కొన‌డం బాధ్య‌త‌ ..అమ్మ‌డం క‌ళ‌..

సాధార‌ణంగా పెట్టుబ‌డికి సంబంధించిన సూచ‌న‌లు, వ్యూహాలు ఎలా మ‌దుపుచేయాలి అనే కోణంలోనే ఉంటాయి. వాటి ఆధారంగా మ‌దుప‌రి త‌న ల‌క్ష్యాల‌కు త‌గిన విధంగా వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప‌థ‌కాల్లో కేటాయింపులు చేస్తుంటారు...

Published : 16 Dec 2020 10:42 IST

పెట్టుబ‌డి పెట్టడం ఎంత ముఖ్య‌మో ! పెట్టుబ‌డిని ఉప‌సంహ‌రించ‌డం కూడా అంతే ముఖ్యం!

సాధార‌ణంగా పెట్టుబ‌డికి సంబంధించిన సూచ‌న‌లు, వ్యూహాలు ఎలా మ‌దుపుచేయాలి అనే కోణంలోనే ఉంటాయి. వాటి ఆధారంగా మ‌దుప‌రి త‌న ల‌క్ష్యాల‌కు త‌గిన విధంగా వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప‌థ‌కాల్లో కేటాయింపులు చేస్తుంటారు. మ‌దుప‌ర్లు త‌మ‌ పెట్టుబ‌డుల‌ను నిరంత‌రం ప‌రిశీలిస్తూ, క్ర‌మంగా మ‌దుపుచేయ‌డం ద్వారా అస్థిర‌త‌ను కూడా అనుకూలంగా మార్చుకోవ‌చ్చు.

ఇదెలా సాధ్యం అంటే

క్ర‌మంగా మ‌దుపుచేసే అల‌వాటు ఉంటే పెట్టుబ‌డుల విలువ‌ త‌గ్గిన‌పుడు కూడా మ‌దుపు చేసే అవ‌కాశం ఉంటుంది. అస్థిర‌త ప్ర‌భావంతో ధ‌ర త‌గ్గిన సంద‌ర్భంలో మ‌దుప‌ర్లు కొనుగోలు చేస్తుంటారు. ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం పెట్టుబ‌డి చేయ‌డం ఎంత ముఖ్య‌మో అనుకూల‌మైన స‌మ‌యంలో పెట్టుబ‌డిని ఉప‌సంహ‌రించ‌డం అంతే ముఖ్యం. వ్యూహం ఎప్పుడూ మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పెట్టుబ‌డిని ఎలా ఉప‌సంహ‌రించాలి అనే దానిపై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది.

ఎప్ప‌డు తీయాలి

పోర్టుఫోలియోను నిర్మించడంలో ప్ర‌ధాన ఉద్దేశ్యం మ‌దుప‌ర్లు త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకోవ‌డం. కాబ‌ట్టి ఆ ల‌క్ష్యాన్ని చేరుకున్న వెంట‌నే పెట్టుబ‌డి ఉప‌సంహ‌ర‌ణ చేయాలి. ఈ విధంగా చేయడం అటు మూల‌ధ‌న ర‌క్ష‌ణ‌కు, ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకునేందుకు రెండింటికి మేలు చేస్తుంది. దీర్ఘ‌కాలం పాటు మ‌దుపు చేసేవారు త‌మ పెట్టుబ‌డిని ల‌క్ష్యం స‌మీపిస్తున్న స‌మ‌యంలో కొంచెం ముందుగా అంటే ఒక‌టిరెండు సంవ‌త్స‌రాల ముందుగా ఉప‌సంహ‌రించి స్థిరాదాయ పెట్ట‌బ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేయాలి. త‌రువాత‌ ల‌క్ష్యానికి అవ‌స‌ర‌మైన నిధులు అవ‌స‌ర‌మైన‌పుడు ఆ ప‌థ‌కాల నుంచి పెట్టుబ‌డిని ఉప‌సంహ‌రించుకోవాలి.

స‌ర్దుబాటు చేసుకోండి

మ‌దుప‌రి త‌న ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పోర్టుఫోలియోలో ఆస్తుల కేటాయింపులు చేసుకుంటారు. కాల‌క్ర‌మేణ ఆ కేటాయింపులు మారి న‌ష్ట‌భ‌యం పెరిగే అవ‌కాశం ఉంటుంది. అదెలా అంటే మ‌దుప‌రి పెట్టుబ‌డుల్లో ఈక్విటీ భాగం విలువ పెరిగింద‌నుకుందాం. అప్పుడు పోర్టిఫోలియో లో ఈక్విటీ శాతం అధికంగా డెట్ శాతం త‌క్కువ‌గా మారుతుంది. అలాంటి స‌మ‌యాల్లో వెంట‌నే పెరిగిన ఈక్విటీ పెట్టుబ‌డిని విక్ర‌యించి , అందుకు స‌రిపోయే డెట్ లో పెట్టుబ‌డి చేసి పోర్టుఫోలియోను స‌ర్దుబాటు చేసుకోవాలి. ఇలా చేయ‌డం ద్వారా న‌ష్ట‌భ‌యాన్ని మ‌నం కోరుకున్న విధంగా ఉంచుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక మ‌దుప‌రి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసేందుకు ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌నుకుందాం. అత‌ని పోర్టుఫోలియోలో ఈక్విటీ విలువ పెరిగి మొత్తం ఆస్తుల్లో డెట్ ప‌రిమాణం శాతం త‌గ్గింద‌నుకుందాం. అప్పుడు ఆ మ‌దుప‌రి త‌న‌కు అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ భాగం ఈక్విటీ పెట్టుబ‌డులు క‌లిగి ఉంటాడు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే ఉద్యోగికి ఆ న‌ష్ట‌భ‌యం అధిక‌మ‌వుతుంది. పెరిగిన ఈక్విటీని విక్ర‌యించి త‌గ్గిన డెట్ లో పెట్టుబ‌డి చేయాలి. ఈ విధంగా చేయ‌డం మూలంగా మ‌రో లాభం ఉంది. డెట్ పెట్టుబ‌డులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భించే అవ‌కాశం మ‌దుప‌రికి ల‌భిస్తుంది.

అనుకున్న లాభం పొందితే విక్ర‌యించండి

మ‌దుప‌ర్లు స‌మీప భ‌విష్య‌త్తులో విలువ పెరుగుతంద‌ని భావించి పెట్టుబ‌డి చేస్తారు. సాధార‌ణంగా ఇవి ల‌క్ష్యం కోసం నిర్మించే పోర్టిఫోలియోలు కావు. పోర్టిఫోలియోలో టాక్టిక‌ల్ భాగం అనుకున్న లాభం పొంద‌గానే పెట్టుబ‌డిని విక్ర‌యించి ప్ర‌యోజ‌నం పొందాలి. దీనికి నిశిత‌మైన ప‌రిశీల‌న ఉండాలి. వ్యూహాత్మ‌కంగా పెట్టుబ‌డిని ఉప‌సంహ‌రించుకోవాలి.

ప‌రిమితి పెట్టుకోండి

మార్కెట్లు ఇంకా లాభ‌ప‌డ‌తాయ‌ని ఎదురుచూస్తూ ఉండ‌టం మంచిది కాదు. మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచ‌నా వేయ‌డం సుల‌భం కాదు. లాభాల‌ను స్వీక‌రించ‌కుండా ఎదురుచూడ‌టం వ‌ల్ల‌ లాభం పొందాల్సిన స‌మ‌యంలో న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంటుంది. దీనికి మంచి ఉపాయం ఏంటంటే ఒక ప‌రిమితిని పెట్టుకోవ‌డ‌మే. ఉదాహ‌ర‌ణ‌కు 20 శాతం లాభం పొందాల‌ని ప‌రిమితి పెట్టుకున్నార‌నుకుందాం. పెట్టుబ‌డి విలువ ఆ స్థాయికి చేర‌గానే వెంట‌నే విక్ర‌యించి లాభాల‌ను పొందాలి.

రాణించ‌ని వాటిని విక్ర‌యించండి

పెట్టుబ‌డి చేసేముందు అనేక విధాలుగా ఆలోచించే మ‌దుప‌ర్లు అనంత‌రం వాటిని ప‌రిశీలించ‌డంపై కూడా శ్ర‌ద్ధ పెట్టాలి. గ‌త 3-4 త్రైమాసికాలుగా వృద్ధి చెంద‌ని పెట్టుబ‌డిని విక్ర‌యించి బ‌య‌ట ప‌డాలి. రాణించ‌ని వాటిని గుర్తించి విక్ర‌యించ‌డం మంచిది. లేదంటే వాటి ప్ర‌భావం మొత్తం పోర్టుఫోలియోపై ప‌డి విలువ త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. పోర్టుఫోలియో ప‌నితీరును మ‌దింపుచేసేందుకు ఒక విధానం ఎంచుకోవాలి. దానికి స‌మాన‌మైన పెట్టుబ‌డి సాధ‌నాల‌తో గానీ, ఏదైనా సూచీతో గానీ పోల్చిచూసుకోవాలి. మార్కెట్లు లాభాల్లో ప‌య‌నిస్తున్న‌పుడు కూడా ఇంకా పెరుగుతుంద‌నే ఆశతో కొన‌సాగాల‌నిపిస్తుంది. అదేవిధంగా స‌రిగా రాణించ‌ని పెట్టుబ‌డిని విక్ర‌యించేందుకు ఆస‌క్తి క‌ల‌గ‌దు. దీని మూలంగా జ‌రుగుతున్న న‌ష్టం క‌నిపిస్తున్నా విక్ర‌యించ‌కుండా వేచిచూడ‌డం మంచిది కాదు.

పెట్టుబ‌డి ఉప‌సంహ‌ర‌ణ అనేది చాలా కీల‌క‌మైన విష‌యం. దీనికి ఒక విధానం ఏర్పాటుచేసుకోవాలి. పెట్టుబ‌డి లాభాల్లో ఉండేట‌పుడు విక్ర‌యించ‌డం ద్వారా భ‌విష్య‌త్తులో త‌క్కువ ధ‌ర‌కు విక్ర‌యించి న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డ‌దు. దీంతోపాటు ప‌న్ను విష‌యంలో కూడా శ్ర‌ద్ధ వ‌హించాలి. ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం పెట్టుబ‌డిలో వ‌చ్చేన‌ష్టాల‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని