చెక్కు బౌన్స్ అయితే శిక్ష ఏంటి?

సాధారణంగా ప్రజలు వారి అవ‌స‌రాల కోసం రుణం తీసుకుంటారు. కొందరు ఇంటిని కొనుగోలు చేయడానికి తీసుకుంటే, మరికొందరు వ్యాపారం మొదలు పెట్టడానికి రుణం తీసుకుంటారు. ఇలా తీసుకున్న రుణాన్ని నెలనెలా ఒక నిర్దిష్ట తేదీన కొంత మొత్తాన్ని రుణ సంస్థలు రుణ‌గ్ర‌హీత బ్యాంకు ఖాతా నుంచి తీసుకుంటాయి. దీని కోసం ఎలక్ట్రానిక్ క్లియరెన్స్..

Updated : 01 Jan 2021 19:35 IST

సాధారణంగా ప్రజలు వారి అవ‌స‌రాల కోసం రుణం తీసుకుంటారు. కొందరు ఇంటిని కొనుగోలు చేయడానికి తీసుకుంటే, మరికొందరు వ్యాపారం మొదలు పెట్టడానికి రుణం తీసుకుంటారు. ఇలా తీసుకున్న రుణాన్ని నెలనెలా ఒక నిర్దిష్ట తేదీన కొంత మొత్తాన్ని రుణ సంస్థలు రుణ‌గ్ర‌హీత బ్యాంకు ఖాతా నుంచి తీసుకుంటాయి. దీని కోసం ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ (ఈసీఏస్) ఆప్షన్ లేదా చెక్కులను వారు వినియోగించుకుంటారు. ఒకవేళ నిర్దేశించిన తేదీన మీ బ్యాంకు ఖాతాలో అవసరమైన మొత్తం లేకపోవడం వలన చెక్కు బౌన్స్ అయినా లేదా ఈసీఏస్ ఫెయిల్ అయినా అది చట్ట ప్రకారం నేరం అవుతుంది.

సెక్షన్ 138, నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప‌రిధిలో చెక్కు బౌన్స్ కేసు వ‌స్తుంది. అలాగే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 లో సెక్షన్ 25 ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ (ఈసీఏస్) కేసులను పరిశీలిస్తుంది.

చెక్కు బౌన్స్ అయినా లేదా ఈసీఏస్ ఫెయిల్ అయినా రెండిటికీ పర్యవసానాలు ఒకేలా ఉంటాయి. పైన తెలిపిన చట్టాల ప్రకారం వీటికి పాల్పడిన వినియోగదారుడిని నేరస్తుడిగా పరిగణిస్తారు. దీనికి శిక్షగా అతనికి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం (కొన్ని సందర్భాల్లో రెండు సంవత్సరాల పాటు పొడిగించే అవకాశం కూడా ఉంది) లేదా చెక్కు బౌన్స్ అయిన మొత్తానికి రెండింతలు ఎక్కువగా జరిమానా విధిస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో రెండింటిని వేసే అవ‌కాశం ఉంటుంది.

ఏదైనా కారణాల వలన చెక్కులు బౌన్స్ అయినా లేదా ఈసీఏస్ ఫెయిల్ అయిన వెంటనే మీరు సంబంధిత సంస్థ వద్దకు వెళ్లి డబ్బు చెల్లించడానికి కొంత సమయం ఇవ్వవలసిందిగా కోరడం మంచిది. లేదంటే వారు మీ పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది మీకు అనేక సమస్యలతో పాటు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది.

ఒకవేళ మీరు సంస్థలో భాగస్వామి లేదా డైరెక్టర్ అయినట్లయితే, చెక్కులు జారీచేయడానికి ముందు లేదా ఈసీఏస్ చెల్లింపు సమయానికల్లా బ్యాంకు ఖాతాలో తగినంత మొత్తాన్ని సమకూర్చడం మీ బాధ్యత. లేదంటే చెక్కు మీద సంతకం చేసిన వారితో పాటు సంస్థలో భాగస్వాములుగా లేదా డైరెక్టర్లుగా ఉన్నవారందరి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు.

రుణగ్రహీత చెల్లింపులు స‌క్ర‌మంగా చేయ‌లేని పక్షంలో ఎదుర‌య్యే చ‌ట్ట‌ప‌రమైన ప‌రిణామాల‌కు న్యాయపరమైన స‌ల‌హాను తీసుకోవాలి.

అదేవిధంగా చెల్లింపుదారు / లబ్ధిదారుడు సమయానుకూలంగా చర్యలు తీసుకోవడంలో ఏవైనా లోపాలు లేదా తప్పుడు విచారణలు దాఖలు చేయడం లేదా చర్య తీసుకోవాల్సిన వ్యక్తికి స‌రైనా విధానంలో కేసు వేయ‌డం వంటి వాలి వ‌ల్ల రికవరీ కార్యకలాపాలు సుదీర్ఘం అవొచ్చు. దీంతో పాటు రుణగ్రహీతకు చట్టపరమైన ఆశ్రయం తీసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు.

లావాదేవీలు చేసే రెండు వైపుల వారు చెక్కు బౌన్స్ కు సంబంధించి చట్టపరమైన అంశాల గురించి పూర్తిగా తెలుసుకుని ఉండ‌టం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని