ఎఫ్ఆర్‌డీఐ బిల్లులో ఏముంది?

ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు అంటే ఏంటి? ఈ బిల్లులో ఏముంది త‌దిత‌ర విష‌యాలు తెల‌సుకుందాం.

Published : 20 Dec 2020 14:14 IST

ఎఫ్ఆర్‌డీఐ బిల్లు అంటే..మ‌న దేశంలో ఉన్న బ్యాంకులు, బీమా సంస్థ‌లు ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు దివాళా స్మృతిని (ఇన్‌సాల్వేన్సీ అండ్ బ్యాంక్‌ర‌ప్ట‌సీ కోడ్) ని అమ‌లు చేసే విధానాన్ని తెలియ‌జేస్తుంది ఎఫ్ఆర్‌డీఐ బిల్లు. ఈ బిల్లుకు చ‌ట్ట‌స‌భ‌ల్లో ఆమోదం ల‌భిస్తే
వివిధ ఆర్థిక సంస్థ‌ల ప‌నితీరు, న‌ష్ట సంభావ్య‌త‌ను ముందుగా అంచ‌నా వేసి వాటిని కేట‌గిరీలుగా విభ‌జించ‌డం త‌దిత‌ర వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించే రెగ్యులేట‌రీ సంస్థ ఏర్పాట‌వుతుంది.

ఏ ఆర్థిక సంస్థ అయినా దివాళా తీయ‌డం ద్వారా ఆ ప్ర‌భావం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఛిన్నాభిన్నం చేయ‌కుండా ఉండేందుకు ముందుగా తీసుకునే నివార‌ణ చ‌ర్య‌ల‌ను సూచించేదిగా ఈ బిల్లును చెప్ప‌వ‌చ్చు.

ప్ర‌స్థానం ఇలా…

ప్ర‌పంచంలో ఏ మూల‌నైనా సంక్షోభం ఏర్ప‌డిన త‌రువాత జ‌రిగే ప‌రిణామం మ‌ళ్లీ అలాంటి సంక్షోభం రాకుండా విధానాలు రూపొందించుకోవ‌డం. 2008 లో ఆర్థిక సంక్షోభం త‌లెత్తిన స‌మ‌యంలో యూఎస్ఏలో కొన్ని బ్యాంకుల‌కు బెయిల్ అవుట్ చేయ‌డం తెలిసిందే. అయితే లెమ‌న్ బ్ర‌ద‌ర్స్ బ్యాంకు బెయిల్ అవుట్ ప్ర‌జ‌లు వ్య‌తిరేకించ‌డంతో
ఆ నిర్ణ‌యాన్నియూఎస్ ప్ర‌భుత్వం వెన‌క్కు తీసుకోవ‌డం, త‌రువాత ఆ బ్యాంకు కుప్ప‌కూల‌డం జ‌రిగింది. చేతులు కాలాక మందు రాసుకోవ‌డం కంటే ముందుగానే నియ‌త్రించిన‌ట్ట‌యితే ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలు కాకుండా చూసుకోవ‌చ్చ‌నే ఉద్దేశంతో అప్ప‌టిలో ప్ర‌పంచ దేశాలు ఇటువంటి (ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌)చ‌ట్టాన్ని తీసుకురావాలి అని నిర్ణ‌యించుకున్నాయి. ఆ కార్య‌క్ర‌మంలో భాగంగా మ‌న దేశంలో ఈ బిల్లును ప్ర‌తిపాదించింది కేంద్ర ప్ర‌భుత్వం .

ఎందుకింత‌ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుందంటే

ప్ర‌స్తుతం ఉన్న డిపాజిట‌రీ ఇన్సురెన్స్ క్రెడిట్ గ్యారంటీ యాక్టు,1961 (డిపాజిట‌రీ ఇన్సురెన్స్) ఖాతాదార్ల సొమ్ము కు భ‌ద్ర‌త
క‌లిగించేది. ఫైనాన్షియ‌ల్ రిజ‌ల్యూష‌న్ అంటే ఆర్థిక సంస్థ‌లు వాటి ప‌నితీరు, నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యాల‌ అంచ‌నా మొద‌లైన వాటిని ప‌ర్య‌వేక్షించేది. ఆ రెండు సంస్థలు క‌లిసి ఏర్ప‌డేది ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్ బోర్డు ఏర్పాటు చేసేందుకు బిల్లు ప్ర‌తిపాదించింది. ఇటు సాధార‌ణ ఖాతాదారుల‌కు అటు పెట్టుబ‌డి దారుల‌కు సంబంధించి కావ‌డంతో అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ బిల్లు అమ‌లైతే ప్ర‌స్తుతం ఉన్న డిఐజీసీసీ సంస్థ ఉండ‌దు కాబ‌ట్టి ప్ర‌స్తుతం రూ. ల‌క్ష గ్యారంటీగా ఉన్న ప్ర‌భుత్వం ఇక నుంచి ర‌క్ష‌ణ‌గా ఉండ‌ద‌నే అనుమానం పెనుభూత‌మై దేశ‌మంతా చ‌ర్చ‌కు దారితీసింది.
ప్ర‌స్తుతం డిపాజిట్ రూ. ల‌క్ష‌కు గ్యారంటీగా ఉన్న‌ డీఐజీసీసీ కి బ‌దులు వ‌చ్చే సంస్థ ఎంత మొత్తం వ‌ర‌కూ బీమా ఇస్తుంద‌నే విష‌యం ఇంకా వెల్ల‌డించాల్సి ఉంది.

బెయిల్ ఇన్ అనే ఒక ప‌దం ఇందులో చాలా కీల‌క‌మైంది. దీని ఆధారంగానే ప‌లు పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

బెయిల్ ఇన్ అంటే…

ఈ ప్ర‌తిపాదిత బిల్లులో 12 వ చాప్ట‌ర్ లో ఉన్న 52 వ క్లాస్ బెయిల్ ఇన్ అనే దానికి వివ‌ర‌ణ ఇస్తుంది. బ్యాంకులు గ‌తంలో డిఫాల్టు చెందితే ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల డ‌బ్బుని వినియోగించి బెయిల్ అవుట్ (నిధుల స‌మ‌కూర్పు) జ‌రిపేది. ఇది చాలా దేశాల్లో గ‌తంలో జ‌రిగింది. ఇలాంటి ప‌రిణామాలు భ‌విష్య‌త్తులో పునార‌వృతం కాకుండా ఉండేందుకు తీసుకునే చ‌ర్య‌లుగా దీన్ని చెప్ప‌వ‌చ్చు. ఈ బెయిల్ ఇన్ తో ప్ర‌జ‌ల డ‌బ్బుతో కాకుండా ఆ సంస్థ‌ల్లో భాగంగా ఉన్న వ్య‌క్తుల‌కు ఈ భారాన్ని స‌ర్దుబాటు చేసే అవ‌కాశం ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా ఆందోళ‌న చెందొద్ద‌ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప‌లు మార్లు చెప్పారు. ప్ర‌ధాన మంత్రి మోదీ ఈ విష‌యంపై స్పందించి బ్యాంకులు, ఫిక్సిడ్ డిపాజిట్ల‌నుంచి డ‌బ్బును ఉప‌సంహ‌రించొద్ద‌ని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని