ఆ 10 మంది సంపదతో దేశంలోని పిల్లలందరినీ 25 ఏళ్లు చదివించొచ్చు!

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయని పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదిక మరోసారి స్పష్టం చేసింది....

Updated : 17 Jan 2022 15:07 IST

భారత్‌లో ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్‌ నివేదిక

దిల్లీ: భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయని పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదిక స్పష్టం చేసింది. కొవిడ్‌ మహమ్మారి ఈ దుస్థితికి మరింత ఆజ్యం పోసినట్లు తెలిపింది. భారత్‌లో 2020తో పోలిస్తే 2021లో భారత బిలియనీర్ల సంపద రెండింతలైనట్లు వెల్లడించింది. అలాగే వారి సంఖ్య సైతం క్రితం ఏడాదితో పోలిస్తే 39 శాతం పెరిగినట్లు పేర్కొంది. ‘ఈనీక్వాలిటీ కిల్స్‌’ పేరిట ఈ ఏడాది ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్‌ తన నివేదికను సోమవారం విడుదల చేసింది.

నివేదికలో ఇతర కీలకాంశాలు...

* మహమ్మారి కారణంగా జీవనాధారం దెబ్బతిని భారత్‌లోని 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గింది. అదే సమయంలో బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది.

* దేశ సంపదలో 45 శాతం తొలి పది మంది ధనవంతుల వద్దే ఉంది. అట్టడుగున ఉన్న 50 శాతం మంది వద్ద 6 శాతం సంపద మాత్రమే ఉంది.  

* దేశ ధనవంతుల జాబితాలో తొలి 100 స్థానాల్లో ఉన్న వ్యక్తుల సంపద విలువ 2021లో రూ.57.3 లక్షల కోట్లకు చేరింది.

* భారత్‌లోని తొలి పది మంది ధనవంతుల సంపదతో దేశంలో ఉన్న పిల్లలందరికీ ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యను 25 ఏళ్ల పాటు ఉచితంగా అందించొచ్చు. 

* అత్యంత ధనవంతులైన తొలి 98 మంది సంపద.. అట్టడుగు 40 శాతంలో ఉన్న 55.5 కోట్ల మంది పేద ప్రజల సంపదతో సమానం.

* తొలి పది మంది ధనవంతులు రోజూ రూ.10 లక్షలు ఖర్చు చేస్తే వారి సంపద మొత్తం కరిగిపోవడానికి 84 సంవత్సరాలు పడుతుంది.

* దేశంలోని బిలియనీర్లు, మల్టీ-మిలియనీర్లపై ఒక శాతం ‘వెల్త్‌ ట్యాక్స్‌’ విధిస్తే ఏటా 78.3 బిలియన్ డాలర్లు వసూలవుతాయి. దీంతో దేశంలో ఏ ఒక్కరూ వైద్యం కోసం తమ జేబు నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం రాదు. పైగా 30.5 బిలియన్ డాలర్ల మిగులు కూడా ఉంటుంది. 

* తొలి 98 బిలియనీర్ల సంపదపై 4 శాతం పన్ను విధిస్తే వచ్చే డబ్బుతో అంగన్‌వాడీ సేవలు, పోషణ్‌ అభియాన్‌, కిశోర బాలికల కోసం తెచ్చిన పథకాలు కలిగిన మిషన్‌ పోషణ్‌ 2.0 పథకాన్ని 10 ఏళ్ల పాటు నిర్వహించవచ్చు.

* 2021-22 బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు సరిపడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆరోగ్య రంగానికి కేటాయించిన నిధులు క్రితం ఏడాదితో పోలిస్తే 10 శాతం తగ్గాయి. విద్యకు మాత్రం నిధులు 10 శాతం పెరిగినప్పటికీ.. జీడీపీలో వాటాపరంగా చూస్తే మాత్రం తక్కువ.

* భారత్‌లో ఇప్పటికీ 93 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరి సామాజిక భద్రత కోసం తెచ్చిన పథకాలకు క్రితం ఏడాదితో పోలిస్తే 2021-22 బడ్జెట్‌ కేటాయింపుల్లో 1.5 శాతం కోత విధించారు.

* ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాన్ని ప్రైవేటుపరం చేసే దిశగా ఉన్న ప్రభుత్వ విధానాలు దేశంలో అసమానతలకు ఆజ్యం పోస్తున్నాయి. తల్లిదండ్రులు తమ కుటుంబ ఆదాయంలో 15 శాతానికిపైగా కేవలం స్కూలు ఫీజుల కోసమే వెచ్చించాల్సి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని