క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల‌పై సెబీ ప్ర‌త్యేక దృష్టి ఎందుకు ?

ఇటీవ‌ల రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చిన రేటింగ్స్‌లో లోపాల కార‌ణంగా సెబీ రంగంలోకి దిగింది.....

Published : 21 Dec 2020 16:15 IST

ఇటీవ‌ల రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చిన రేటింగ్స్‌లో లోపాల కార‌ణంగా సెబీ రంగంలోకి దిగింది​​​​​​​.

ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చిన‌ ఆర్థిక సంస్థ‌ల రుణ సంక్షోభంలో రేటింగ్ ఏజెన్సీల పాత్రను దృష్టిలో ఉంచుకుని ఇక్రా లిమిటెడ్ సిఈఓను సెలవుపై పంపారు. ఈ సంస్థలు ఐఎల్ & ఎఫ్ఎస్‌, డీహెచ్ఎఫ్ఎల్‌ వంటి కార్పొరేట్ గ్రూప్‌ల‌కు అధిక గ్రేడ్‌లను ఇచ్చాయి. ఈ రేటింగ్ ఇచ్చిన కొన్ని నెల‌ల్లోనే ఆ సంస్థ‌లు సంక్ష‌భంలో చిక్కుకొని, పేమెంట్లు ఆల‌స్యంగా చేయ‌డం వంటివి వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో మ్యూచువల్ ఫండ్ల‌తో పాటు ఇత‌ర స్కీముల్లో పెట్టుబ‌డులు పెట్టిన మ‌దుప‌ర్లు న‌ష్ట‌పోయారు.

అస‌లు జ‌రిగిందేంటి?

మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ స్థానిక అనుబంధ సంస్థ అయిన ఇక్రా, సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ నరేష్ ట‌క్కర్‌ను సెలవుపై పంపించింది. దీనికి కార‌ణం, ఆగస్టు 2018 వరకు ఐఎల్ & ఎఫ్ఎస్ సంస్థ‌కు AAA రేటింగ్ మంజూరు చేయడంలో లోపాలున్నాయని ఆరోపిస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వ‌ద్ద ఫిర్యాదు దాఖ‌లు కావ‌డం. AAA క్రెడిట్ ఏజెన్సీలు కేటాయించే అత్యధిక రేటింగ్, ఇది అధిక భ‌ద్ర‌త‌ను సూచిస్తుంది. ఐఎల్‌ & ఎఫ్ఎస్‌కు సెప్టెంబరులో సంక్ష‌భం ఎదురైంది. దీంతో పాటు సంస్థ‌ మాజీ ఉన్నతాధికారులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) వంటి ప్రభుత్వ సంస్థలు అరెస్టు చేశాయి.

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఏం చేస్తాయి?

నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌సిడిలు), వాణిజ్య పత్రాలు, బ్యాంక్ రుణాలు వంటి వాటికి రేటింగ్ సంస్థలు గ్రేడ్‌ల‌ను ఇస్తాయి. కేటాయించిన రేటింగ్‌లను పర్యవేక్షించడం, సంస్థ‌ ఆర్థిక స్థితి మారినప్పుడు వాటిని సవరించడం వంటివి కూడా చేస్తాయి. భారతదేశంలో ఆరు ప్రధాన రేటింగ్ సంస్థలు ఉన్నాయి. అవి, క్రిసిల్, కేర్ రేటింగ్స్, ఇక్రా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, బ్రిక్ వర్క్ రేటింగ్స్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రేటింగ్స్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. వాటిలో కొన్ని ఎస్ & పి, ఫిచ్, మూడీస్ వంటి గ్లోబల్ రేటింగ్ సంస్థలతో భాగ‌స్వామ్యం కలిగి ఉన్నాయి.

రేటింగ్ ఏజెన్సీల‌తో వ‌చ్చే స‌మ‌స్య ఏంటి?

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే గ్రేడింగ్‌లో కొన్నిసార్లు లోపాలు ఎదుర‌వొచ్చు. ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్‌, డీహెచ్ఎఫ్ఎల్ వంటి సంస్థ‌లే ఇందుకు ఆధారం. సంస్థ‌లు న‌ష్ట‌పోయే స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ AAA రేటింగ్‌లను ఇవ్వ‌డం, రుణ స్థాయిలు పెరుగుతున్నాయ‌న్న సంకేతాల‌ను జారీచేయ‌క‌పోవ‌డం త‌ప్పిదంగా చెప్ప‌వ‌చ్చు. డీహెచ్ఎఫ్ఎల్ విష‌యంలో కూఆ ఇదే విధంగా జ‌రిగింది. మంచి రేటింగ్ ఇచ్చిన సంస్థ‌లు సంక్షోభంలో చిక్కుకున్న‌ప్పుడు మాత్ర‌మే ఆ విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఫిబ్ర‌వ‌రి 3 వ‌ర‌కు కూడా డీహెచ్ఎఫ్ఎల్ ఎన్‌సీడీల‌కు కేర్ రేటింగ్స్ AAA రేటింగ్‌ను ఇచ్చింది. ఇది జ‌రిగిన నాలుగు నెల‌ల్లో సంస్థకు ఉన్న అప్పుల్లో కొన్నింటికి వ‌డ్డీల‌ను చెల్లించ‌లేక సంక్షోభంలో చిక్కుకుంది.

రేటింగ్స్ పెట్టుబ‌డుదారుల‌ను ఎలా త‌ప్పుదోవ ప‌ట్టిస్తాయి?

మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్), పెన్షన్ ఫండ్స్ , బీమా సంస్థలు ఏ బాండ్లను పెట్టుబడులు పెట్టాలో నిర్ణయించేందుకు రేటింగ్‌ను అనుస‌రిస్తాయి. మ్యూచువ‌ల్ ఫండ్లు, ఎన్‌పీఎస్‌, యులిప్స్ వంటి వాటిలో పెట్టుబ‌డులు పెట్టిన‌వారికే ఈ లాభాలైనా, న‌ష్టాలైనా వారికే చెందుతాయి. ఎన్‌సీడీల‌ను జారీ చేసి పెట్టుబ‌డుదారుల‌ నుంచి సంస్థ‌లు నిధుల‌ను స‌మీక‌రించిన‌ప్ప‌టికీ, రేటింగ్ చూసిన త‌ర్వాతే పెట్టుబ‌డుదారులు పెట్టుబ‌డులు పెడ‌తారు కాబ‌ట్టి లాభ‌, న‌ష్టాలు వారికే వ‌స్తాయి.

స‌మ‌స్య‌ను సెబీ ఎలా ప‌రిష్క‌రిస్తుంది?

ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ రేటింగ్స్‌లో పాల్గొన్న రేటింగ్ సంస్థలపై సెబి చర్యలను ప్రారంభించింది. రేటింగ్ ఇచ్చే సంస్థ‌ల డీఫాల్ట్ అవ‌కాశాల‌ను రేటింగ్ ఏజెన్సీలు త‌ప్ప‌నిస‌రిగా వెల్ల‌డించాల‌ని జూన్‌లో సెబీ ఆదేశించింది. AAA- రేటింగ్ ఇచ్చిన సంస్థ‌ల‌కు ఏడాది, రెండేళ్ల వ‌ర‌కు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉండ‌కూడ‌దు, మూడేళ్ల కాలానికి 1 శాతం వ‌ర‌కు డీఫాల్ట్ అయ్యే అవ‌కాశం ఉండ‌వ‌చ్చు. ఇలా డీఫాల్ట్ అవ‌కాశాన్ని వెల్ల‌డిస్తే సంస్థ‌ల ట్రాక్ రికార్డును కూడా విశ్లేషించే అవ‌కాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని