Published : 04 May 2021 01:32 IST

వోల్వో కారు ధరలు రూ.2 లక్షల వరకు ప్రియం

దిల్లీ: పలు మోడళ్ల ధరలను రూ.2 లక్షల వరకు పెంచుతున్నట్లు వోల్వో కార్‌ ఇండియా ప్రకటించింది. పెరిగిన ముడి వస్తువుల వ్యయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, తక్షణమే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. కంపెనీ లగ్జరీ సెడాన్‌ ఎస్‌90, ప్రీమియం ఎస్‌యూవీలు ఎక్స్‌సీ40, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ90 ఎక్స్‌-షోరూమ్‌ ధరలను రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెంచింది. కొత్త ధరల ప్రకారం.. ఎస్‌90 డీ4 ఇన్‌స్క్రిప్షన్‌ ధర రూ.60.9 లక్షలుగా, ఎక్స్‌సీ40 టీ4 ఆర్‌ డిజైన్‌ రూ.41.25 లక్షలు, ఎక్స్‌సీ60 డీ5 ఇన్‌స్క్రిప్షన్‌ రూ.60.9 లక్షలు, ఎక్స్‌సీ90 డీ5 ఇన్‌స్క్రిప్షన్‌ ధర రూ.88.9 లక్షలుగా ఉన్నాయి. కొత్తగా విడుదల చేసిన కాంపాక్ట్‌ లగ్జరీ సెడాన్‌ ఎస్‌60 ధరలో మార్పు చేయలేదు.

ఎగుమతుల్లో వృద్ధి కొనసాగొచ్చు
ఫియో అధ్యక్షుడు

దిల్లీ: భారత దేశ ఎగుమతుల్లో వృద్ధి కొనసాగవచ్చని ఎగుమతిదార్లు అంచనా వేస్తున్నారు. ఆర్డర్లు ప్రోత్సాహకరంగా ఉండడానికి తోడు, ధనిక మార్కెట్లలో గిరాకీ పుంజుకుంటుండడం కలిసిరావొచ్చని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఫియో) అధ్యక్షుడు ఎస్‌.కె. సరాఫ్‌ పేర్కొన్నారు. చాలా వరకు రాష్ట్రాల్లో తయారీ, ఎగుమతి సంబంధిత సేవలకు అంతర్‌ రాష్ట్ర రవాణా షరతుల నుంచి మినహాయింపునిచ్చారని అన్నారు. అయితే కరోనా సృష్టిస్తున్న ఇబ్బందుల రీత్యా చాలా వరకు సంస్థలు పూర్తి మానవ వనరులతో కార్యకలాపాలు నిర్వహించలేకపోతున్నాయన్నారు. ‘మే మధ్య తర్వాత పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నాం. ఎగుమతిదార్లు ఈ సారి లాక్‌డౌన్‌ పరిస్థితులకు తగ్గట్లుగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నార’ని ఆయన వివరించారు. ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను నిలిపేయరాదని, అది వలస కార్మికులపై ప్రభావం చూపుతుందని హ్యాండ్‌ టూల్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.సి. రాహన్‌ అంటున్నారు. మరో వైపు, జౌళి, కార్పెట్‌, చేతివృత్తులు, తోళ్ల వంటి కార్మికులపై ఆధారపడే రంగాల్లో మెరుగైన ఎగుమతులు నమోదు కావడం వల్లే ఏప్రిల్‌లో ఎగుమతులు మూడింతలై 30.21 బి. డాలర్లకు చేరుకున్నాయని భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి(టీపీసీఐ) అభిప్రాయపడింది. అన్ని రంగాల్లో సమతుల వృద్ధికి ఏప్రిల్‌ గణాంకాలు నిదర్శనమని పేర్కొంది.

భారత్‌లో పరిస్థితి బాధాకరం

భారత్‌లో పరిస్థితులు చూస్తుంటే హృదయం ద్రవించిపోతోంది. ప్రపంచమంతా ఇపుడు భారత్‌నే గమనిస్తోంది. దేశాలు, కంపెనీలు తమ వనరులతో ఇపుడు దేశానికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. యార్సెలర్‌ మిత్తల్‌ కూడా అందుకు కట్టుబడి ఉంది. భారత్‌కు మా కంపెనీ ఆక్సిజన్‌ పంపిస్తోంది. గుజరాత్‌ ప్రభుత్వం భాగస్వామ్యంతో 250 పడకల ఆసుపత్రి తెరచాం. దీనిని 1000 పడకలకు విస్తరిస్తాం. పరిస్థితులన్నిటినీ ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. మాకు చేతనైనంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

- యార్సెలర్‌ మిత్తల్‌ సీఈఓ ఆదిత్య మిత్తల్‌

మోయివింగ్‌తో వెలెక్ట్రిక్‌ జట్టు

దిల్లీ: లాజిస్టిక్స్‌ రంగంలో విద్యుత్‌ వాహనాలను పెంచేందుకు పని చేస్తున్న అంకుర సంస్థ మోయివింగ్‌తో జట్టు కట్టినట్లు విద్యుత్‌ ద్విచక్ర వాహన అంకుర సంస్థ వెలెక్ట్రిక్‌ వెల్లడించింది. ఈ భాగస్వామ్యం కింద వెలెక్ట్రిక్‌ 1,000 విద్యుత్‌ ద్విచక్రవాహనాలను లీజు పద్ధతిన అందించి మెయింటెనెన్స్‌ మద్దతు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. తొలుత బెంగళూరులో 60 వాహనాలను మోయివింగ్‌కు అందించి, వచ్చే కొన్ని త్రైమాసికాల్లో అన్ని ప్రధాన నగరాల్లో 1,000కి పైగా ద్విచక్ర వాహనాలను సమకూరుస్తామని వెలక్ట్రిక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ వికాస్‌ జైన్‌ వెల్లడించారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని