Vodafone Idea: వొడాఫోన్‌-ఐడియాలో ప్రభుత్వానికి మెజారిటీ వాటాలు.. 10 కీలక పాయింట్లు!

ప్రముఖ దేశీయ టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌-ఐడియా మంగళవారం కీలక ప్రకటక చేసింది. తమ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వడ్డీ బకాయిలను ఈక్విటీలుగా మార్చుతున్నట్లు వెల్లడించింది....

Updated : 11 Jan 2022 14:45 IST

వడ్డీ బకాయిలను ఈక్విటీలుగా మార్చిన సంస్థ

దిల్లీ: ప్రముఖ దేశీయ టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌-ఐడియా మంగళవారం కీలక ప్రకటక చేసింది. తమ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వడ్డీ బకాయిలను ఈక్విటీలుగా మార్చుతున్నట్లు వెల్లడించింది. దీనికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. సెక్ట్రం కేటాయింపుల చెల్లింపులతో పాటు ఇతర పద్దుల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన వడ్డీ బకాయిలను 35.8 శాతం ఈక్విటీ వాటాలుగా మార్చుతున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియకు ఇంకా ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది.

  1. బకాయిలను ఈక్విటీలుగా మార్చడంతో వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా అవతరించనుంది.
  2. కంపెనీలో ప్రమోటర్ షేర్‌ హోల్డర్లయిన వొడాఫోన్‌ గ్రూప్‌నకు 28.5 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూపునకు 17.8 శాతం వాటాలు దక్కనున్నాయి.
  3. కంపెనీ అంచనాల ప్రకారం.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.16,000 కోట్లు.
  4. ప్రభుత్వానికి ఒక్కో షేరును రూ.10 వద్ద కేటాయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
  5. వివిధ పద్దుల కింద ఇప్పటికే ప్రభుత్వానికి కంపెనీ రూ.7,854 కోట్లు చెల్లించింది. ఇంకా రూ.50,000 కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా.
  6. తాజా ప్రకటకతో కంపెనీ షేర్లు ఈరోజు ఓ దశలో 19 శాతం కుంగి బీఎస్‌ఈలో రూ.12.05 వద్ద కనిష్ఠానికి చేరాయి.
  7. సెప్టెంబరు 30, 2021 నాటికి కంపెనీకి మొత్తం రూ.1.95 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు తేలింది. దీంట్లో ప్రభుత్వానికి స్పెక్ట్రం కేటాయింపుల కింద రూ.1.09 లక్షల కోట్లు, ఏజీఆర్‌ బకాయిల కింద రూ.63,400 కోట్లు చెల్లించాల్సిందిగా అంచనా వేశారు. మరో రూ.22,770 కోట్లు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సి ఉంది.  
  8. బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీకి చెందిన జియో రంగ ప్రవేశంతో భారత టెలికాం రంగం రూపురేఖలు మారిన విషయం తెలిసిందే. అనేక కంపెనీలు మార్కెట్‌ నుంచి కనుమరుగయ్యాయి. 
  9. మరోవైపు స్పెక్ట్రం కేటాయింపులు, ఏజీఆర్‌ ఛార్జీలకు సంబంధించిన బకాయిలతో ఈ రంగం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 
  10. జియో తర్వాతి స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌ ఈ మధ్యే కాస్త నిలదొక్కుకుంటోంది. తొలుత ఈ కంపెనీ కూడా స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించిన బకాయిలను ఈక్విటీలుగా మార్చనున్నట్లు ప్రకటించింది. అయితే, ఇటీవల కేంద్రం టెలికాం రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించడం, 5జీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో భవిష్యత్తుపై సానుకూల అంచనాలతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని