ప్రయాణాల్లో ఏటీఎమ్‌ కార్డు పోగొట్టుకుంటే...

ప్రయాణాలలో వెంట తీసుకెళ్ళిన ఏటీఎమ్‌ కార్డు పోగొట్టుకుంటే ప్రత్యామ్నాయంగా డబ్బు ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలుసుకుందాం..

Published : 15 Dec 2020 19:58 IST

​​​​​​​ఉద్యోగంలో భాగంగా చేసే పనితో విసుగు చెంది అప్పుడప్పుడు అలసిపోతూ ఉంటారు. అలాంటి సమయాల్లో విహార యాత్రలకు వెళ్లాలనుకోవడం సహజమే. వారం నుంచి 10 రోజుల పాటు సాగే ట్రిప్‌ల కోసం ముందస్తుగానే ప్రణాళికలు రచించుకుంటారు. మిగిలిన అన్ని విషయాల్లో సర్దుకుపోయినా అందరికీ తక్షణావసరం డబ్బు. ఎక్కడికీ వెళ్లినా నగదు లేదా కార్డు లేనిదే వసతి, ఆహారం సమకూర్చుకోవడం కష్టం. నగదు తీసుకెళ్లడం ఇబ్బందిగా భావించి ఏటీఎమ్‌/డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు తీసుకుని పోవడం చాలా మందికి అలవాటు. అయితే అలాంటప్పుడు పర్స్‌ పోవడం, బ్యాగ్‌ పోగొట్టుకుంటే అప్పుడు తలెత్తే సమస్యలు చాలానే ఉంటాయి. ఇలా ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఏటీఎమ్‌ కార్డు పోగొట్టుకుంటే డబ్బు సమకూర్చుకునే మార్గాలను ఇక్కడ చూద్దాం.

మల్టీ సిటీ చెక్కు

మీ దగ్గర చెక్కు పుస్తకం ఉంటే దగ్గరలో ఉన్న బ్యాంకుశాఖకు వెళ్లి చెక్కు డ్రా చేయవచ్చు. మీ బ్యాంకు శాఖకు వెళితే వెంటనే చెక్కును నగదు రూపంలోకి మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. సమీపంలో మీ బ్యాంకు లేనప్పుడు ఈ విధంగా చేయాలి. ఏ జాతీయ బ్యాంకులోనైనా చెక్కు విత్‌డ్రా కోసం ప్రయత్నించాలి. సదరు బ్యాంకు చెక్కు కలెక్షన్‌ సెంటర్‌కు చెక్కును పంపిస్తుంది. సీటీఎస్‌ స్టాండర్ట్‌ చెక్కులను కోర్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం ఉన్న బ్యాంకు  శాఖల వద్ద నగదుగా మార్చుకునేందుకు రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది.

మొబైల్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌

మీరు విహార యాత్రకు వేరే కొత్త ప్రాంతానికి వెళ్లారు. హఠాత్తుగా మీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు పోగొట్టుకున్నట్లుగా గుర్తించారు. అప్పుడు డబ్బు కావాలంటే ఇన్‌స్టంట్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ను ఉపయోగించుకోవాలి. 
బంధువులు, స్నేహితులకు మీ మొబైల్‌ నంబరును చెప్పడం ద్వారా మీరు డబ్బు పొందవచ్చు. డబ్బు పంపే వ్యక్తి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లో లబ్ధిదారుల్లో మిమ్మల్ని చేర్చుకోవాలి.

మొబైల్‌ నంబరుకు డబ్బు పంపేందుకు ఇలా చేయాలి

  1. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా మొదట లబ్ధిదారుడి పేరు, మొబైల్‌ నంబరు, చిరునామా నమోదు చేయాలి.
  2. ఖాతాలో లబ్ధిదారుడి పేరు చేర్చగానే డబ్బు పంపే వ్యక్తి మొబైల్‌ నంబర్‌కు ఒక సెండర్‌కోడ్‌ వస్తుంది. దీన్ని డబ్బు పంపే వ్యక్తి లబ్దిదారుడికి పంపాలి.
  3. డబ్బు బదిలీ చేయగానే లబ్ధిదారుడికి రిసీవర్‌ కోడ్‌ వస్తుంది.
  4. మీరు డబ్బు ఏటీఎమ్‌లో తీసుకునేందుకు మీ మొబైల్‌ నంబరు, సెండర్‌ కోడ్‌, రిసీవర్‌ కోడ్‌ నమోదు చేస్తే చాలు. 
      ఈ సదుపాయంలో జరిగే ఒక్కో లావాదేవీకి రూ. 25 రుసుము ఉంటుంది.  ఈ విధంగా ఒక్కో లావాదేవీలో రూ. 5వేల నుంచి రూ. 10 వేల వరకూ పంపేందుకు వీలుంది.  ఒక్కో నెలలో గరిష్ఠంగా రూ. 25వేల వరకూ మాత్రమే ఈ విధంగా పొందే వీలుంది.
     
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని