
Vodafone Idea: ఫోన్ బిల్లుల మోత.. ఎయిర్‌టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా
దిల్లీ: దేశీయ మొబైల్ వినియోగదారుల ఫోన్ బిల్లులపై మోత మోగుతోంది. టెలికాం కంపెనీల ఛార్జీల వాతతో కస్టమర్లపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే వివిధ ప్రీపెయిడ్ పథకాలపై ఎయిర్‌టెల్ టారిఫ్‌లను పెంచగా.. తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో పయనించింది. కాల్, డేటా పథకాలపై టారిఫ్‌లను 20-25శాతం పెంచుతున్నట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. పెంచిన రేట్లు నవంబరు 25 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
ప్రారంభ స్థాయి ప్లాన్‌ల ధరలను 25శాతం పెంచగా.. లిమిటెడ్ కేటగిరీ ప్లాన్‌ల ధరలను 20-23శాతం పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. పరిశ్రమ ఎదుర్కొంటోన్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో వినియోగదారుపై సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తాజా మార్పులతో వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇలా ఉండనున్నాయి..
* ప్రస్తుతం 28 రోజుల గడువుతో రూ.79గా ఉన్న కనీస వాయిస్ ప్లాన్ ఇకపై రూ.99 కానుంది.
* రూ.149 రీఛార్జ్ ప్లాన్ ఇకపై రూ.179గా ఉండనుంది.
* 28 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా అందించే రూ.219 ప్లాన్‌ను రూ.269కి పెంచారు.
* 84 రోజుల గడువుతో రోజుకు రూ.1.5జీబీ అందించే రూ.599 డేటా ప్లాన్ ఇకపై రూ.719 కానుంది.
* 365 రోజుల గడువుతో రూ.2,399 డేటా ప్లాన్‌ను రూ.2,899కి పెంచారు.
* డేటా టాప్‌అప్స్‌ను రూ.48 నుంచి రూ.58కి, రూ.98 నుంచి రూ.118కి, రూ.251 నుంచి రూ.298కి, రూ.351ని రూ.418కి పెంచారు.
ఇవీ చదవండి
Advertisement