MutualFunds: ₹ కోటి స‌మ‌కూర్చుకోవాలా? 15-15-15 రూల్ ఫాలో అవ్వండి..

ఏమిటీ 15-15-15 రూల్‌..? కోటి సంపాదించడంలో ఏవిధంగా సహాయపడుతుంది?

Updated : 20 Nov 2021 12:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంప‌ద సృష్టి అనేది చిన్నపాటి ర‌న్నింగ్ రేస్‌ కాదు. అదో మారథాన్‌. విజ‌యం సాధించాలంటే కొన్ని టెక్నిక్స్‌ అనుస‌రిస్తూ దీర్ఘకాలం పాటు ఎక్కువ దూరం ప‌రుగు తీయాల్సి ఉంటుంది. ఆర్థిక స్వేచ్ఛను సాధించేందుకు, సౌకర్యవంతమైన ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితం కోసం కావాల్సిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకునేందుకు ఎలాంటి షార్ట్‌క‌ట్స్ ఉండ‌వు. అయితే, కొన్ని రూల్స్ పాటించ‌డం ద్వారా భ‌విష్యత్‌ అవసరాల కోసం, సౌకర్యవంతమైన జీవితం కోసం సంప‌దను సృష్టించుకోవ‌చ్చు. అలాంటి నియమాల్లో 15-15-15 రూల్‌ ఒకటి. మ్యూచువ‌ల్ ఫండ్లలో సిప్‌ ద్వారా పెట్టుబ‌డి పెట్టేవారు రూ.కోటి సంప‌ద‌ను, 15 సంవ‌త్సరాల్లో కాంపౌండ్ వ‌డ్డీతో కూడ‌బెట్టడంలో ఇది సహాయపడుతుంది. అందుకు ప్రతి నెలా ఎంతమొత్తం పొదుపుచేయాలి? వృద్ధి అంచనాతో ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనేది ఇది తెలుపుతుంది. స్టాక్ మార్కెట్లు స్వభావరీత్యా చూస్తే.. స్వల్పకాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. దీర్ఘకాలంలో మాత్రం దూసుకెళుతుంటాయి. గ‌త రికార్డుల‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం స్పష్టం అవుతుంది. ఏటా దాదాపు 15 శాతం రాబడిని పొందడం ఈక్విటీ మార్కెట్‌లో సాధ్యం కాకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో దాదాపు 15 శాతం వార్షిక రాబడిని సాధించడం సాధ్యమే.

ఏమిటీ 15-15-15 రూల్‌?
ఈ రూల్‌లో ‘15’ను మూడు సార్లు ఉప‌యోగిస్తున్నాం. ఇది వృద్ధి రేటు, కాల‌వ్యవధి, నెలవారీ మనం చేయాల్సిన పొద‌పు మొత్తాన్ని సూచిస్తుంది. 15 శాతం రాబ‌డి అంచ‌నాతో 15 సంవ‌త్సరాల్లో (180 నెల‌లు) రూ.1 కోటి స‌మ‌కూర్చుకునేందుకు ప్రతి నెలా రూ.15000 ఆదా చేయాల్సి ఉంటుంది. మ‌రోవిధంగా చెప్పాలంటే.. ప్రతి నెలా మీరు రూ.15000 పెట్టుబ‌డి పెట్టగలిగితే.. 15 సంవత్సరాల్లో 15 శాతం రాబ‌డి అంచ‌నాతో కోటి రూపాయ‌ల ల‌క్ష్యాన్ని సాధించ‌గ‌లుగుతారు. 

* కావ‌ల‌సిన సంప‌ద‌: రూ. 1కోటి
* 15 సంవత్సరాల్లో మీరు మదుపు చేసే మొత్తం: రూ.27,00,000
* రాబ‌డి (15 శాతం వార్షిక అంచ‌నాతో): రూ.74,52,946.
మొత్తం: రూ.1,01,52,946

ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం దీర్ఘకాలం పాటు పొదుపు చేసేందుకు ఈ నియ‌మం పనికొస్తుంది. కావాలంటే మీరు 12 శాతం వార్షిక రాబ‌డి అంచ‌నాను కూడా తీసుకోవ‌చ్చు. అయితే పెద్ద మొత్తంలో కార్పస్‌ ఏర్పాటు చేసేందుకు సిప్‌-స్టెప్‌-అప్ విధానాన్ని అనుస‌రించాల్సి ఉంటుంది. అంటే 12 శాతం సగటు రాబడి ప్రకారం, రూ.15 వేలతో సిప్  ప్రారంభించి ఏటా 7 శాతం చొప్పున పెంచుతూ వెళితే 15 ఏళ్లకు రూ.కోటి సమకూర్చుకోవచ్చు. ఒక ల‌క్ష్యం కోసం మ‌దుపు చేసేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని కావలిసిన మొత్తాన్ని లెక్కించాలి. దాని ప్రకారమే మదుపు చేయడం ప్రారంభించాలి. 15-15-15 రూల్ అనుస‌రించ‌డం ద్వారా పొదుపు అల‌వాటును పెంచుకుంటారు. అయితే, సిప్‌తో పాటు మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండడం వల్ల అధిక యూనిట్స్ సమకూర్చుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని