ఇండెమ్నిటి బేసెడ్ ఆరోగ్య బీమా అంటే ఏంటి..

సాధ్య‌మైనంత వ‌ర‌కు స‌హా-చెల్లింపులు, ఉప‌-ప‌రిమితులు లేని పాల‌సీల‌ను ఎంచుకోవ‌డం మంచింది

Updated : 30 Aug 2022 15:24 IST

ప్ర‌ణాళిక‌లో లేని వైద్య ఖ‌ర్చుల‌ను ఎదుర్కునేందుకు ఏర్పాటు చేసుకునే బ‌ల‌మైన క‌వ‌చ‌మే ఆరోగ్య‌బీమా. సాధార‌ణంగా న‌ష్ట‌ప‌రిహార ఆధారిత‌(ఇండెమ్నిటి బేసెడ్‌) ఆరోగ్య బీమా పాల‌సీల‌నే చాలా వ‌ర‌కు కొనుగోలు చేస్తుంటాం. వీటినే మెడిక్లెమ్ పాల‌సీ అని కూడా పిలుస్తారు. 

నష్టపరిహార-ఆధారిత ఆరోగ్య బీమా పాలసీలు, సాధారణంగా చికిత్స స‌మ‌యంలో అయ్యే ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌ను.. పాల‌సీ మొత్తం బీమా ప‌రిమితికి లోబ‌డి చెల్లిస్తాయి. ఇవి వ్య‌క్తులు, కుటుంబం, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు కోసం రూపొందించిన సాదార‌ణ‌, స‌మ‌గ్ర ఆరోగ‌బ్య బీమా పాల‌సీలు. 

కవరేజ్..
పేరుకు త‌గిన‌ట్లుగానే న‌ష్ట‌ప‌రిహారం సూత్రంపై ఆధార‌ప‌డి ఈ పాల‌సీలు ప‌నిచేస్తాయి. అన‌గా పాల‌సీలో పేర్కొన్న ప‌రిమితి మేర‌కు పాల‌సీదారునికి అయిన వైద్య ఖ‌ర్చుల‌ను బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. ప్రీ- హాస్పిట‌ల్ ఛార్జీలు, ఇన్-పేషెంట్ ట్రీట్‌మెంట్ ఖ‌ర్చులు.. డాక్ట‌ర్ ఫీజుతో స‌హా, ఐసీయూ, గ‌ది ఛార్జీలు, డ‌యాగ్న‌స్టిక్ ప‌రీక్ష‌లు, స‌ర్జ‌రీ, మందులు, అదేవిధంగా పోస్ట్‌- హాస్ప‌ట‌ల్ ఖ‌ర్చులు, డే-కేర్ ట్రీట్‌మెంట్ ఖ‌ర్చులు మొద‌లైన‌వి క‌వ‌ర్ చేస్తుంది.  ఈ ప్లాన్లు కోవిడ్‌-19 వైద్యానికయ్యే ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేస్తాయి. అయితే పాల‌సీదారుడు క‌నీసం 24 గంట‌ల‌పాటు ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఈ పాల‌సీని క్లెయిమ్ చేసుకునే వీలుంది. 

పాల‌సీలు వైద్య ఖ‌ర్చుల‌ను అన్నింటిని చెల్లిస్తాయి. కానీ ఒక్కోసారి పీపీఈ కిట్లు వంటి కొన్ని వినియోగ వ‌స్తువుల‌ను విడిగా కొనుగోలు చేసి బిల్లు విడిగా చేస్తే, అటువంటి వాటి ఖ‌ర్చును చెల్లించ‌క‌పోవ‌చ్చు. ఇందుకోసం బీమా సంస్థ‌ని సంప్ర‌దించవ‌చ్చు. కొత్త‌గా వ‌చ్చే న‌ష్ట‌ప‌రిహార-ఆధారిత‌ ఆరోగ్య బీమా ప‌థ‌కాలు 30 రోజుల వెయిటింగ్ పిరియ‌డ్‌తో వ‌స్తున్నాయి. ఈ పిరియ‌డ్ ముగిసిన త‌రువాత మాత్ర‌మే కోవిడ్ సంబంధిత చికిత్స ఖ‌ర్చులు క‌వ‌ర్ అవుతాయి. మీరు ఇప్ప‌టికే పాల‌సీ తీసుకుని ఉంటే, కోవిడ్ ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌ను ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. 

నగదు రహిత చికిత్స..
బీమా సంస్థలు సాధారణంగా వివిధ వైద్య సదుపాయాల‌ను అందించే ఆసుప‌త్రల‌తో ఒప్పందం చేసుకుంటాయి.  నష్టపరిహార-ఆధారిత ఆరోగ్య బీమా పథకాలు కొనుగోలు చేసిన‌ పాలసీదారులకు ఇది రెండు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మొద‌టది,   వివిధ ఆసుప‌త్రుల నుంచి నాణ్యమైన చికిత్సను అందించే ఆసుప‌త్రిని ఎంచుకునే సౌలభ్యాన్ని పొందుతారు. రెండవది, భాగ‌స్వామ్య ఆసుప‌త్రుల‌లో న‌గ‌దు ర‌హితంగా చికిత్స పొంద‌డం.. అంటే మెడిక‌ల్ బిల్లును ఆసుప‌త్రిలో ఉండే ఇన్సురెన్స్ ప్రొవైడ‌ర్ నేరుగా ప‌రిష్క‌రిస్తారు. దీంతో పాల‌సీదారుడు ఏవిధ‌మైన (స‌హ‌-చెల్లింపులు త‌ప్ప‌) చెల్లింపులు చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఇన్సురెన్స్ పాల‌సీ కొనుగోలు చేసే ముందు న‌గ‌దు ర‌హిత సౌక‌ర్యాల‌ను అందించే బీమా సంస్థ.. నెట్‌వ‌ర్క్‌ ఆసుప‌త్రులు ద‌గ్గ‌ర‌లో ఉన్న‌యో.. లేదో.. తెలుసుకోవ‌డం మంచింది. 

స‌హా- చెల్లింపులు, ఉప‌- ప‌రిమితులు..
వైద్య ఖ‌ర్చుల నిమిప్తం అయిన మొత్తం ఖ‌ర్చులో పాల‌సీదారుడు కూడా కొంత శాతం చెల్లించాల్సి వ‌స్తే, దానిని స‌హ చెల్లింపులు అంటారు. ఆరోగ్య బీమాలో అన‌వ‌స‌ర‌మైన క్లెయిమ్‌ల‌ను త‌గ్గించేందుకు ఈ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. పాల‌సీలో పేర్కొన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం వైద్యానికి అయ్యే మొత్తం ఖ‌ర్చులో కొంత శాతం బీమా సంస్థ చెల్లిస్తే, మిగిలిన‌ శాతాన్ని లేదా నిర్థిష్ట మొత్తాన్ని పాల‌సీదారుడు చెల్లించాల్సి ఉంటుంది. అధిక శాతం న‌ష్ట‌ప‌రిహార-ఆధారిత బీమా పాల‌సీలు ఈ నిబంధ‌న‌ల‌తో వ‌స్తాయి. ఎక్కువ స‌హా చెల్లింపులుతో వ‌చ్చే పాల‌సీల ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. 

ఉదాహ‌ర‌ణ‌కి, ఆకాశ్‌కి రూ.50వేల స‌హా చెల్లింపు నిబంధ‌న‌తో రూ. 5ల‌క్ష‌ల క‌వ‌ర్ చేసే ఆరోగ్య బీమా పాల‌సీ ఉంద‌నుకుందాం. ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో అత‌ను ఆసుప‌త్రిలో చేరితే, వైద్యానికి రూ. 5 ల‌క్ష‌లు ఖ‌ర్చు అయ్యింద‌నుకుందాం. ఈ సంద‌ర్భంలో బిల్లు మొత్తం రూ. 5 ల‌క్ష‌ల‌లో  రూ.50వేలు ఆకాశ్ చెల్లిస్తే, మిగిలిన రూ.4.5 ల‌క్ష‌ల‌ను బీమా సంస్థ చెల్లిస్తుంది. 

ఈ ఆరోగ్య బీమా పాల‌సీల‌కు కొన్ని ఉప‌-ప‌రిమితులు కూడా ఉండే అవ‌కాశం ఉంది. గ‌ది, ఇత‌ర అనుబంధ ఖ‌ర్చుల‌పై ఇవి వ‌ర్తిస్తాయి. పాల‌సీలో పేర్కొన్న ఉప‌-ప‌రిమితికి మించిన అద్దె ఉన్న గ‌దిని మీరు ఎంచుకుంటే, దానికి త‌గిన‌ట్లుగా ఇన్‌-పేషెంట్ హాస్ప‌ట‌లైజేష‌న్ క్లెయిమ్‌లో త‌గ్గింపు ఉంటుంది.  అందువ‌ల్ల న‌ష్ట‌ప‌రిహార ఆధారిత ఆరోగ్య బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేసేప్పుడు గ‌ది అద్దెలు, ఇత‌ర వైద్య ఖ‌ర్చుల‌పై ఉప ప‌రిమితులు లేని పాల‌సీల‌ను కొనుగోలు చేయ‌డం మంచిది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని