెట్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు.

  • నగదు రూ. 10 వేలు దాటితే బ్యాంకు ఖాతాకు అనుసరించే కేవైసీ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

క్యాష్ బ్యాక్ ఆఫర్లు

  • ఈ క్రమంలో అందరికీ సుపరిచితమైన పదం “క్యాష్ బ్యాక్” అంటే మనం చేసే చెల్లింపులు ఆయా * మొబైల్ వ్యాలెట్ల ద్వారా జరిపితే బిల్లులో కొంత శాతాన్ని కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి. మొబైల్ వ్యాలెట్లు ఎక్కువగా గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం క్యాష‌బ్యాక్ ఆఫర్లు.

  • క్యాష్‌బ్యాక్ అనేది తిరిగి వస్తువులను కొనేందుకు, సేవలను వినియోగించుకున్నందుకు అయ్యే ఖర్చులను చెల్లించేందుకై ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని సాధారణ నగదుగా భావించరాదు.

గ‌ణ‌నీయంగా పెరిగిన వ్యాలెట్ల వినియోగం

స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరగడంతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా మొబైల్‌ తేలిగ్గా ఉప‌యోగించ‌గ‌ల‌ సాధనంగా మారడం వ‌ల్ల మొబైల్ వాలెట్ల వినియోగం క్ర‌మంగా పెర‌గ‌నున్న‌ది.  నిలకడగా పురోగమిస్తున్న ఇ-కామర్స్‌ సంస్థలు క్రమక్రమంగా తాము అందించే కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండానే ఆన్‌లైన్‌లో క్యాబ్‌లు బుక్‌ చేసుకోవడం, మీల్స్‌ ఆర్డర్‌ చేయడం, బ్యాంకు ఖాతా లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లోని బంధుమిత్రులకు నగదు బదిలీ వంటి కార్యకలాపాలన్నీ నిర్వహించుకునేలా సేవలు విస్తరించాయి. వీటి చెల్లింపుల‌న్నీ భ‌విష్య‌త్తులో మొబైల్ వ్యాలెట్ల ద్వారానే జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని