మా విలువలకు ఇది గుర్తింపు: రతన్‌టాటా

టాటాసన్స్‌ ఛైర్మన్‌ పదవి వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటా స్వాగతించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి

Published : 26 Mar 2021 15:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టాటాసన్స్‌ ఛైర్మన్‌ పదవి వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటా స్వాగతించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ తీర్పుతో గతంలో ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.

‘‘అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది గెలుపు ఓటములకు సంబంధించిన అంశం కాదు. నా కచ్చితత్వం, మా సంస్థ  నైతిక ప్రవృత్తిపై నిర్దాక్షిణ్యంగా జరిగిన దాడి. ఈ సమయంలో టాటా సంస్థ వాదనలు వాస్తవాలని ప్రస్తుత తీర్పు తెలియజేస్తోంది. అంతేకాదు, టాటాసన్స్‌ పాటించే విలువలు, నైతికతకు ఈ తీర్పు అద్దంపట్టింది. అవే మా సంస్థకు మార్గదర్శిలు. మన న్యాయవ్యవస్థలోని గొప్పతనాన్ని ఈ తీర్పు మరింత బలపరుస్తోంది’’ అని రతన్‌ టాటా ట్విటర్‌లో పేర్కొన్నారు.

2016లో సైరస్‌ మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగిస్తూ టాటాసన్స్‌ బోర్డు తీసుకొన్న నిర్ణయం చెల్లుబాటు కాదని 2019 డిసెంబర్‌ 18న ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు వెలువరించింది. మిస్త్రీని తిరిగి ఛైర్మన్‌గా నియమించాలని సూచించింది. దీంతో 2020 జనవరి 2వ తేదీన టాటాసన్స్‌ ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఆ తర్వాత రతన్‌ టాటా కూడా ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. అదేనెల 10వ తేదీన సుప్రీం కోర్టు ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై స్టే విధించింది. సెప్టెంబర్‌ 22న టాటాసన్స్‌లో షేర్లను షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఎక్కడా తాకట్టు పెట్టకుండా న్యాయస్థానం అడ్డుకొంది. గతేడాది డిసెంబర్‌8న తుది వాదనలను విన్నది. అదే నెల 17న తీర్పును రిజర్వులో పెట్టింది. నేడు టాటాసన్స్‌ వాదనలను బలపరుస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు