పెట్టుబడిదార్లతో వొడాఫోన్‌ ఐడియా చర్చలు

నగదు సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) తగిన సామర్థ్యం కలిగిన పెట్టుబడిదార్ల కోసం అన్వేషిస్తోంది.

Updated : 03 Jul 2021 01:42 IST

దిల్లీ: నగదు సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) తగిన సామర్థ్యం కలిగిన పెట్టుబడిదార్ల కోసం అన్వేషిస్తోంది. కొందరు పెట్టుబడిదార్లతో చురుగ్గా చర్చలు సాగిస్తున్నట్లు తెలిపింది. స్పెక్ట్రమ్‌ వాయిదా చెల్లింపుపై మారటోరియం కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వీఐఎల్‌ ధ్రువీకరించింది. ప్రస్తుతం దేశీయంగా టెలికాం టారిఫ్‌లు బాగా తక్కువగా ఉన్నాయని, ఈ సమస్యల నుంచి బయట పడేందుకు ‘ఫ్లోర్‌ ధర’ అమలు చేయడమే మార్గమని తెలిపింది. టెలికాం రంగం కోలుకునేందుకు టారిఫ్‌లు పెంచడం అత్యవసరం అని కంపెనీ వివరించింది. త్రైమాసిక ఫలితాల ప్రకటన తరవాత అనలిస్ట్‌ కాల్‌లో కంపెనీ సీఈఓ రవీందర్‌ టక్కర్‌ మాట్లాడుతూ నిధుల సమీకరణ కోసం ప్రస్తుతం సత్తా గల పెట్టుబడిదార్లతో చర్చలు సాగిస్తున్నట్లు తెలిపారు.  నిధుల సమీకరణకు ఎంత సమయం తీసుకుంటారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. నిధులు సమీకరించలేకపోతే మరో ప్రణాళిక కూడా ఉందని, అయితే అది అమలు చేయాల్సిన అవసరం రాదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2021 మార్చి త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా రూ.7,023 కోట్ల ఏకీకృత నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

డీమార్ట్‌ ఆదాయం రూ.5,032 కోట్లు

దిల్లీ: రిటైల్‌ చైన్‌ డీమార్ట్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ జూన్‌ త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.5,031.75 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ నమోదు చేసిన కార్యకలాపాల ఆదాయం రూ.3,833.23 కోట్లతో పోలిస్తే ఇది 31.3 శాతం ఎక్కువ. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 238కి చేరింది. ఈ నెల 10న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు, 2021 జూన్‌ త్రైమాసిక అన్‌-ఆడిటెడ్‌ స్టాండలోన్‌, ఏకీకృత ఆర్థిక ఫలితాలను బోర్డు పరిశీలించి ఆమోదిస్తుందని కంపెనీ తెలిపింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో 0.29 శాతం పెరిగి రూ.3,324 వద్ద ముగిసింది.

సిగ్నిటీ కార్యాలయం సింగపూర్‌లో

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన సిగ్నిటీ టెక్నాలజీస్‌ సింగపూర్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. దీనివల్ల ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల్లో సేవలను అందించడం మరింత సులభమవుతుందని కంపెనీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని