ఫోక్స్‌వ్యాగన్‌ ఎస్‌యూవీ టి-రాక్‌ బుకింగ్‌లు ప్రారంభం

జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌ ఎస్‌యూవీ మోడల్‌ టి-రాక్‌ బుకింగ్‌లను భారత్‌లో ప్రారంభించింది. దీని ధర రూ.21.35 లక్షలు...

Published : 01 Apr 2021 01:10 IST

ధర రూ.21.35 లక్షలు

దిల్లీ: జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌ ఎస్‌యూవీ మోడల్‌ టి-రాక్‌ బుకింగ్‌లను భారత్‌లో ప్రారంభించింది. దీని ధర రూ.21.35 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. మే నుంచి ముందస్తు బుకింగ్‌ చేసుకున్న వినియోగదారులకు డెలివరీలు ప్రారంభిస్తామని ఫోక్స్‌వ్యాగన్‌ పాసింజర్‌ కార్స్‌ ఇండియా వెల్లడించింది. ఫోక్స్‌వ్యాగన్‌ ఈ ఏడాది నాలుగు ఎస్‌యూవీ మోడళ్లు టైగన్‌, న్యూ టిగువాన్‌, టిగువాన్‌ ఆల్‌స్పేస్‌, టి-రాక్‌లను భారత్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నాలుగు మోడళ్లను కంపెనీ ఎంక్యూబీ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించింది. కంపెనీ ఆన్‌లైన్‌ రిటైల్‌ ప్లాట్‌ఫామ్‌ లేదా దేశవ్యాప్తంగా ఉన్న విక్రయశాలల్లో టి-రాక్‌ను బుక్‌ చేసుకోవచ్చని ఫోక్స్‌వ్యాగన్‌ పాసింజర్‌ కార్స్‌ ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ ఆశిష్‌ గుప్తా తెలిపారు. ఫోక్స్‌వ్యాగన్‌ టైగన్‌, న్యూ టిగువాన్‌ మోడళ్లకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. టి-రాక్‌లో 1.5 లీటర్‌ టీఎస్‌ఐ ఇంజిన్‌, 7స్పీడ్‌ డీఎస్‌జీ ట్రాన్స్‌మిషన్‌, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌, ఈఎస్‌సీ, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ వ్యవస్థ, రివర్స్‌ కెమేరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

రూ.22-25 లక్షల కోట్లకు భారత ఐటీ రంగం
2025 కల్లా సాధ్యం: నాస్‌కామ్‌

దిల్లీ: వచ్చే అయిదేళ్లలో భారత ఐటీ రంగం 2-4 శాతం మేర వృద్ధి చెంది 300-350 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.22-25 లక్షల కోట్లు) మేర వార్షిక ఆదాయానికి చేరవచ్చని నాస్‌కామ్‌ అంచనా వేస్తోంది. క్లౌడ్‌, కృత్రిమ మేధ, సైబర్‌ భద్రత ఇతరత్రా వర్థమాన సాంకేతికతలు ఇందుకు దోహదం చేయవచ్చని మెకిన్సే అండ్‌ కంపెనీ నాలెడ్జ్‌ పార్టనర్స్‌తో కలిసి ఆ పారిశ్రామిక సంఘం రూపొందించిన నివేదిక చెబుతోంది.
మారుతున్న వినియోగదార్ల అవసరాల మేరకు కంపెనీలు నిరంతరం వినూత్నతను ప్రదర్శించాల్సి వస్తోంది. దీని వల్ల ఐటీ సేవల్లో ఏటా 10 శాతం మేర వార్షిక వృద్ధి నమోదైంది. దీంతో గత దశాబ్ద కాలంలో వాటాదార్లకు, పెట్టుబడుదార్లకు ఐటీ సేవలం రంగం అధిక ప్రతిఫలాలను ఇచ్చింది. దాదాపు లక్ష కోట్ల డాలర్ల విలువ ఉన్న ఐటీ రంగం ఇపుడు ప్రపంచ వ్యాప్త ఆర్థిక వృద్ధికి ముఖ్యంగా భారత్‌లో 44 లక్షల మందికి చేయూతనిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే అయిదేళ్లలో 2-4 శాతం మేర వృద్ధితో ముందుకు సాగుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఆరోగ్య సంరక్షణ, పాలన వివిధ రంగాలు భారత డిజిటల్‌ కలకు చుక్కానిలా మారి మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఐటీ రంగం 8 శాతం మేర వాటాను అందించగలదని అంచనా కట్టింది.

యాంగోన్‌ ప్రాజెక్ట్‌ పోటీ పడి దక్కించుకున్నాం: అదానీ

దిల్లీ: మయన్మార్‌లో గత ఏడాది దక్కించుకున్న యాంగోన్‌ అంతర్జాతీయ కంటైనర్‌ టెర్మినల్‌ ప్రాజెక్టును అంతర్జాతీయంగా పోటీ పడి బిడ్‌ దాఖలు చేసి దక్కించుకున్నామని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు. మయన్మార్‌ మిలిటరీ నియంత్రణలో ఉన్న సంస్థకు 30 మిలియన్‌ డాలర్లు చెల్లించి ఆ ప్రాజెక్టును దక్కించుకున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పష్టతనిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని