Anand Mahindra: 900 మంది ఉద్యోగుల తొలగింపు.. మహీంద్రా ఏమన్నారంటే!

జూమ్‌ కాల్‌లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో బెటర్‌.కామ్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌ క్షమాపణలు

Updated : 10 Dec 2021 13:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జూమ్‌ కాల్‌లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో బెటర్‌.కామ్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌ క్షమాపణలు తెలిపారు. ఉద్యోగులను తొలగించడం సరైన చర్యే అని అన్న ఆయన.. అయితే ఆ నిర్ణయాన్ని వెల్లడించడంలో తప్పుడు విధానాన్ని అవలంబించానని పేర్కొన్నారు. తన పొరబాటుకు మన్నించాలని కోరారు. దీనిపై తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. విశాల్‌ గార్గ్‌ చర్యలను తప్పుబట్టారు.

అమెరికాకు చెందిన ప్రముఖ గృహ రుణాలు, తనఖా సంస్థ బెటర్‌.కామ్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌.. ఇటీవల జూమ్‌ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల సమర్థత, పనితీరు తదితర కారణాలతోనే వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విశాల్‌ నిన్న.. తన ఉద్యోగులకు లేఖ రాశారు. ‘‘ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం సరైందే. అయితే ఆ నిర్ణయాన్ని నేను ప్రకటించిన విధానం.. ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. ఉద్యోగులకు తగిన గౌరవం, ప్రశంసలు ఇవ్వడంలో నేను విఫలమయ్యా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. క్షమించండి’’ అని అందులో పేర్కొన్నారు.

విశాల్‌ గార్గ్‌ క్షమాపణలపై తాజాగా ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో స్పందించారు. ఓ మీడియా కథనాన్ని షేర్‌ చేస్తూ.. ‘‘ఇలాంటి ఘోరమైన తప్పిదం తర్వాత కూడా ఓ సీఈవో బయటపడి రాణించగలరని మీరు అనుకుంటున్నారా? ఆయనకు రెండో అవకాశం ఇవ్వడం సరైందా? కాదా?’’ అంటూ సందేహాన్ని వెలిబుచ్చారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. అలాంటి సీఈవో ఎప్పటికీ రాణించలేరని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని